‘ ‘తెలంగాణ ప్రజలు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చారు.కానీ బీఆర్ఎస్ మాత్రం ఈ ప్రజా ప్రభుత్వాన్ని పడగొడతామని అంటున్నది” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు నెలల కిందట ఒక కార్యక్రమంలో వ్యాఖ్యానించారు.”కొట్లాడి సాధించుకున్న రాష్ట్రంలో కోరి,రెండుసార్లు కొరివి దెయ్యాన్ని తెచ్చుకున్నాం.మళ్లీ అలాంటిది జరగదు” అని కూడా ఆయన అన్నారు. ఆయన వ్యాఖ్యల వెనుక సీఎంగా తనకున్న సమాచారం,బిఆర్ఎస్ నాయకుల కదలికల వ్యవహారంపై అందిన ‘ఇన్ పుట్స్’ కారణం కావచ్చు. సోమవారం నాడు తెలంగాణలో నాలుగైదు ప్రాంతాల్లో జరిగిన ఘటనలు పలు అనుమానాలకు ఆస్కారం కలిగిస్తున్నాయి.మాజీ సర్పంచుల ఆందోళనలు,ఆటో డ్రైవర్ల ఉద్యమాలు.. ఇతర అంశాలు ఒక ఎత్తు.వికారాబాద్ జిల్లా కలెక్టర్ పై రాళ్లతో జరిగిన దాడి మరో ఎత్తు! ఫార్మా కంపెనీ ఏర్పాటు కోసం భూసేకరణ విషయంలో జిల్లా కలెక్టర్ వెళ్ళినప్పుడు దాడి చేయడం కాకతాళీయం కాకపోవచ్చు. కొన్ని రాజకీయ శక్తుల,సంఘ విద్రోహులు,రేవంత్ రెడ్డి వ్యతిరేక మనుషుల ప్రణాళిక రచనో,సహకారమో,ప్రోత్సాహమో,రెచ్చగొట్టడమో జరగకపోతే ప్రజలు స్వచ్ఛందంగా రాళ్లతో దాడికి పాల్పడతారని భావించడం కష్టం.ఈ ఘటనలన్నింటినీ వేర్వేరుగా చూడడానికి వీలు లేదు.వీటన్నింటినీ ఒక దారంతో కలిపి చూస్తే భారీ ప్రణాళిక,అంతకు మించిన కుట్ర కూడా కనబడే అవకాశాలు తోసిపుచ్చలేం. ఫ్యాప్సికం,టమాటా,ఆలుగడ్డ,కొత్తిమీర వంటి పంటలు పండే పొలాల్లో ‘అశాంతి’, ‘అలజడి’కి సంబంధించిన ప్లానింగ్ కూడా జరుగుతున్నదేమో? ఎవరు చూశారు? కాగా ”ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి,ఆగ్రహం చాలాచోట్ల కట్టలు తెంచుకుంటోంది. అది ఈ అసమర్ధ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని త్వరలోనే భూస్థాపితం చేయనుంది” అంటూ వికారాబాద్ జిల్లా కలెక్టర్ పై దాడిని సమర్ధిస్తూ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు.”రాష్ట్రంలో పరిపాలనా వైఫల్యం,శాంతిభద్రతల వైఫల్యానికి తాజా ఉదాహరణ రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో జిల్లా కలెక్టర్ మీదనే రైతులు తిరుగుబాటు చేశారు.ముఖ్యమంత్రి మూర్ఖత్వం వల్ల అధికారులు దెబ్బలు తినాల్సి వచ్చింది. భూసేకరణ పూర్తయ్యి,అన్ని అనుమతులు వచ్చి, ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఫార్మా సిటీని రద్దు చేసి,రాష్ట్రంలో పది చోట్ల ఫార్మా క్లస్టర్లు పెట్టాలనే తుగ్లక్ అలోచన వల్లనే ఇంత అలజడి రేగింది” అని ఢిల్లీలో ఉన్న కేటీఆర్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.తమ హయాంలో చేపట్టిన ఫార్మాసిటీని కొనసాగించాలని,10 ఫార్మా క్లస్టర్ల ఏర్పాటు ప్రతిపాదన మూర్ఖత్వమన్నది కేటీఆర్ వాదన. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం,లగచర్ల గ్రామంలో ఫార్మా కంపెనీ భూసేకరణ ప్రక్రియలో భాగంగా గ్రామసభలో ప్రజాభిప్రాయానికి వెళ్ళినప్పుడు ఈ దాడి సంఘటన జరిగింది.ఇలాంటి దాడులతో ఉద్యోగులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి దోషులను కఠినంగా శిక్షించాలని ఉద్యోగుల సంఘాలు కోరుతున్నవి. రాష్ట్ర డీజీపీ దృష్టికి తీసుకెళ్లి,దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు,భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా చర్యలు చేపట్టాలని కోరనున్నట్లు రమేష్.