Mahaa Daily Exclusive

  తప్పు చేసిన వారు ఎంతటివారైనా ఉపేక్షించం…

Share

తప్పు చేసిన వారు ఎంతటివారైనా ఉపేక్షించం.
• సాయికృష్ణ కుటుంబానికి ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా.
• అదృశ్యంపై ఉన్నతస్థాయి దర్యాప్తు.
అమరావతి, మహా.
సాయికృష్ణ అదృశ్యం ఘటనలో ఆయన కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో తప్పు చేసిన వారు ఎంతటి వారైనా సరే ఉపేక్షించే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మితో పాటు ఇతర కుటుంబ సభ్యులు శుక్రవారం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. తమ కుమారుడి అదృశ్యం వెనుక ఉన్న వాస్తవాలను వెలికితీసి, తమకు తక్షణమే న్యాయం చేయాలని ఈ సందర్భంగా సాయికృష్ణ తల్లి సీఎంను వేడుకున్నారు.
బాధిత కుటుంబాన్ని ఓదార్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని వారికి భరోసా కల్పించారు. సాయికృష్ణ అదృశ్యం వ్యవహారంపై ఇప్పటికే ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించామని, వాస్తవాలను నిగ్గుతేలుస్తామని ముఖ్యమంత్రి వారికి వివరించారు. ఈ ఘటనలో విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంబంధిత సీఐని ఇప్పటికే సస్పెండ్ చేశామని, కేసుకు సంబంధించిన దర్యాప్తును పోలీస్ శాఖ మరింత వేగవంతం చేసిందని వెల్లడించారు. నిందితులు ఎవరైనా చట్టం ముందు శిక్షార్హులేనని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన సాయికృష్ణ కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.