ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్‌గా యువరాజ్ సింగ్?
* ఐపీఎల్ 2027 సీజన్ ముందు యువీ సరికొత్త ఇన్నింగ్స్!
*యాజమాన్య మార్పులతో పాటు కోచింగ్ సిబ్బందిలోనూ భారీ ప్రక్షాళన.
* గంగూలీ సూచనలతో రంగంలోకి సిక్సర్ల వీరుడు.
* జట్టుకు కొత్త ఊపు ఖాయమంటున్న ఫ్యాన్స్.
ఢిల్లీ, మహా.
భారత క్రికెట్ చరిత్రలో తనదైన ముద్ర వేసిన దిగ్గజ ఆల్‌రౌండర్, సిక్సర్ల వీరుడు యువరాజ్ సింగ్ మైదానంలో కోచ్‌గా సరికొత్త ఇన్నింగ్స్ ప్రారంభించనున్నట్లు ఊహాగానాలు జోరందుకున్నాయి. ప్రపంచంలోనే అత్యంత ఆదరణ కలిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2027 సీజన్‌కు ముందు ఆయన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కోచింగ్ సిబ్బందిలో చేరనున్నట్లు ఐపీఎల్ వర్గాల ద్వారా తెలుస్తోంది. గత రెండు సీజన్లుగా అక్షర్ పటేల్ సారథ్యంలోని ఢిల్లీ జట్టు ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో, రాబోయే ఎడిషన్‌లో మేనేజ్‌మెంట్ భారీ మార్పులకు శ్రీకారం చుట్టే యోచనలో ఉన్నట్లు సమాచారం.
ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీని సంయుక్తంగా నిర్వహిస్తున్న జీఎంఆర్ , జేఎస్‌డబ్ల్యూ గ్రూపులు రెండేళ్ల కాలపరిమితి చొప్పున జట్టు నిర్వహణ బాధ్యతలను పంచుకుంటున్నాయి. ఇందులో భాగంగా 2025, 2026 ఐపీఎల్ సీజన్లలో జీఎంఆర్ గ్రూప్ పర్యవేక్షణలో జట్టు కొనసాగగా.. రాబోయే 2027 సీజన్ నుంచి మళ్లీ జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ బాధ్యతలను స్వీకరించనుంది. ఈ యాజమాన్య మార్పుల నేపథ్యంలోనే కోచింగ్ స్టాఫ్‌ను కూడా పూర్తిగా ప్రక్షాళన చేయాలని భావిస్తున్నారు. గతంలో జేఎస్‌డబ్ల్యూ పగ్గాల కాలంలో భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ ఢిల్లీ క్యాపిటల్స్ ‘డైరెక్టర్ ఆఫ్ క్రికెట్’గా కీలక వ్యవహారాలు నడిపించారు. ప్రస్తుతం ప్రధాన కోచ్‌గా ఉన్న హేమంగ్ బదానీ భవితవ్యంపై అనిశ్చితి నెలకొన్న తరుణంలో.. గంగూలీ మళ్లీ ఢిల్లీ జట్టు బాధ్యతల్లో కీలక పాత్ర పోషించనున్నట్లు వినికిడి.
గత రెండు సీజన్లలో కేఎల్ రాహుల్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్ వంటి అంతర్జాతీయ స్టార్ ఆటగాళ్లు జట్టులో ఉన్నప్పటికీ ఢిల్లీ క్యాపిటల్స్ కనీసం ప్లే ఆఫ్స్ దశకు కూడా చేరుకోలేకపోయింది. 2025లో ఐదో స్థానానికి పరిమితమైన ఢిల్లీ, 2026 సీజన్ లో ఆరో స్థానంతో సరిపెట్టుకుని అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. ఈ వరుస వైఫల్యాల నేపథ్యంలోనే జట్టులో సరికొత్త జోష్ నింపేందుకు సౌరభ్ గంగూలీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. గంగూలీ ఇచ్చిన కీలక సూచనల మేరకే యువరాజ్ సింగ్‌ను కోచింగ్ బృందంలోకి తీసుకురావాలని ఫ్రాంచైజీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. అయితే యువీకి ప్రధాన కోచ్ పదవి ఇస్తారా లేక మెంటార్, బ్యాటింగ్ కోచ్ వంటి ఇతర బాధ్యతలు అప్పగిస్తారా అనే విషయంపై మేనేజ్‌మెంట్ నుంచి ఇంకా అధికారిక స్పష్టత రాలేదు.
ఇదిలా ఉండగా, ఈ ఏడాది జరిగిన ఎస్‌ఏ20 టోర్నీలో ఢిల్లీ క్యాపిటల్స్ అనుబంధ జట్టు అయిన ప్రిటోరియా క్యాపిటల్స్‌కు సౌరభ్ గంగూలీ ప్రధాన కోచ్‌గా వ్యవహరించి, జట్టును అద్భుతమైన వ్యూహాలతో ఫైనల్‌కు చేర్చిన సంగతి విదితమే. గంగూలీకి ఉన్న కోచింగ్ అనుభవం, యువరాజ్ సింగ్‌కు ఉన్న దూకుడు తత్వం తోడైతే.. రాబోయే ఐపీఎల్ 2027లో ఈ ‘దాదా-యువీ’ లక్కీ జోడీ ఢిల్లీ క్యాపిటల్స్ ఫేట్‌ను మార్చేసి, జట్టుకు సరికొత్త ఊపు తీసుకురావడం ఖాయమని క్రికెట్ విశ్లేషకులు, అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.








