Mahaa Daily Exclusive

  ఏపీలో డిజిటల్ విప్లవానికి నాంది….

Share

ఏపీలో డిజిటల్ విప్లవానికి నాంది.
* టెక్ దిగ్గజాలు, అంతర్జాతీయ పెట్టుబడులే లక్ష్యంగా సీఎం చంద్రబాబు ముమ్మర యత్నాలు.
అమరావతి , మహా.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఇతర కీలక రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు ప్రభుత్వం సరికొత్త అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే అంతర్జాతీయ టెక్ దిగ్గజం ‘గూగుల్’ సంస్థతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా, ఏపీలో డిజిటల్ విప్లవానికి నాంది పలికేందుకు గూగుల్ ఏషియా-పసిఫిక్ ప్రెసిడెంట్‌తో సీఎం చంద్రబాబు కీలక భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ముఖ్యంగా ఏపీలో గూగుల్ పెట్టుబడులు పెట్టే అవకాశాలపై ఇరువురు లోతుగా చర్చించారు. ‘చూజ్ స్పీడ్.. చూజ్ ఏపీ’ అనే నినాదంతో పారిశ్రామిక అనుమతుల మంజూరులో పారదర్శకతను పాటిస్తూ రాష్ట్రాన్ని ఒక గ్లోబల్ టెక్ హబ్‌గా మార్చే వ్యూహాన్ని ముఖ్యమంత్రి వేగవంతం చేస్తున్నారు.
అభివృద్ధికి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌ను నిలపాలనే సంకల్పంతో, పక్కా ప్రణాళికతో ఏపీకి పెట్టుబడులు తీసుకువచ్చేందుకు సీఎం విశేషంగా కృషి చేస్తున్నారు. దీనిలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో పలు ప్రముఖ అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ భేటీలలో ఏపీలో పెట్టుబడులకు ఉన్న విస్తృత అవకాశాలను వివరిస్తూ, భారీగా పెట్టుబడులు పెట్టాలని విదేశీ సంస్థలను ఆయన ఆహ్వానించారు. సింగపూర్‌తో భారత్‌కు, ప్రత్యేకించి ఏపీకి మంచి సంబంధాలు ఉన్నాయని, సింగపూర్ నిర్మాత లీ క్వాన్ యూ అంటే తనకు చాలా అభిమానమని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
దేశాభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వ పాత్రను ముఖ్యమంత్రి కొనియాడారు. ప్రధాని మోడీ లాంటి ఆధునిక ఆలోచనలు ఉన్న వ్యక్తి దేశాన్ని ఓ అద్భుతమైన వేగంతో అభివృద్ధి చేస్తున్నారని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. భారత్ సరికొత్త సంస్కరణలతో దూసుకుపోతోందని, మోడీ నాయకత్వంలో భారత్ ప్రపంచస్థాయిలో దూసుకుపోతోందని ఆయన పేర్కొన్నారు. సింగపూర్ పర్యటనలో భాగంగా, కాపిటలిస్టుల రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి, ఏపీలో పెట్టుబడులకు ఉన్న అపారమైన అవకాశాలను ఇన్వెస్టర్లకు సవివరంగా వివరించారు. సింగపూర్ ఇన్వెస్టర్లకు మోదీ ఎకో సిస్టం పూర్తి భరోసా ఇస్తుందని, ఏపీలో పెట్టుబడులు పెట్టాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
పెట్టుబడిదారులకు నమ్మకం కలిగించేలా ఏపీలో సుస్థిర ప్రభుత్వం కొనసాగుతుందని, మళ్లీ మళ్లీ ప్రభుత్వం మారే పరిస్థితి ఉండదని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం, సాంకేతికతలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ, మారుతున్న ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్రాన్ని ప్రగతిపథంలో ముందుకు తీసుకెళ్తామని ఆయన స్పష్టం చేశారు.