Mahaa Daily Exclusive

  తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో భారీ ఊరట..

Share

తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో భారీ ఊరట.
* సీఎం విజయ్ బలపరీక్షపై సీబీఐ విచారణకు నిరాకరణ.
* ఆధారాల్లేని ఆరోపణలతో పిటిషన్ వేశారని కొట్టివేసిన ధర్మాసనం.
*మే 13న అసెంబ్లీలో 120 మంది సభ్యుల మద్దతుతో నెగ్గిన టీవీకే అధినేత.
ఢిల్లీ, మహా.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. రాష్ట్ర శాసనసభలో ఇటీవల ముఖ్యమంత్రి విజయ్ ఎదుర్కొన్న బలపరీక్ష వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ వి.మోహనలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. పిటిషన్‌లో పేర్కొన్న అంశాలన్నీ కేవలం అస్పష్టమైన ఆరోపణలు మాత్రమేనని ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. ఆరోపణలకు బలం చేకూర్చేలా ఎలాంటి ప్రాథమిక ఆధారాలను పిటిషనర్ కోర్టుకు సమర్పించలేకపోయారని, ఇలాంటి నిరాధారమైన వ్యాజ్యాలను తాము స్వీకరించలేమని న్యాయస్థానం అత్యున్నత ధర్మాసనం స్పష్టం చేసింది.
గత మే 13వ తేదీన అసెంబ్లీ వేదికగా జరిగిన బలపరీక్షలో ముఖ్యమంత్రి విజయ్ తన ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలాన్ని విజయవంతంగా నిరూపించుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో వీసీకే, సీపీఐ, సీపీఎం, ఐయూఎమ్ఎల్ తదితర పార్టీలు టీవీకే అధినేతకు బేషరతుగా మద్దతు పలికాయి. వీరికి తోడుగా ఏకంగా 25 మంది అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రికి అండగా నిలవడంతో ప్రభుత్వ బలం మరింత పెరిగింది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే ఈ బలపరీక్ష సమయంలో సభ నుంచి వాకౌట్ చేసింది. ఈ పరిణామాల మధ్య సీఎం విజయ్‌కు సభలో మద్దతు తెలిపిన ఎమ్మెల్యేల సంఖ్య 120కి చేరింది. తద్వారా మేజిక్ ఫిగర్ కంటే అదనంగా మరో ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతును సీఎం సాధించినట్లయింది. అయితే, ఈ బలపరీక్ష ప్రక్రియలో అక్రమాలు జరిగాయని, దీనిపై విచారణ జరిపించాలని ప్రతిపక్షాలు ఆరోపించిన నేపథ్యంలో దాఖలైన పిటిషన్‌ను తాజాగా సుప్రీం కోర్టు కొట్టివేయడంతో ప్రభుత్వానికి లైన్ క్లియర్ అయినట్లయింది.