Mahaa Daily Exclusive

  మూసీ పునరుజ్జీవనానికి కేంద్ర రక్షణ శాఖ పచ్చజెండా…

Share

మూసీ పునరుజ్జీవనానికి కేంద్ర రక్షణ శాఖ పచ్చజెండా.
*బాపూఘాట్‌ వద్ద ‘గాంధీ సరోవర్‌’ ప్రాజెక్టుకు లైన్‌ క్లియర్‌.
* 83.814 ఎకరాల రక్షణ భూముల వినియోగానికి లభించిన అనుమతి.
* ఈక్వలెంట్‌ వేల్యూ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ షరతుతో వర్కింగ్‌ పర్మిషన్‌ మంజూరు.
హైదరాబాద్, మహా.
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మూసీ రివర్‌ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్టులో మరో కీలకమైన మైలురాయి నమోదైంది. లంగర్‌హౌస్‌ బాపూఘాట్‌ పరిధిలో ప్రతిపాదించిన ‘గాంధీ సరోవర్‌’ ప్రాజెక్టు మౌలిక పనుల పురోగతికి కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించి గోల్కొండ ఆర్టిలరీ సెంటర్ పరిధిలోని సుమారు 83.814 ఎకరాల డిఫెన్స్ భూమిని రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకునేందుకు వీలుగా కేంద్రం నుంచి ‘వర్కింగ్ పర్మిషన్’ (పని అనుమతులు) మంజూరయ్యాయి. భారత రాష్ట్రపతి ఆమోద ముద్రతో కూడిన ఈ ప్రత్యేక అనుమతి పత్రాలు మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎమ్‌ఆర్‌డీసీ) హైదరాబాద్‌కు అందాయి.
బాపూఘాట్‌ పరిసర ప్రాంతాలను అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక, సాంస్కృతిక కేంద్రంగా తీర్చిదిద్దాలన్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి కేంద్ర రక్షణ శాఖ తీసుకున్న ఈ నిర్ణయం పెద్ద ఊరటనిచ్చింది. ప్రస్తుతం కేంద్రం అనుమతించిన ఈ 83.814 ఎకరాల రక్షణ భూమి బహిరంగ మార్కెట్ విలువ దాదాపు రూ.533.42 కోట్లు ఉంటుందని అంచనా. అయితే, ఈ భూమి బదలాయింపునకు కేంద్ర రక్షణ శాఖ ఒక ముఖ్యమైన షరతును విధించింది. ‘ఈక్వలెంట్‌ వేల్యూ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌’ (EVI) నిబంధనల ప్రకారం.. ఈ భూమికి సమానమైన విలువ కలిగిన మౌలిక సదుపాయాలను డిఫెన్స్ విభాగానికి రాష్ట్ర ప్రభుత్వం కల్పించాల్సి ఉంటుంది. ఈ షరతుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడంతో కేంద్రం తక్షణమే పనులు ప్రారంభించుకునేందుకు వీలుగా క్లియరెన్స్ ఇచ్చింది.
ఈ అనుమతులతో బాపూఘాట్ వద్ద తలపెట్టిన ‘గాంధీ సరోవర్’ ప్రాజెక్ట్ పనులు ఇకపై శరవేగంగా ముందుకు సాగనున్నాయి. మూసీ నది ప్రక్షాళనతో పాటు ఈ సరోవర్ పరిధిలో అత్యాధునిక ల్యాండ్‌స్కేపింగ్, పర్యాటక ఆకర్షణలు, పర్యావరణ పరిరక్షణ హంగులను ఎమ్‌ఆర్‌డీసీ ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయనుంది. నగర నడిబొడ్డున చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఈ ప్రాంతాన్ని సరికొత్త పర్యాటక స్పాట్‌గా మార్చేందుకు క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు.