- యధావిధిగా నీట్ రీ ఎగ్జామ్
- నీట్ రీ ఎగ్జామ్ నిలిపివేయాలని పిటిషన్ ను తిరస్కరించిన సుప్రీంకోర్టు
- పిటిషన్లను అత్యవసరంగా విచారించలేమని స్పష్టం
న్యూఢిల్లీ, మహా : వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ రీ ఎగ్జామ్‌కు లైన్ క్లియర్ అయ్యింది. ఈ పరీక్షను నిలిపివేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. జూన్ 21న జరగబోయే రీ ఎగ్జామ్ యథాతథంగా కొనసాగుతుందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇటీవల పరీక్ష నిలిపివేయాలంటూ కొందరు విద్యార్థులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం అందుకు నిరాకరించింది. పిటిషన్లను అత్యవసరంగా విచారణ జరపాలంటూ అభ్యర్థుల తరఫు న్యాయవాది కోరగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసం దాన్ని తోసిపుచ్చింది. నీట్‌కు సంబంధించిన అన్నీ పిటిషన్లు జస్టిస్ పీఎస్ నరసింహ ధర్మాసనం ముందుకు వెళ్లాయని వీటిని కూడా ఆ ధర్మాసనమే విచారిస్తుందని స్పష్టం చేశారు. విద్యార్థులు వేసిన పిటిషన్లలో అత్యవసర పరిస్థితి లేదని ఆయన తేల్చిచెప్పారు. పేపర్ లీకేజీ, అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్‌లో సమస్యలు ఉన్నాయన్న పిటిషన్లను ఈ మేరకు సుప్రీంకోర్టు కొట్టివేసింది
విద్యార్థులు, నీట్-యూజీ అభ్యర్థులు దాఖలు చేసిన ఒక ప్రత్యేక పిటిషన్‌పై తక్షణమే విచారణ చేపట్టాలని న్యాయవాది అదీల్ అహ్మద్ కోరారు. అభ్యర్థుల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని జూన్ 21న పరీక్ష నిర్వహించే సాధ్యాసాధ్యాలను పునఃపరిశీలించాలని ఈ మేరకు కేంద్రాన్ని ఆదేశించాలని పిటిషన్లో పేర్కొన్నారు. “మానసిక క్షోభ, తీవ్ర ఆందోళన, పరీక్ష రద్దు కావడం వల్ల తలెత్తిన అనిశ్చితి, తగినంత సన్నద్ధత సమయం లేకపోవడం, పరీక్ష సమగ్రతపై అనుమానాలు, ఇతర పరీక్షలతో తేదీలు ఒకేలా ఉండటం, నిర్వహణాపరమైన ఇబ్బందులు, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు వంటి అంశాల నేపథ్యంలో ఈ విజ్ఞప్తులు వస్తున్నాయి.” అని పిటిషన్లో పేర్కొన్నారు.
రీ ఎగ్జామ్ నిర్వహించాలన్న నిర్ణయాన్ని ఎవరూ సవాలు చేయలేదని, అభ్యర్థులకు తగినంత సన్నద్ధత సమయం ఇవ్వకుండా రీ ఎగ్జామ్ తేదీని ఏకపక్షంగా, అసమంజసంగా నిర్ణయించారని మాత్రమే పిటిషన్లో పేర్కొన్నారని న్యాయవాది తెలిపారు. “రీ ఎగ్జామ్‌కు సంబంధించిన వాతావరణం, ప్రశ్నపత్రం లీక్ అయ్యిందన్న ఆరోపణలు, లీక్ అయినట్లు చెబుతున్న ప్రశ్నపత్రాలు, సోషల్ మీడియాలో వదంతులు, విస్తృతమైన తప్పుడు సమాచారం వంటి వాటితో నిండిపోయింది. దీనివల్ల అధికారులు పదేపదే స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పరీక్షా ప్రక్రియ రద్దు, తదనంతర వివాదాల కారణంగా నీట్ అభ్యర్థులు తీవ్ర మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. కొందరు అభ్యర్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారన్న వార్తలు కూడా వచ్చాయని బహిరంగ నివేదికలు వెల్లడించాయి.” అని పిటిషన్ పేర్కొంది. బాధిత అభ్యర్థులందరికీ పరీక్షకు సిద్ధమయ్యేందుకు తగినంత సమయం కల్పించిన తర్వాతే నిర్వహించాలని కోరారు. ‘రీ-ఎగ్జామ్ ను వాయిదా వేసి కొత్త తేదీని ఖరారు చేయాలని అధికారులను ఆదేశించాలన్న విజ్ఞప్తిని ధర్మాసనం తోసిపుచ్చింది.








