Mahaa Daily Exclusive

  ‘అన్నలంతా మా వెంటే.. హక్కులు కాలరాస్తే ఊరుకోం!’

Share

‘అన్నలంతా మా వెంటే.. హక్కులు కాలరాస్తే ఊరుకోం!’
* శ్రీరాంపూర్ ‘బాయిబాట’లో కార్మికులతో ముఖాముఖి.
* తల్లి కాంగ్రెస్‌తోనే కొట్లాడాం, ఈ పిల్ల కాంగ్రెస్ ఎంతంటూ సవాల్.
* సింగరేణికి బొగ్గు బ్లాకులు దక్కేలా కిషన్ రెడ్డి కృషి చేయాలని డిమాండ్.
* టీఆర్ఎస్, హెచ్ఎంఎస్ లను ఆశీర్వదించాలని కల్వకుంట్ల కవిత పిలుపు.
మంచిర్యాల,మహా.

**ఒకప్పుడు అడవిలో అన్నలు ఉన్నంత కాలం సింగరేణి అధికారులు ఎంతో పద్ధతిగా, భయభక్తులతో పని చేసేవారు. ఇప్పుడు అడవిలో అన్నలు లేరు కదా.. మనల్ని అడిగే దిక్కే లేదని యాజమాన్యం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. కానీ, గుర్తుపెట్టుకోండి బిడ్డా.. ఆ అన్నలందరూ ఇప్పుడు మా పార్టీలోనే ఉన్నారు. కార్మికులను ఏమాత్రం ఇబ్బంది పెట్టినా, వేధించినా వదిలిపెట్టే ప్రసక్తే లేదు” అంటూ కవిత చేసిన సింహగర్జన అక్కడి వారిలో తీవ్ర ఉత్కంఠ రేపింది.**

