Mahaa Daily Exclusive

  భారత ‘తోమహాక్’ ప్రయోగం విజయవంతం…

Share

భారత ‘తోమహాక్’ ప్రయోగం విజయవంతం.
* చైనా, పాక్ గుండెల్లో వణుకు!
* పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో డీఆర్డీఓ రూపొందించిన లాంగ్ రేంజ్ క్రూజ్ క్షిపణి.
* అమెరికా అస్త్రం తోమహాక్‌కు దీటుగా పిన్ పాయింట్ అక్యురసీ.
* బ్రహ్మోస్‌కు తోడైతే శత్రువులకు ఇక విధ్వంసమే!
ఒడిశా,మహా.
భారత రక్షణ రంగ చరిత్రలో రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) సరికొత్త విప్లవానికి నాంది పలికింది. దేశ రక్షణ సామర్థ్యాన్ని అసాంతం పెంచేస్తూ.. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూజ్ మిస్సైల్ ప్రయోగాన్ని జూన్ 15న అత్యంత విజయవంతంగా నిర్వహించింది. ఒడిశా తీరంలోని ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి భూతల లక్ష్యాలపై దాడి చేసే ఈ దీర్ఘశ్రేణి క్రూజ్ క్షిపణిని ప్రయోగించగా, నిర్దేశిత లక్ష్యాలన్నింటినీ నూటికి నూరు శాతం విజయవంతంగా చేరుకుందని రక్షణ శాఖ అధికారికంగా ప్రకటించింది. రక్షణ రంగ నిపుణులు ఈ సరికొత్త దేశీయ ఆయుధాన్ని అమెరికాకు చెందిన ప్రపంచ ప్రసిద్ధ, అత్యంత శక్తిమంతమైన ‘తోమహాక్’ క్షిపణితో పోలుస్తుండటం విశేషం.
**అసలేమిటీ అమెరికా ‘తోమహాక్’? భారత్‌కు ఎందుకు గేమ్ ఛేంజర్?**
1983లో అమెరికా నౌకాదళంలో చేరిన తోమహాక్ క్రూజ్ మిస్సైల్ ప్రపంచ యుద్ధాల గమ్యాన్నే మార్చేసిన అస్త్రం. 1991 గల్ఫ్ యుద్ధం నుంచి నిన్నమొన్నటి ఇరాన్ ఘర్షణల వరకు అమెరికా ప్రతి ప్రధాన మిలిటరీ ఆపరేషన్‌లోనూ దీనిని గుడ్డిగా నమ్ముకుంటుంది. ఇటీవల ఇరాన్‌పై జరిగిన దాడుల్లో సైతం యూఎస్ ఏకంగా 49 తోమహాక్ క్షిపణులను ప్రయోగించి టెహ్రాన్ గుండెల్లో నిద్రపోయింది. సాధారణంగా బాలిస్టిక్ క్షిపణులు అంతరిక్షంలోకి వెళ్లి పైనుంచి దూసుకొస్తాయి కాబట్టి శత్రుదేశాల రాడార్లకు చిక్కిపోయే ప్రమాదం ఉంది. కానీ, తోమహాక్ తరహాలోనే భారత LRLACM సైతం భూమికి లేదా సముద్ర మట్టానికి అత్యంత తక్కువ ఎత్తులో, రాడార్ల కన్నుగప్పి ప్రయాణిస్తుంది. మార్గమధ్యంలోని అడ్డంకులను చాకచక్యంగా తప్పించుకుంటూ శత్రు స్థావరాన్ని అత్యంత కచ్చితత్వంతో (పిన్ పాయింట్ అక్యురసీ) ధ్వంసం చేయడం దీని ప్రత్యేకత. శత్రువు ఊహించని దూరం నుంచి, అసలు ప్రత్యర్థి గుర్తించేలోపే సమాధి చేయగలగడం వల్లే దీనిని భారత రక్షణ రంగంలో ‘గేమ్ ఛేంజర్’గా అభివర్ణిస్తున్నారు.
