Mahaa Daily Exclusive

  ఐపీఎస్ అధికారి విశాల్ గున్ని సస్పెన్షన్ పొడిగింపు…

Share

ఐపీఎస్ అధికారి విశాల్ గున్ని సస్పెన్షన్ పొడిగింపు.
*సెప్టెంబర్ 4 వరకు వేటు కొనసాగింపు.
* సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉందన్న రివ్యూ కమిటీ.
* ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ సాయిప్రసాద్.
అమరావతి:మహా.
వివాదాస్పద కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ సస్పెన్షన్‌కు గురైన ఐపీఎస్ అధికారి విశాల్ గున్ని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆయనపై ఉన్న సస్పెన్షన్ వేటును 2026 సెప్టెంబర్ 4వ తేదీ వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) జీ.సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో నమోదైన క్రైం నంబర్ 469/2024 కేసులో విశాల్ గున్నిపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రిమినల్ కేసు విచారణ పూర్తయ్యే వరకు లేదా సెప్టెంబర్ 4వ తేదీ వరకు.. ఈ రెండింటిలో ఏది ముందైతే అంతవరకు ఈ సస్పెన్షన్ నిరంతరాయంగా అమల్లో ఉంటుందని తాజా ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది.
విశాల్ గున్ని సస్పెన్షన్ వ్యవధిని సమీక్షించేందుకు 2026 జూన్ 12న ఉన్నత స్థాయి రివ్యూ కమిటీ ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సందర్భంగా కమిటీ పలు కీలక అంశాలను నిశితంగా పరిశీలించి సస్పెన్షన్‌ను మరింత కాలం పొడిగించాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. విశాల్ గున్ని ప్రస్తుతం ఉన్నత స్థాయి పోలీస్ హోదాలో ఉన్నారని, ఒకవేళ ఇప్పుడు ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేసి విధుల్లోకి తీసుకుంటే కేసులోని సాక్ష్యాలను ప్రభావితం చేసే తీవ్ర అవకాశం ఉందని కమిటీ అభిప్రాయపడింది. ఆయన తిరిగి విధుల్లోకి వస్తే ప్రస్తుతం జరుగుతున్న క్రిమినల్ కేసు విచారణ సజావుగా సాగకపోవచ్చని, విచారణ ప్రక్రియపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉందని కమిటీ తన నివేదికలో వ్యాఖ్యానించింది. ఈ నివేదికలోని అంశాలతో పాటు ఆల్ ఇండియా సర్వీసెస్ (డిసిప్లిన్ అండ్ అప్పీల్) రూల్స్-1969 నిబంధనలను కూలంకషంగా పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం, సస్పెన్షన్ కొనసాగింపునకే ఆమోద ముద్ర వేసింది.
గత వైకాపా ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న పలు వివాదాస్పద పరిణామాలు, ముఖ్యంగా ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసు లాంటి వ్యవహారాల్లో కొందరు ఐపీఎస్ అధికారుల తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమైన సంగతి విదితమే. రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ తరహా కేసుల విచారణను ముమ్మరం చేసి, చట్టాన్ని ఉల్లంఘించిన అధికారులపై కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగానే తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న విశాల్ గున్నిపై సస్పెన్షన్ వేటు వేసిన ప్రభుత్వం, తాజాగా దర్యాప్తు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగేలా చూసేందుకు ఆ సస్పెన్షన్‌ను మరికొంత కాలం పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.