పాక తెలిపారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్,అదనపు కలెక్టర్,కడా ప్రత్యేక అధికారి ప్రతీక్ జైన్ సహా,తహశీల్దార్,ఇతర అధికారులపై దాడి అరాచకమైన చర్య అని తెలంగాణ తహశీల్దార్స్ అసోసియేషన్ ఖండించింది.దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ సంఘం డిమాండు చేసింది. అధికారుల బృందంపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలంగాణ తహశీల్దార్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష,కార్యదర్శులు ఎస్.రాములు,రమేష్ పాక,సెక్రటరీ జనరల్ ఫూల్ సింగ్ చౌహాన్ అన్నారు.”గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ దాడి జరిగింది. అధికారులపై దాడికి ఉసిగొల్పిన,దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి” అని వారు కోరారు. కేసీఆర్ మినహా ‘తెలంగాణ’ను బాగా నమిలి,మింగేసిన వ్యక్తి మనకు కనిపించరు.తెలంగాణ ప్రజల అమాయక మనస్తత్వం, ఆలోచన, ఆవేశం,వ్యవహార శైలి,బలహీనతలను,బలాన్ని దాదాపు నలభై ఏండ్లుగా ఆయన అధ్యయనం చేశారు.ఆయనకు తెలిసినంతగా ఈ భూమ్మీద తెలంగాణ లక్షణం గురించి తెలిసిన వ్యక్తి మరొకరు లేరు.రాష్ట్రం ఏర్పడితే ఏమి చెయ్యాలి.తాము అధికారంలోకి వస్తే ఏమి చెయ్యాలి?అధికారాన్ని ఎట్లా దుర్వినియోగం చెయ్యాలి?అధికార దుర్వినియోగంతో సంపదను ఎట్లా కూడబెట్టుకోవాలి? తన తదనంతరం కూడా పలు తరాల తన కుటుంబ సభ్యులు కాలు కదపకుండా ఎట్లా జీవించాలి? విలాసాలు,భోగాలు ఎట్లా అనుభవించాలి? వీటన్నింటిపై కేసీఆర్ కు సాధికారికంగా అవగాహన ఉన్నది. అధికారంలోకి రాగానే మొత్తం అణచివేతకు ఎట్లా రంగం సిద్ధం చేశారో వెంటనే అర్ధం కాలేదు. కేసీఆర్ ను వ్యతిరేకించిన వాళ్ళు,బిఆర్ఎస్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన వారందరినీ తెలంగాణ ద్రోహులుగా ముద్ర వేసి ప్రజల ముందు దోషులుగా నిలబెట్టే పనులు కేసీఆర్ చేశారు. కేటీఆర్,హరీశ్ రావు సైతం అదే ఫార్ములాను ఫాలో అయ్యారు. నిజానికి ఉద్యమ ద్రోహులయిన వాళ్ళను పిలిచి మరీ మంత్రి పదవులు ఇచ్చారు. ఆ నిర్ణయాలను ప్రశ్నిస్తే, మీ మొఖం మీకేం తెలుసు,పరిపాలన వాళ్లకే తెలుసు. మీకు గాయగత్తర మాత్రమే తెలుసు అని బిఆర్ఎస్ అధ్యక్షుడు అన్న మాటలు తెలంగాణ సమాజం ముందు ఉన్నవే. ఉద్యమంలో తెలంగాణ బిడ్డలపై లాఠీలతో విరుచుకుపడ్డ పోలీసు ఉన్నతాధికారులకు ప్రమోషన్లు ఇచ్చారు. తెలంగాణ ఉద్యమకారుల పట్ల అత్యంత దారుణంగా ప్రవర్తించిన పోలీసు అధికారులను అందలం ఎక్కించారు. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం వాళ్లకే తెలుసు అని మిగతా వాళ్ళ నోళ్లు మూయించారు.కాంట్రాక్టులను కోస్తా ఆంధ్రాకు చెందిన మేఘా కృష్ణారెడ్డికి,పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి లాంటి వాళ్లకు కట్టబెట్టినప్పుడు తెలంగాణలో ప్రాజెక్టులు కట్టే మొఖాలు ఉన్నాయా అని ఎదురుదాడి చేసినట్టు కొందరు గుర్తు చేస్తున్నారు. ఆంధ్రా బాపనోళ్లు ఆడంబరం గాళ్లు,తెలంగాణ బాపనోళ్లు నిష్ఠ గలోళ్లు అన్న కేసీఆర్,చిన జీయర్ స్వామిని ముఖ్యమంతి సీటులో కూర్చొబెట్టి, కాళ్లు మొక్కిన సంగతిని తరచూ చాలా మంది గుర్తుచేస్తుంటారు. తెలంగాణ యువత బర్లు,గొర్లు కాసుకోవడానికి తప్ప దేనికీ పనికి రారు అని కేసీఆర్ పరోక్షంగా సందేశం ఇచ్చారు.”