రాష్ట్ర ఆర్థిక ప్రగతికి బ్యాంకర్లు పూర్తి సహకారం అందించాలి.
* రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
* రూ. 5,19,693 కోట్ల ప్రాధాన్యతా రంగ రుణాలతో ఏపీ ముందంజ.
* దక్షిణాది రాష్ట్రాల కంటే 137 శాతం ఎక్కువగా రుణాల పంపిణీ.
* వ్యవసాయం, ఎంఎస్‌ఎమ్‌ఈ రంగాలు, కౌలు రైతుల రుణాలపై విస్తృత సమీక్ష.
అమరావతి, మహా.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు మరింత విస్తరించేలా, పారిశ్రామిక, ఉపాధి రంగాలకు ఊతం ఇచ్చేలా బ్యాంకర్లు తమ పూర్తి సహకారాన్ని అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం 5వ బ్లాక్‌లో శుక్రవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి అధ్యక్షతన 235వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం అత్యంత ప్రాధాన్యతతో కూడి సాగింది. ఈ ఉన్నత స్థాయి భేటీలో రాబోయే 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక రుణ ప్రణాళిక (యాన్యువల్ క్రెడిట్ ప్లాన్)పై బ్యాంకర్లతో ముఖ్యమంత్రి సుదీర్ఘంగా చర్చించారు. అదేవిధంగా గత ఏడాదిలో వ్యవసాయ రంగం, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు , మహిళా స్వయం సహాయక సంఘాలు (పొదుపు సంఘాలు), కౌలు రైతులకు అందించిన రుణాల పురోగతిపై సీఎం చంద్రబాబు క్షేత్రస్థాయి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా గత 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలో జరిగిన రుణ పంపిణీ వివరాలను బ్యాంకర్లు ముఖ్యమంత్రికి నివేదించారు. గడచిన ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి అత్యధికంగా రూ. 3,86,249 కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు వారు వివరించారు. అలాగే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే ఎంఎస్‌ఎంఈ రంగానికి రూ. 1,17,357 కోట్లు, వివిధ ప్రాధాన్యతా రంగాలన్నింటికీ కలిపి మొత్తంగా రూ. 5,19,693 కోట్ల రుణాలను లబ్ధిదారులకు అందించినట్లు ఎస్ఎల్‌బీసీ ప్రతినిధులు వెల్లడించారు. దక్షిణ భారతదేశంలోని ఇతర ప్రధాన రాష్ట్రాలతో పోల్చి చూస్తే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రుణాల పంపిణీ లక్ష్యం కంటే అత్యధికంగా 137 శాతం మేర నమోదైనట్లు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. గణాంకాలను పరిశీలించిన ముఖ్యమంత్రి.. బ్యాంకర్లకు పలు కీలక సూచనలు చేస్తూ, రాబోయే రోజుల్లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు.
రాష్ట్ర పురోగతిలో కీలక పాత్ర పోషిస్తున్న ఈ ఎస్ఎల్‌బీసీ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) జీ. సాయి ప్రసాద్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ & చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆశిష్ పాండే, కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ డైరెక్టర్ నీలమ్ అగ్రవాల్ పాల్గొని మాట్లాడారు. వీరితో పాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజినల్ డైరెక్టర్ ఏవో బషీర్, నాబార్డ్ జనరల్ మేనేజర్ కేవీఎస్ ప్రసాద్, వివిధ ప్రభుత్వ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ఉన్నతాధికారులు మరియు ప్రముఖ బ్యాంకుల ప్రతినిధులు హాజరై వార్షిక రుణ ప్రణాళికల విజయవంతానికి తమ కార్యాచరణను పంచుకున్నారు.








