- ఆరుట్లకు నేడు సీఎం రేవంత్ రెడ్డి
- ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి
- తెలంగాణ విద్యారంగానికి ఆదర్శం
ఇబ్రహీంపట్నం, మహా:
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా బుధవారం తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభోత్సవం జరగనున్నట్లు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో సరికొత్త విద్యావిప్లవానికి శ్రీకారం చుట్టేలా ఆరుట్ల గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఫైలెట్ ప్రాజెక్టు కింద నిర్మించిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. బుధవారం ఆరుట్లకు చేరుకోనున్న సీఎం… మొదటగా టీపీఎస్ ను ప్రారంభించనున్నారు. అనంతరం, పాఠశాలను సందర్శిస్తారు. తర్వాత, అల్పాహార పథకాన్ని ప్రారంభించి, విద్యార్థులతో కలిసి, బ్రేక్ ఫాస్ట్ చేయనున్నారు. అక్కడి నుంచి ప్రాథమిక పాఠశాల భవనం సందర్శించి, అక్కడి సౌకర్యాలు, క్రీడాప్రాంగణం, కంప్యూటర్ ల్యాబ్, తదితర సౌకర్యాలు పరిశీలించనున్నారు. 11గంటల తర్వాత బహిరంగసభకు హాజరుకానున్నారు.
తల్లిదండ్రులు భాగస్వామ్యం కావాలిః ఎమ్మెల్యే మల్ రెడ్డి…
పదేళ్ల విధ్వంసం తర్వాత 60ఏళ్ల ఆకాంక్షలకనుగుణంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ పునఃనిర్మాణం చేపట్టిందని, ఇందులో భాగంగా ఆరుట్ల నుంచి సరికొత్త విద్యావిప్లవానికి శ్రీకారం చుట్టినట్లు ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి చెప్పారు. నిన్నమొన్నటి వరకు ప్రభుత్వ పాఠశాలలను చిన్నచూపు చూసిన వారే నేడు అడ్మిషన్ల కోసం వెంటబడే పరిస్థితి రావటమే తమ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనంగా పేర్కొన్నారు. సర్కార్ సంకల్పంలో తల్లిదండ్రులంతా భాగస్వాములై రేపటి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే అన్నారు. ఈ ప్రాజెక్టు ఇక్కడితో పూర్తికాలేదని…. విద్యార్థులందరికీ అత్యుత్తమ విద్యనందించేందుకు త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఈ తరహా పాఠశాలలను ప్రభుత్వం నిర్మించనుందని ఆకునూరి మురళి తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు స్థానిక నాయకులు కార్యకర్తలు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.