గొంతెత్తినోడిని నొక్కు నొక్కిండు.సంఘాలు ఎందుకు నేనే సంఘం అన్నడు.ధర్నాలు కుదరదు ధర్నాచౌక్ రద్దు అన్నాడు. ఖాళీగా ఉంచితే గొడవలు చేస్తారని, గంజాయిని ప్రయోగించిండు అని ఒక మిత్రుడు ఇటీవల సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. ”మొత్తం తెలంగాణను చడీచప్పుడు లేకుండా చేసిండు” అని అతను ముగించాడు. అంటే దాదాపు పదేండ్ల పాటు తెలంగాణలో ఒక విధమైన ‘స్మశాన నిశ్శబ్దం’ కొనసాగేలా కేసీఆర్,కేటీఆర్,హరీశ్ రావు ప్రయత్నించినట్టు ఆరోపణలున్నవి. ఘంటా చక్రపాణి,అల్లం నారాయణ,నందిని సిధారెడ్డి… వంటి వామపక్ష మేధావులు,విద్యావంతులు,ప్రజాస్వామిక వాదులు,ప్రశ్నించే వాళ్ళకు పదవులు ఇచ్చి మచ్చిక చేసుకున్నారు.అలాంటి వారు మాట్లాకుండా,పత్రికల్లో రచనలు చేయకుండా కట్టడి చేయగలిగారు.తమ పాలన పట్ల భిన్నాభిప్రాయం వ్యక్తం చేయడం,నిర్మాణాత్మక విమర్శలు చేయడం కూడా ‘నేరం’గా కేసీఆర్ భావించేవారన్న విమర్శలున్నవి.కేసీఆర్ వ్యూహాత్మకంగా పరిపాలన సాగించారనడానికి అనేక ఉదాహణలున్నవి. పైగా డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి ‘అణచివేత చర్యల’ వల్ల మావోయిస్టులు ఛత్తీస్ గడ్,జార్ఖండ్,ఒడిశా వంటి రాష్ట్రాలకు తరలిపోవడం కేసీఆర్ కు అంది వచ్చిన వరం.ఒక వేళ మావోయిస్టుల కార్యకలాపాలు తెలంగాణలో ఉంది ఉంటే ఎన్ని బూటకపు ఎన్ కౌంటర్లు జరిగేవో,ఎంత రక్తం చిందేదో తెలియదు.ఇటీవలే నిరుద్యోగ యువత అశోక్ నగర్ నుంచి సెక్రటేరియేట్ దాకా రాగలిగారు.ధర్నా చేయగలిగారు.ఇలాంటి దృశ్యం కేసీఆర్ పాలనలో ఏనాడయినా చూశామా?రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కొన్ని విషయాల్లో ఉదాసీనంగా ఉండడమో,నిరుద్యోగుల పట్ల సానుభూతి ఉండడమో కారణం కావచ్చు.నిరసన ప్రదర్శనలు,ధర్నాలు,ఆందోళన కార్యకార్యక్రమాలు సాగుతున్నవి.అయితే ఇవన్నీ ఒక దశ వరకే.ఇది హద్దు మీరితే రేవంత్ ప్రభుత్వానికి కూడా ‘బలప్రయోగం’ చేయవలసిన అనివార్య పరిస్థితి తలెత్తవచ్చు. .”తెలంగాణ సమాజంపై ఎందుకింత కోపం”? అని కేసీఆర్ ను పలు సందర్భాలలో సీఎం.రేవంత్ నిలదీశారు.నిజమే! కేసీఆర్ హయాంలో నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించకపోయినా,ఉద్యోగాల నోటిఫికేషన్లు వేయకపోయినా,ఉద్యోగుల మూడు డీఏలు పెండింగులో పెట్టినా,తమను వ్యతిరేకించినవారిపై కేసులు పెట్టి జైలుకు పంపినా దాన్నే ‘స్వర్ణయుగం’గా ప్రచారం చేశారు.’అడిగినా,అడగకపోయినా ఎన్నో రకాలుగా ప్రజల కోరికలు తీర్చినట్టు’ గత శనివారం ఫార్మ్ హౌజ్ లో పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ కేసీఆర్ అన్నారు.అలాంటి ‘ధర్మప్రభువు’నైన తనను ఓడించడమేమిటి అనే ఆగ్రహం కేసీఆర్ కు రావడంలో తప్పేముంది? ఈ ప్రభుత్వం పనయిపోయిందనో,ఇక ఎంతో కాలం రేవంత్ రెడ్డి సీఎంగా ఉండజాలరనో,ప్రభుత్వం కూలిపోతుందనో.. రకరకాల ప్రకటనలు బిఆర్ఎస్ వైపు నుంచి వస్తున్నవి. ఆ ప్రకటనల వెనుక ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం త్వరగా పడిపోవాలని కేసీఆర్ కోరుకుంటున్నట్టుగా భావించడంలో తప్పేమీ లేదు.అందువల్ల ‘తెలంగాణలో అలజడి సృష్టించాలి. అశాంతి ఏర్పడాలి.శాంతి భద్రతల సమస్యలు నెలకొనాలి.ప్రభుత్వం శాంతి భద్రతలలో విఫలమైనట్టు నిరూపించాలి’. వంటి ప్లానింగ్ జరుగుతున్నట్టు అనుమానాలు కలుగుతున్నవి.
ఎస్.కే.జకీర్, సీనియర్ జర్నలిస్ట్.