సింగరేణి కార్మికుల హక్కుల సాధన కోసం తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధినేత్రి కల్వకుంట్ల కవిత గళమెత్తారు. రాష్ట్రంలో సరికొత్త రాజకీయ శక్తిగా ఆవిర్భవించిన తమ పార్టీ, కార్మికుల పక్షాన నిరంతరం పోరాడుతుందని ఆమె స్పష్టం చేశారు. ‘బాయిబాట’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం శ్రీరాంపూర్‌లోని ఆర్‌కే-7 (RK7) మైన్‌ను సందర్శించిన కవిత.. కార్మికులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గనుల వద్ద అడుగడుగునా ఎదురవుతున్న పోలీసుల ఆంక్షలు, సింగరేణి యాజమాన్యం అనుసరిస్తున్న తీరుపై ఆమె తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు.
**కార్మికులను వేధిస్తే కేసులు తప్పవు**
గతంలో అడవిలో అన్నలు (మావోయిస్టులు) ఉన్నప్పుడు సింగరేణి అధికారులు కార్మికుల పట్ల ఎంతో పద్ధతిగా, భయభక్తులతో వ్యవహరించేవారని, ఇప్పుడు అన్నలు లేరనే ధీమాతోనే యాజమాన్యం మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని కవిత ఆరోపించారు. అయితే, ఆ అన్నలంతా ఇప్పుడు తమ పార్టీలోనే ఉన్నారని, కార్మికులను వేధించాలని చూస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకునేది లేదని గట్టిగా హెచ్చరించారు. ఉద్దేశపూర్వకంగా కార్మికులను ఇబ్బంది పెడుతున్న అధికారులపై కచ్చితంగా కేసులు పెడతామన్నారు. మైన్ లోకి వెళ్లే కార్మికులకు కనీసం త్రాగునీరు, గాలి కూడా అందించకపోవడం ముమ్మాటికీ మానవ హక్కుల ఉల్లంఘననే అని ధ్వజమెత్తారు. బయట ఎక్కడెక్కడో అత్యాధునిక టెక్నాలజీ వాడుతుంటే, సింగరేణిలో మాత్రం ఇంకా పాత టెక్నాలజీ వాడటం యాజమాన్యానికి సిగ్గుచేటన్నారు. కాంట్రాక్టర్లకు, అధికారులకు నిధులు కేటాయించే యాజమాన్యానికి కార్మికుల కష్టాలు పట్టవా అని నిలదీశారు. యంత్రాలు పాడైతే కార్మికులే సొంతంగా రిపేర్లు చేసుకుని వాడుకోవాల్సిన దుస్థితి తీసుకువచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.
**మహిళలకు వసతులేవి? పిల్లలకు బడులేవి?**
సింగరేణిలో మహిళలు సగర్వంగా పనిచేయాలనే ఉద్దేశంతో ఆనాడు పార్లమెంట్‌లో తాము గట్టిగా పోరాడామని కవిత గుర్తుచేశారు. నేడు గనుల వద్ద మహిళా సూపర్‌వైజర్లు, ఉద్యోగులను చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందని, కానీ సింగరేణి చరిత్రలో ఇప్పుడిప్పుడే అడుగుపెడుతున్న మహిళా ఉద్యోగులకు కనీస సౌకర్యాలు కల్పించకపోవడం విచారకరమన్నారు. అలాగే, ఐటీ (ఆదాయపు పన్ను) కటింగ్‌ల వల్ల కార్మికులు ఏడాదిలో రెండు నెలల జీతాన్ని కోల్పోతున్నారని, ఆ పరిస్థితుల్లో తమ పిల్లలను ఖరీదైన ప్రైవేట్ స్కూళ్లలో ఎలా చదివించగలరని ప్రశ్నించారు. యాజమాన్యమే చొరవ తీసుకుని కార్మికుల పిల్లల కోసం మంచి ప్రమాణాలతో కూడిన పాఠశాలలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 40 వేల మంది కార్మికులకు 80 వేల క్వార్టర్లు ఉన్నాయని, ఇద్దరికి ఒకటి చొప్పున సులభంగా ఇవ్వొచ్చని.. కానీ అధికారులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు.
**పిల్ల కాంగ్రెస్‌తో కొట్లాడలేమా..?**
కార్మికులను కలిసి సమస్యలు తెలుసుకుందామంటే నిన్న, ఇవాళ పోలీసులు అడ్డుకోవడంపై కవిత మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గనుల మీద మీటింగులు పెట్టలేదా? రాహుల్ గాంధీ వచ్చి సమావేశాలు నిర్వహించలేదా? అని సూటిగా నిలదీశారు. కార్మికుల బాధలు తెలుసుకుని క్షేత్రస్థాయిలో పోరాటం చేస్తేనే వారిని రక్షించే చట్టాలు వస్తాయని స్పష్టం చేశారు. నాడు తెలంగాణ సాధన కోసం ‘తల్లి కాంగ్రెస్’తోనే ప్రాణాలకు తెగించి కొట్లాడామని, ఇప్పుడున్న ఈ ‘పిల్ల కాంగ్రెస్’తో కొట్లాడటం తమకు ఒక లెక్కే కాదని సవాల్ విసిరారు. మైన్ మీటింగులు పెట్టుకోవడం కార్మికుల రాజ్యాంగబద్ధమైన హక్కు అని, దాన్ని అడ్డుకుంటామంటే చూస్తూ ఊరుకోబోమన్నారు.
**కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి కీలక డిమాండ్లు**
ప్రస్తుతం బొగ్గు శాఖ మంత్రిగా ఉన్న జి. కిషన్ రెడ్డి సింగరేణి మనుగడ కోసం కృషి చేయాలని కవిత డిమాండ్ చేశారు. గోదావరి వ్యాలీలో ఉన్న బొగ్గు బ్లాకులను సింగరేణికే కేటాయించేలా చూడాలని, కోల్ బ్లాక్‌ల సాధనలో సింగరేణి ప్రైవేట్ సంస్థలతో పోటీపడే దుస్థితి రాకుండా ఎక్కువ బ్లాకులు దక్కేలా ఆయన చొరవ చూపాలని కోరారు. మూసివేత దశలో ఉన్న ఆర్‌కే-7 మైన్‌ను కార్మికులు పోరాడి కాపాడుకున్నారని గుర్తుచేశారు. రాబోయే రోజుల్లో తాము కచ్చితంగా అధికారంలోకి వస్తామని, మూతపడిన అండర్ గ్రౌండ్ మైనింగ్‌ను మళ్లీ తెరిపించి లక్షలాది మంది యువతకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు.
**లాభాల్లో భారీ వాటా.. డిపెండెంట్ ఉద్యోగాల భర్తీ**
కార్మికులకు లాభాల వాటా పంపిణీలో సింగరేణి యాజమాన్యం తీవ్ర మోసానికి పాల్పడుతోందని కవిత ఆరోపించారు. సంస్థ సగానికి పైగా లాభాలను పక్కదారి పట్టిస్తూ దాచేస్తోందని, 42 శాతం వాటా ప్రకటించినా కార్మికుల ఖాతాల్లో పడే డబ్బు తక్కువే ఉంటుందన్నారు. అందుకే గతంలో అత్యధికంగా ఇచ్చిన వాటా కన్నా పదివేల రూపాయలు అదనంగా ఈసారి కార్మికులకు చెల్లించాలని డిమాండ్ చేశారు. మరోవైపు డిపెండెంట్ ఉద్యోగాల (కారుణ్య నియామకాలు) విషయంలోనూ తీరని అన్యాయం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని మెడికల్ బోర్డు అన్‌ఫిట్ చేయడం లేదని, నిబంధనల ప్రకారం నెలకు రెండుసార్లు జరగాల్సిన మెడికల్ బోర్డును ఎందుకు నిర్వహించడం లేదని నిలదీశారు. ఇటీవల డిప్యూటీ సీఎం వచ్చి కేవలం 350 మందికి మాత్రమే అపాయింట్‌మెంట్ ఆర్డర్లు ఇచ్చారని, ఇంకా రెండు వేల మంది ఉద్యోగాల కోసం దయనీయంగా ఎదురుచూస్తున్నారని వెల్లడించారు. నాలుగు నెలల్లో సర్వీసు పూర్తయ్యే వృద్ధుడిని సైతం అన్‌ఫిట్ చేయకపోతే వారి పిల్లలకు ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయని ప్రశ్నించారు. ‘అలియాస్’ పేర్ల వ్యవహారంపై కూడా కేసులు పెడుతూ కార్మికులను వేధిస్తున్నారని, దీనిపై తాము న్యాయపోరాటం చేస్తామని చెప్పారు. సింగరేణిలో అవినీతి మచ్చలేని ఏకైక నాయకుడు హెచ్ఎంఎస్ అధ్యక్షుడు రియాజ్ అని, ఆయన ఆధ్వర్యంలోని హెచ్ఎంఎస్‌తో కలిసి తమ టీఆర్ఎస్ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. కార్మికుల పక్షాన నిలిచే టీఆర్ఎస్, హెచ్ఎంఎస్‌లను నిండు మనసుతో ఆశీర్వదించాలని కవిత విజ్ఞప్తి చేశారు.