Mahaa Daily Exclusive

  యువతకు ఉపాధి కల్పించడమే రాహుల్ గాంధీ లక్ష్యం…

Share

యువతకు ఉపాధి కల్పించడమే రాహుల్ గాంధీ లక్ష్యం.
*కార్పొరేట్ శక్తుల కోసమే కేంద్రంలోని బీజేపీ సర్కారు పని చేస్తోంది.
* గాంధీ భవన్‌లో ఘనంగా రాహుల్ జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్. హైదరాబాద్, మహా.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు హైదరాబాద్‌ నాంపల్లిలోని రాష్ట్ర పార్టీ కార్యాలయం ‘గాంధీ భవన్’లో ఘనంగా జరిగాయి. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఈ వేడుకల్లో పాల్గొని భారీ కేక్ కట్ చేసి, రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తల కోలాహలంతో గాంధీ భవన్ పరిసరాల్లో పండుగ వాతావరణం నెలకొంది.
ఈ వేడుకల అనంతరం మహేశ్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. దేశంలోని నిరుద్యోగ యువతకు మెరుగైన ఉపాధి, సమాన అవకాశాలు కల్పించడమే రాహుల్ గాంధీ ప్రధాన రాజకీయ లక్ష్యమని ఉద్ఘాటించారు. దేశంలో తీవ్రరూపం దాల్చిన నిరుద్యోగం, ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాల ధరలు వంటి కీలక ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తున్న ఏకైక నాయకుడు రాహులేనని కొనియాడారు. దేశవ్యాప్తంగా వివిధ ఉద్యోగ నియామక పరీక్షల్లో తరచూ జరుగుతున్న పేపర్ లీకేజీల వల్ల లక్షలాది మంది నిరుద్యోగులు తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ యువతకు సరైన ఉపాధి అవకాశాలు దక్కాలంటే కేంద్ర ప్రభుత్వ విధానాల్లో స్పష్టమైన మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
రాహుల్ గాంధీ ఆకాంక్షించిన విధంగా సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, యువత సాధికారతతో కూడిన నవ భారత నిర్మాణం జరగాలని మహేశ్ గౌడ్ ఆకాంక్షించారు. ప్రస్తుత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేవలం కొద్దిమంది కార్పొరేట్ పెత్తందారుల ప్రయోజనాల కోసమే పనిచేస్తోందని ఆయన తీవ్రంగా విమర్శించారు. సామాన్య ప్రజలు, రైతులు, కార్మికులు, నిరుద్యోగుల హక్కుల రక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో నిరంతరం పోరాడుతూనే ఉంటుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. దేశ ప్రజలకు మరింతగా సేవలందించేందుకు రాహుల్ గాంధీకి భగవంతుడు దీర్ఘాయుష్షును, సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ఆయన ప్రార్థించారు.