సింగరేణిపై బీజేపీ చిల్లర రాజకీయాలు మానుకోవాలి.
* బొగ్గు బ్లాకులను ప్రైవేటుపరం చేస్తూ ఏ మొహం పెట్టుకుని పర్యటిస్తారు?.
* సంస్థను దెబ్బతీసేందుకు బీజేపీ, భారాసల కుమ్మక్కు.
* ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ తీవ్ర ధ్వజం.
హైదరాబాద్, మహా.
సింగరేణి సంస్థపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఇకనైనా తన చిల్లర రాజకీయాలను మానుకోవాలని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సింగరేణి గురించి మాట్లాడే కనీస నైతిక అర్హత గానీ, ఆ ప్రాంతంలో పర్యటించే హక్కు గానీ ఆ పార్టీ నేతలకు ఎంతమాత్రం లేదని ఆయన తేల్చిచెప్పారు. లాభాల బాటలో పయనిస్తున్న బొగ్గు బ్లాకులను సైతం ప్రైవేటు శక్తులకు కట్టబెట్టాలని నిర్ణయించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తున్న ఆ పార్టీ నాయకులు.. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని సింగరేణి కార్మికుల వద్దకు వెళ్తున్నారని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఈ ద్వంద్వ వైఖరి ద్వారా బీజేపీ రాజకీయంగా ఎంతటి దౌర్భాగ్య స్థితికి దిగజారిందో రాష్ట్ర ప్రజలందరికీ స్పష్టంగా అర్థమవుతోందని ఆయన ఎద్దేవా చేశారు.
సింగరేణి సంస్థ మనుగడను దెబ్బతీసేందుకు బీజేపీ, భారాస (బీఆర్ఎస్) పార్టీలు రెండు కలిసి ఉమ్మడిగా కుట్రలు పన్నుతున్నాయని అద్దంకి దయాకర్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ రెండు పార్టీలు పైకి బద్ధ శత్రువుల్లా నటిస్తున్నప్పటికీ.. తెరవెనుక మాత్రం ఇరువురూ రాజకీయ మిత్రులేనని ఆయన విమర్శించారు. కేవలం తమ రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసమే సింగరేణిని చుట్టుముట్టి నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా బొగ్గు గనులను విచ్చలవిడిగా ప్రైవేటీకరిస్తున్న విధానంపై, ముఖ్యంగా సింగరేణిని సైతం ప్రైవేటుపరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తక్షణమే స్పందించి తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
విలువైన జాతీయ సంపదైన బొగ్గు గనులను కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతున్న కాషాయ పార్టీకి, బొగ్గు నిల్వలపై మాట్లాడే కనీస అర్హత కూడా లేదని నిలదీశారు. దశాబ్దాల చరిత్ర కలిగిన సింగరేణి సంస్థను ప్రైవేటీకరణ ముప్పు నుంచి అడుగడుగునా కాపాడింది, కార్మికులను నిరంతరం ఆదుకుంటున్నది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని అద్దంకి దయాకర్ ఈ సందర్భంగా ఉద్ఘాటించారు.