**సరిహద్దుల్లో మోహరిస్తే చైనా, పాకిస్థాన్ అతలాకుతలమే!**
ఈ నూతన క్షిపణి పరిధిని భారత్ అధికారికంగా ప్రకటించనప్పటికీ, ఇది దాదాపు 1000 నుంచి 1500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను సునాయాసంగా ఛేదించగలదని అంచనా. గతంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న ‘నిర్భయ్’ మిస్సైల్ ప్రాజెక్టుకు ఇది అత్యంత ఆధునిక, అప్‌గ్రేడెడ్ వెర్షన్. దీనిని భారత సరిహద్దుల్లో మోహరిస్తే శత్రుదేశాల గుండెల్లో రైళ్లు పరిగెత్తడం ఖాయం. ఈ క్షిపణి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్, రావల్పిండి (పాక్ సైనిక ప్రధాన కేంద్రం), లాహోర్, ఫైసలాబాద్, కరాచీ వంటి ప్రధాన నగరాలన్నీ భారత టార్గెట్ పరిధిలోకి వస్తాయి. అలాగే చైనా సరిహద్దుల్లో దీనిని మోహరిస్తే ఆ దేశానికి చెందిన లాసా, చెంగ్డు, కున్మింగ్, ఉరుమ్కీ వంటి అత్యంత కీలకమైన సైనిక, పరిపాలనా కేంద్రాలు మన క్షిపణి దాడి పరిధిలోకి వస్తాయి. ఈ క్షిపణిని భూమిపై నుంచే కాకుండా యుద్ధనౌకలు, జలాంతర్గాముల (సబ్‌మెరైన్స్) నుంచి కూడా ప్రయోగించవచ్చు. ఇది సాధారణ బాంబులతో పాటు అవసరమైతే అణ్వాయుధాలను సైతం మోసుకెళ్లగలదు.
**బ్రహ్మోస్‌కు తోడైతే ఆర్థికంగానూ కలిసిరానున్న వ్యూహం!**
ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్‌సోనిక్ క్రూజ్ క్షిపణిగా ‘బ్రహ్మోస్’ భారత సైన్యంలో ప్రధాన ఆయుధంగా ఉంది. అయితే, సుదీర్ఘ కాలం యుద్ధం చేయాల్సి వస్తే బ్రహ్మోస్ క్షిపణుల ధర దేశానికి భారీ ఆర్థిక భారం కలిగిస్తుంది. ఒక్కో బ్రహ్మోస్ క్షిపణి ధర దాదాపు రూ. 90 కోట్లకు పైనే ఉంటుంది. కానీ, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న ఈ సరికొత్త దేశీ తోమహాక్ (LRLACM) ఒక్కో క్షిపణి ధర సుమారు రూ. 25 కోట్లు మాత్రమే. అందువల్ల సుదీర్ఘ కాలం సాగే యుద్ధాలలో ఆర్థిక భారం లేకుండా వందల సంఖ్యలో వీటిని ప్రయోగించే వెసులుబాటు భారత్‌కు కలుగుతుంది. అత్యంత వేగంగా దూసుకెళ్లే బ్రహ్మోస్, రాడార్లకు చిక్కకుండా నిశ్శబ్దంగా వెళ్లే ఎల్ఆర్ఎల్ఏసీఎం.. ఈ రెండూ జతకలిస్తే భారత రక్షణ వ్యవస్థ శత్రువుల పాలిట యమపాశంగా మారడం ఖాయం. అయితే, నిన్న జరిగింది కేవలం మొదటి దశ పరీక్ష మాత్రమే కాబట్టి, రాబోయే రోజుల్లో మరికొన్ని కఠినమైన పరీక్షలు పూర్తి చేసుకుని ఈ క్షిపణి పూర్తిస్థాయిలో భారత సైన్యంలో చేరడానికి మరో రెండేళ్ల సమయం పట్టే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.