నక్సల్ రహిత భారతే లక్ష్యం..
* తుది దశకు ‘ఆపరేషన్ కగార్’.
* ‘ట్రేస్, టార్గెట్, న్యూట్రలైజ్’ వ్యూహంతో మావోయిస్టుల నిర్వీర్యం.
* టెక్నాలజీతో కమ్యూనికేషన్ వ్యవస్థల ధ్వంసం.. సోషల్ మీడియాపై ఉక్కుపాదం.
* నక్సల్స్ కంచుకోటలన్నీ భద్రతా దళాల వశం.
* కేంద్ర హోం శాఖ కీలక ప్రకటన.
ఢిల్లీ, మహా
దేశ అంతర్గత భద్రతలో అత్యంత కీలకమైన ‘నక్సల్ రహిత భారత్’ లక్ష్య సాధన దిశగా అపూర్వమైన ప్రగతి సాధించినట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ చారిత్రాత్మక ప్రకటన చేసింది. దశాబ్దాలుగా దేశ భద్రతకు సవాల్‌గా మారిన నక్సలిజాన్ని సమూలంగా అణచివేసే చర్యలపై కేంద్రం శుక్రవారం ఒక సమగ్ర నివేదికను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా నక్సలిజాన్ని పారద్రోలేందుకు అత్యంత వ్యూహాత్మకమైన అడుగులు వేసినట్లు స్పష్టం చేసింది. ముఖ్యంగా భద్రతా దళాలు అమలు చేసిన ‘ట్రేస్, టార్గెట్, న్యూట్రలైజ్’ (గుర్తించడం, లక్ష్యంగా చేసుకోవడం, మట్టుబెట్టడం) సిద్ధాంతం విజయవంతమైందని, తద్వారా మావోయిస్టుల నెట్‌వర్క్‌ను పూర్తిగా నిర్వీర్యం చేశామని హోం శాఖ సగర్వంగా ప్రకటించింది.
ఒకప్పుడు దండకారణ్యం సహా పలు రాష్ట్రాల్లో నక్సలైట్లకు కంచుకోటలుగా, అత్యంత సురక్షిత ప్రాంతాలుగా ఉన్న కీలక స్థావరాలను భద్రతా దళాలు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు కేంద్రం వెల్లడించింది. నక్సలిజంపై జరుగుతున్న పోరులో కేవలం ఆయుధాలనే కాకుండా సరికొత్త సాంకేతిక విప్లవాన్ని అస్త్రంగా వాడుతున్నట్లు వివరించింది. ఈ క్రమంలోనే అధునాతన లొకేషన్ ట్రాకింగ్ సిస్టమ్‌లను రంగంలోకి దించి మావోల కదలికలను ఎప్పటికప్పుడు పసిగడుతున్నారు. దీనికి తోడు కాల్ లాగ్ విశ్లేషణ, మొబైల్ డేటా అనలిటిక్స్ వంటి ఆధునిక పద్ధతుల ద్వారా మావోయిస్టుల అంతర్గత కమ్యూనికేషన్ వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేసినట్లు హోం శాఖ స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో నిరంతర నిఘా ఉంచడం ద్వారా వారి డిజిటల్ ప్రచారానికి అడ్డుకట్ట వేయడంతో పాటు, నిధుల సమీకరణ, కొత్త నియామకాలకు గట్టి బ్రేక్ వేసినట్లు పేర్కొంది. సాంకేతిక పరిజ్ఞానం అందిస్తున్న కచ్చితమైన సమాచారంతో క్షేత్రస్థాయిలో ఉన్న భద్రతా దళాల కార్యాచరణ సామర్థ్యం గణనీయంగా పెరిగిందని నివేదికలో వెల్లడించింది.
**లక్ష్యం దిశగా ఆపరేషన్ కగార్..**
‘ఆపరేషన్ కగార్’ పేరుతో దేశవ్యాప్తంగా నక్సల్స్ ఏరివేతకు కేంద్రం పకడ్బందీ వ్యూహాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. 2026 మార్చి నాటికి దేశంలో మావోయిస్టుల జాడ లేకుండా చేయాలన్న స్పష్టమైన లక్ష్యంతో ఈ ఆపరేషన్ నిరంతరాయంగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా వారి కదలికలపై నిఘా వర్గాలు డేగకన్ను వేశాయి. భద్రతా దళాలతో జరిగిన వివిధ ఎన్‌కౌంటర్లలో పలువురు అగ్రనేతలు హతమవ్వగా, ఆపరేషన్ తీవ్రతతో భయపడిన మరికొంతమంది కీలక నేతలు జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. దీనికి తోడు, ప్రభుత్వ పునరావాస విధానాలకు ఆకర్షితులై భారీ సంఖ్యలో మావోయిస్టు కార్యకర్తలు, సానుభూతిపరులు కూడా వివిధ రాష్ట్రాల పోలీసుల ఎదుట లొంగిపోతుండటం నక్సల్స్ నిర్మూలనలో కేంద్రం సాధిస్తున్న విజయానికి దర్పణం పడుతోంది.







