మా అత్త త్వరగా చనిపోయేలా చూడు స్వామీ!
* ఆలయ హుండీలో కోడలి వింత మొక్కు.
* నోట్లపై రాతలు చూసి అధికారులు అవాక్కు.
* అనంతపురం జిల్లా పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఘటన.
అనంతపురం, మహా.
సాధారణంగా భక్తులు ఆలయాలకు వెళ్లి దేవుడిని దర్శించుకున్నప్పుడు తమ కుటుంబం చల్లగా ఉండాలని, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటారు. కానీ, ఓ కోడలు మాత్రం తన అత్తగారు త్వరగా చనిపోవాలంటూ ఏకంగా దేవుడికే వింత మొర పెట్టుకుంది. తన ఆవేదనను, కోరికను ఏకంగా కరెన్సీ నోట్లపై రాసి ఆలయ హుండీలో వేసిన అరుదైన ఘటన అనంతపురం జిల్లాలో వెలుగుచూసింది. ఆలయ హుండీ కానుకల లెక్కింపు సందర్భంగా ఈ వింత కోరికను చూసిన అధికారులు, భక్తులు ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు.
వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం పంపనూరు గ్రామంలో ప్రసిద్ధి చెందిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయానికి నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. తాజాగా ఆలయ అధికారులు భక్తులు సమర్పించిన హుండీ కానుకలను లెక్కించడం ప్రారంభించారు. ఈ క్రమంలో నగదును వేరు చేస్తుండగా అధికారులకు కొన్ని రూ.20 నోట్లు కనిపించాయి. వాటిపై ఏదో రాసి ఉండటాన్ని గమనించి నిశితంగా పరిశీలించిన సిబ్బంది ఒక్కసారిగా అవాక్కయ్యారు. అందులో ఓ నోటుపై “స్వామీ.. మా అత్త వేధింపులు తట్టుకోలేకపోతున్నాను.. తొందరగా మా అత్త చనిపోయేలా చూడు” అని రాసి ఉండగా, మరో నోటుపై “స్వామీ.. మా అత్త త్వరగా చనిపోవాలి” అని పెన్నుతో రాసి ఉంది.
ఈ వింత మొక్కు ఉదంతం కాస్తా బయటకు పొక్కడంతో స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అత్తగారి మరణాన్ని కాంక్షిస్తూ ఓ కోడలు ఏకంగా భగవంతుడికే మొక్కుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ కుటుంబంలో అత్తగారి వేధింపులు, హింస ఏ స్థాయికి చేరితే.. ఆ బాధను భరించలేక ఓ కోడలు ఇంతటి తీవ్రమైన నిర్ణయానికి వస్తుందని పలువురు చర్చించుకుంటున్నారు. తన కష్టాలను ఎవరికీ చెప్పుకోలేక, తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఆ మహిళ ఈ వింత మార్గంలో దేవుడికి తన ఆవేదనను తెలియజేసి ఉంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
అయితే, ఆలయాల హుండీలను భక్తులు కేవలం కానుకలు సమర్పించడానికే కాకుండా.. తమ వ్యక్తిగత సమస్యలు, వ్యవస్థలపై ఉన్న ఆవేదనలు, ఫిర్యాదులను దేవుడికి నివేదించే వేదికగా వాడుకుంటున్న ఘటనలు ఇటీవల కాలంలో తరచూ వెలుగుచూస్తూనే ఉన్నాయి. గత రెండు నెలల క్రితం జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు సరిగా లేవంటూ ఓ భక్తుడు ఏకంగా దేవుడికే లేఖ రాసి హుండీలో వేయడం సంచలనం సృష్టించింది. అలాగే, గతంలో అనంతపురం జిల్లాలోనే ఓ ఆలయంలో దొంగతనానికి పాల్పడిన దుండగులు.. నెల రోజుల తర్వాత పాపభీతితో తాము దొంగిలించిన సొమ్మును తిరిగి హుండీలో వేసి, తమను క్షమించాలంటూ లేఖ పెట్టిన సంఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా పంపనూరు ఆలయంలో కోడలి రాసిన రాతల ఉదంతం సోషల్ మీడియాలోనూ విపరీతంగా వైరల్ అవుతోంది.








