Mahaa Daily Exclusive

  ఈనెల 20న ‘అన్నదాత సుఖీభవ’ ప్రారంభం!

Share

ఈనెల 20న ‘అన్నదాత సుఖీభవ’ ప్రారంభం!
* 45.5 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ. 12వేలు జమ.
* లింగంగుంట్లలో లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు.
* పొగాకు, మామిడి, ఆక్వా రైతులకు అండగా ప్రభుత్వం.
* రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు.

అమరావతి:మహా.
ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఎన్నికల హామీ మేరకు ‘అన్నదాత సుఖీభవ’ పథకం మొదటి దశ నిధులను ఈనెల 20వ తేదీన విడుదల చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ సాయంతో కలిపి రాష్ట్రంలోని దాదాపు 45.5 లక్షల మంది రైతులకు రూ. 12 వేల చొప్పున నేరుగా వారి ఖాతాల్లో జమ చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని లింగంగుంట్లలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారని మంత్రి వెల్లడించారు.
పొగాకు రైతుల సమస్యలపై మంత్రులు అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవికుమార్, డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, ఉగ్ర నరసింహారెడ్డిలతో గురువారం ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. ఆక్వా, పొగాకు, మామిడి సాగుదారులు నష్టపోకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారని వివరించారు. మార్కెట్లో పొగాకు ధర క్వింటాల్‌కు రూ. 200 తగ్గకుండా కొనుగోళ్లు సాగాలని సీఎం ఆదేశించారని పేర్కొన్నారు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం, అలాగే గత ఏడాదితో పోలిస్తే రైతులు వర్జీనియా రకం పొగాకును అధికంగా సాగు చేయడం వల్ల ధరలపై కొంత ప్రభావం పడిందని మంత్రి విశ్లేషించారు. అయితే, రైతులు నష్టపోకుండా ఉండేందుకు సీఎం చొరవతో 28 రకాల పొగాకు కంపెనీలతో చర్చలు జరిపామని, వారు పొగాకు బోర్డు వేలంలో పాల్గొనేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.

పొగాకు బోర్డు అధికారిక వేలంలో కాకుండా, దొంగచాటుగా అక్రమ కొనుగోళ్లకు పాల్పడే వ్యాపారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారని అచ్చెన్నాయుడు హెచ్చరించారు. అవసరమైతే తాము ఢిల్లీకి వెళ్లి కేంద్ర పెద్దలను కలిసి పొగాకు రైతులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. తోతాపురి మామిడి రైతులకు గత ఏడాది తరహాలోనే టన్నుకు రూ. 4 వేలు (కేజీకి రూ. 4) ప్రభుత్వం తరఫున చెల్లించాలని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. ఇకపై ఆక్వా ఫీడ్ ధరలు పెరగాలంటే ఇష్టానుసారంగా కుదరదని, రైతులు, ఫీడ్ ఉత్పత్తిదారులు, ప్రభుత్వ భాగస్వామ్యంతో ఏర్పడే ప్రత్యేక కమిటీ సమీక్ష తర్వాతే నిర్ణయం జరుగుతుందని తేల్చిచెప్పారు.
ఆక్వా రైతుల సమస్యలపై తాము ఉద్యమిస్తామంటున్న వైసీపీ నేతలకు అసలు సిగ్గుండాలని మంత్రి అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. నగరంలో సంచలనం రేపిన సాయికృష్ణ ఘటనను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం ఒక్క ‘గొడ్డలి పార్టీ’కే చెల్లిందని తీవ్రంగా మండిపడ్డారు. మళ్లీ తాము అధికారంలోకి రాలేమనే నిరాశతో వైఎస్ జగన్ సమాజంలో కుల, మతాల మధ్య తగాదాలు పెట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్ర ఇంధన, అటవీ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ.. పొగాకు బోర్డు వేలంలో అన్ని రకాల కొనుగోళ్లు సజావుగా సాగేలా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. పంట అధిక ఉత్పత్తిని సాకుగా చూపి వ్యాపారులు ధరలు తగ్గించాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. వ్యాపారస్తులు ఎట్టిపరిస్థితుల్లోనూ రైతుల వద్ద ఉన్న పొగాకు మొత్తాన్ని కొనుగోలు చేయాల్సిందేనని, రైతులను నష్టపరిచేలా వ్యవహరిస్తే ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది ఏ ప్రాంతంలో ఎంతమేర పంట సాగు చేయాలనే అంశంపై ముందుగానే రైతులతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ వివరించారు.