Mahaa Daily Exclusive

  మెగా ఫుడ్ పార్కా.. దోపిడీ పార్కా?

Share

మెగా ఫుడ్ పార్కా.. దోపిడీ పార్కా?
* పచ్చని పొలాల్లో పాలకుల పందికొక్కులు..
* 70 లక్షల భూమి 21 లక్షలకే ధారాదత్తం!
* సింగరేణిలో మాయమైన 40 లక్షల టన్నుల బొగ్గు.
* రేవంత్ సర్కార్ సమాధానం చెప్పాలి!
* కేంద్ర నిధులకు ఎసరు.. కారుచౌకగా కార్పొరేట్లకు కట్టబెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం!
* భూ బాగోతం, బొగ్గు కుంభకోణాలపై శ్వేతపత్రం ఏది?
* సీబీఐ విచారణకు బీజేపీ నేత పొంగులేటి డిమాండ్.
* కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌కు లేఖ.

హైదరాబాద్, మహా.

అన్నదాతల జీవితాల్లో వెలుగులు నింపాల్సిన అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘మెగా ఫుడ్ పార్క్’ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం తమ అనుయాయులకు, ప్రైవేట్ సంస్థలకు కారుచౌకగా కట్టబెట్టే కుట్రలకు కేంద్రంగా మార్చేసింది. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలన్న దార్శనికతతో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన కోట్లాది రూపాయల నిధులను, ప్రాజెక్టు అసలు లక్ష్యాలను తుంగలో తొక్కుతున్న రేవంత్ రెడ్డి సర్కార్ పచ్చి దోపిడీ తీరుపై బీజేపీ జాతీయ నాయకులు, కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల కో ఇన్చార్జి,మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
శుక్రవారం హైదరాబాద్ లోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఫుడ్ పార్క్ భూ కేటాయింపుల్లో చోటుచేసుకున్న పారదర్శకత లేని చీకటి ఒప్పందాలపై తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరుతూ కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ చిరాగ్ పాశ్వాన్‌కు ఆయన ఈనెల 17వ తేదీ ఒక అధికారిక లేఖ రాశారు. వేలాది మంది యువతకు ఉపాధి కల్పించాల్సిన ఈ ప్రాజెక్టు కాస్తా కార్పొరేట్ సంస్థల జేబులు నింపే సాధనంగా మారిపోయిందని ఆయన మండిపడ్డారు. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ లేదా కేంద్ర విజిలెన్స్ కమిషన్ ద్వారా సమగ్ర విచారణ జరిపించి తీరాలని ఆయన డిమాండ్ చేశారు.
రైతుల వ్యవసాయ ఉత్పత్తులకు అదనపు విలువను చేకూర్చడం, గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం మరియు లాజిస్టిక్స్, కోల్డ్ చైన్ వ్యవస్థలతో కూడిన ప్రపంచ స్థాయి వ్యవసాయ మౌలిక సదుపాయాలను నిర్మించాలనే సమున్నత లక్ష్యంతో బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్‌ను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందుకోసం కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వ శాఖ 2016 ఫిబ్రవరి 5వ తేదీన ప్రాజెక్టుకు తుది ఆమోదం తెలిపింది. సుమారు 109.59 కోట్ల రూపాయల భారీ అంచనా వ్యయంతో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు కోసం, కేంద్ర ప్రభుత్వం ఏకంగా 49.79 కోట్ల రూపాయల నిధులను గ్రాంట్ రూపంలో విడుదల చేసింది. స్థానిక రైతుల నుంచి సుమారు 200 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించింది. అయితే, ఆ రైతుల త్యాగాల పునాదుల మీద నిర్మితమవుతున్న ఈ ఫుడ్ పార్క్ భూములపై ఇప్పుడు బడా బాబుల కన్ను పడింది. ఏకంగా 72 ఎకరాల విస్తీర్ణమైన విలువైన భూమిని రాష్ట్ర ప్రభుత్వం గుట్టుచప్పుడు కాకుండా “దీపక్ నెక్స్ట్ జెన్ ఫుడ్స్ అండ్ ఫీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్” అనే ప్రైవేట్ సంస్థకు అప్పగించేందుకు తెరవెనుక పక్కా స్కెచ్ వేసింది. బహిరంగ మార్కెట్‌లో ఎకరం భూమి ధర 70 నుంచి 80 లక్షల రూపాయల వరకు పలుకుతుండగా, కేవలం 21 లక్షల రూపాయల అతి తక్కువ ధరకే ఆ ప్రైవేట్ సంస్థకు ధారాదత్తం చేయడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటని సుధాకర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా నిలదీశారు. ఇంత తక్కువ ధరకు భూములను బలిపెట్టడం వెనుక ఎవరి జేబులు నిండుతున్నాయో ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. వెంటనే ఈ వివాదాస్పద టెండర్‌ను రద్దు చేయాలని, ప్రాజెక్టు అమలులో కేంద్ర మార్గదర్శకాలు ఎంతవరకు అమలవుతున్నాయో తెలుసుకునేందుకు తక్షణమే ఒక సమగ్ర నివేదికను తెప్పించుకోవాలని కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌ను తన లేఖలో ఆయన గట్టిగా అభ్యర్థించారు.
అవినీతి బాగోతం కేవలం ఫుడ్ పార్క్‌కే పరిమితం కాలేదని, తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ లాంటి సింగరేణి కాలరీస్ సంస్థను సైతం అధికార ప్రభుత్వం అక్రమాలకు అడ్డాగా మార్చేసిందని సుధాకర్ రెడ్డి నిప్పులు చెరిగారు. కృష్ణారం ప్రాంతంలో అత్యంత కీలకమైన సైలో బంకర్ నిర్మాణంలో కోల్‌కతా కంపెనీతో కుమ్మక్కై నాణ్యతను గాలికి వదిలేశారని ఆయన విమర్శించారు. దానికి తోడు, సింగరేణిలో ఏకంగా 4 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు (పిట్ హెడ్ స్టాక్) మాయమైపోయాయని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. సంస్థ లెక్కల ప్రకారం 69.01 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి కాగా, అందులో కేవలం 65.23 మిలియన్ టన్నులు మాత్రమే రవాణా చేయబడిందని, మిగిలిన ఆ నాలుగు మిలియన్ టన్నుల బొగ్గును ఏ బడా నాయకులు మింగేశారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జవాబు చెప్పాలని సవాలు విసిరారు. సంస్థ కేటాయించిన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులు కూడా పెద్ద ఎత్తున పక్కదారి పడుతున్నాయని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్రంలో స్వేచ్ఛగా సాగుతున్న ఈ పచ్చి దోపిడీ, బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్‌లో భూ కేటాయింపుల బాగోతం, సింగరేణి బొగ్గు మాయం వ్యవహారాలపై వాస్తవాలను వివరిస్తూ తక్షణమే ఒక శ్వేతపత్రం విడుదల చేసే దమ్ము రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ఉందా అని డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి సవాలు విసిరారు. ప్రజల సొమ్మును కొల్లగొడుతున్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు.
మీడియా సమావేశంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు, ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు, రాష్ట్ర అధికార ప్రతినిధులు వాకధాని పుల్లారావు యాదవ్, నంబూరి రామలింగేశ్వర రావు పాల్గొన్నారు.

Latest