Mahaa Daily Exclusive

  ఉపాధి హామీ స్థానంలో ‘జీరాంజీ’ పథకం…

Share

ఉపాధి హామీ స్థానంలో ‘జీరాంజీ’ పథకం..
* 60 రోజుల విరామంపై రాష్ట్ర సర్కారు అభ్యంతరం.
* కేంద్రానికి మంత్రి సీతక్క నిరసన లేఖ.
హైదరాబాద్:మహా.
దేశవ్యాప్తంగా గ్రామీణ ఉపాధి కల్పనలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ప్రస్తుత మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో జులై 1వ తేదీ నుంచి ‘వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ్’ (వీబీ-జీ రాం జీ) పథకం అట్టహాసంగా ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే జారీ చేసి, అన్ని రాష్ట్రాలకు నిధులను సైతం కేటాయించింది. పాత పథకంలో 266 రకాల పనులు ఉండగా, తాజా పథకంలో ఆ సంఖ్యను 318కి పెంచారు. ఇందులో మౌలిక సదుపాయాల కేటగిరీని యథాతథంగా ఉంచి, మిగిలిన మూడింటిని కేంద్రం పూర్తిగా మార్చేసింది. జల సంరక్షణ, గ్రామీణ మౌలిక సదుపాయాలు, జీవనోపాధి, విపత్తుల నిర్వహణ అనే నాలుగు ప్రధాన కేటగిరీల కింద పనులను విభజించారు.
నూతన పథకంలో భాగంగా జల సంరక్షణ కింద చెక్‌డ్యామ్‌లు, కాలువలు, ఇంకుడు గుంతలు, వర్షపు నీటి సంరక్షణ పనులు, అటవీకరణను విస్తృతంగా చేపట్టనున్నారు. గ్రామీణ మౌలిక సదుపాయాల కింద గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్‌వాడీలు, క్రీడా మైదానాలు, ఆరోగ్య, పశువైద్య కేంద్రాలు, వ్యర్థాల నిర్వహణ కేంద్రాలు, రోడ్లు నిర్మిస్తారు. ఇక జీవనోపాధిలో భాగంగా భూమి అభివృద్ధి, పండ్ల తోటల పెంపకం, మత్స్య, పట్టు పరిశ్రమల ఏర్పాటు, గిడ్డంగులు, నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాలకు రూపకల్పన చేయనున్నారు. విపత్తుల నిర్వహణ కింద వరద రక్షణ గోడల నిర్మాణం, కొండచరియల నివారణ పనులు, నేల స్థిరీకరణ, అడవుల్లో మంటల నియంత్రణ వంటి అత్యవసర పనులకు శ్రీకారం చుట్టనున్నారు.
అయితే, కొత్తగా రానున్న ఈ ‘జీరాంజీ’ పథకం మార్గదర్శకాలపై కేంద్రానికి అధికారికంగా నిరసన లేఖ రాయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజాభవన్‌లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా కొత్త చట్టంలో వ్యవసాయ సీజన్‌లో 60 రోజుల పాటు ఉపాధి పనులకు విరామం ఇవ్వాలన్న నిబంధన ఏమాత్రం సరికాదని మంత్రి సీతక్క తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ప్రధానంగా పంటల సీజన్‌లోనే విస్తారంగా వర్షాలు కురుస్తాయని, సరిగ్గా అదే సమయంలో ఉపాధి హామీ పథకం ద్వారా వనమహోత్సవం, భారీ ఎత్తున మొక్కలు నాటడం వంటి పర్యావరణ హిత కార్యక్రమాలు చేపడతామని మంత్రి గుర్తుచేశారు. ఈ కీలక సమయంలో ఉపాధి పనులకు ఏకంగా 60 రోజుల పాటు విరామం ఇస్తే.. మొక్కలు నాటే ప్రక్రియ పూర్తిగా నిలిచిపోతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిబంధన కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన హరితభారత లక్ష్యానికే పూర్తిగా విరుద్ధంగా మారుతుందని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఈ సుదీర్ఘ విరామం వల్ల అటవీ ఉత్పత్తులపై ఆధారపడే ఆదివాసీలు, కొండ ప్రాంతాల్లో నివసించే నిరుపేదల ఉపాధి అవకాశాలు తీవ్రంగా దెబ్బతింటాయని, అందుకే ఈ నిబంధనను పునఃసమీక్షించాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాయనున్నట్లు మంత్రి సీతక్క వెల్లడించారు.

Latest