దోషులు ఎంతటివారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు.
• రామాలయ విరాళాల చోరీ వివాదంపై స్పందించిన సీఎం యోగి.
• సాక్ష్యాలుంటే ‘సిట్’కు అందించాలని విజ్ఞప్తి.
* కాంగ్రెస్, ఎస్పీల ద్వంద్వ వైఖరిపై తీవ్ర ధ్వజం.
అయోధ్య:మహా.
అయోధ్య రామాలయంలో విరాళాలు చోరీకి గురయ్యాయన్న వివాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తొలిసారిగా స్పందించారు. ఈ వ్యవహారంలో దోషులు ఎంతటివారైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన కఠినంగా హెచ్చరించారు. శుక్రవారం అయోధ్యలో పర్యటించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రామభక్తుల మనోభావాలు దెబ్బతినేలా ఎవరూ ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని, ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని కోరారు. ఈ ఆరోపణలకు సంబంధించి ఎవరివద్దనైనా ఆధారాలు, పత్రాలు ఉంటే.. కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక విచారణ బృందానికి (సిట్) సమర్పించాలని ఆయన సూచించారు. అయోధ్య ఆలయ ట్రస్ట్ చేసిన విజ్ఞప్తి మేరకే రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసిందని, ఈ బృందం వాస్తవాలను తప్పక వెలుగులోకి తీసుకువస్తుందన్న పూర్తి నమ్మకం తనకు ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. భక్తులంతా శ్రీరాముని ఆదర్శాలైన గౌరవం, సహనం పాటించాలని, అయోధ్య, రామ జన్మభూమి ఆలయంపై ఎలాంటి దుష్ప్రచారాలకు ఒడిగట్టవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
రామాలయ వ్యవహారంలో ప్రతిపక్షాల తీరుపై ముఖ్యమంత్రి యోగి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రామాలయ ఉద్యమాన్ని కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు మొదటి నుంచి వ్యతిరేకించాయని, గత ప్రభుత్వాలు రామభక్తులు, కరసేవకులపై కఠిన చర్యలు తీసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. అయోధ్య విషయంలో కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోందని మండిపడ్డారు. రామాలయ నిర్మాణాన్ని అడుగడుగునా వ్యతిరేకించిన ఆ పార్టీ.. ఇప్పుడు బూటకపు ఆందోళనలు చేస్తోందని దుయ్యబట్టారు. న్యాయస్థానంలో సైతం రామాలయ ఉద్యమాన్ని కాంగ్రెస్ నిస్సిగ్గుగా వ్యతిరేకించిందని, అసలు రాముడే లేడంటూ సుప్రీంకోర్టులో అఫిడవిట్లు సైతం సమర్పించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి పార్టీ ఇప్పుడు రామభక్తులకు అవమానం జరిగిందంటూ విమర్శలకు దిగడం విడ్డూరంగా ఉందన్నారు. సమాజ్‌వాదీ పార్టీ సైతం రామభక్తులను వంచించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. జైశ్రీరామ్ నినాదాలు చేసిన పాపానికి కరసేవకులపై కాల్పులు జరిపి, లాఠీఛార్జీ చేయించిన వ్యక్తులు.. ఇప్పుడు ఇతరులకు నీతులు చెబుతున్నారని యోగి ఆదిత్యనాథ్ ఘాటుగా విమర్శించారు.








