Mahaa Daily Exclusive

  యువశక్తితోనే ‘వికసిత భారత్’….

Share

యువశక్తితోనే ‘వికసిత భారత్’.
* పీఎం-వీబీఆర్‌వై పథకంతో 3.5 కోట్ల కొత్త ఉద్యోగాలు.
* 2026 నాటికి ప్రపంచ శ్రామిక శక్తిలో 66 శాతం భారతీయులే.
* జాబ్ సీకర్స్ నుంచి జాబ్ క్రియేటర్స్‌గా ఎదుగుతున్న భారత యువత.
* ‘ప్రధాన మంత్రి వికసిత భారత్ రోజ్‌గార్ యోజన’ సదస్సులో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.
హైదరాబాద్, మహా.
ఏ అభివృద్ధి చెందిన దేశానికైనా అసలైన బలం యువశక్తి, శ్రామిక శక్తేనని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఉద్ఘాటించారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం యువతకు పెద్దపీట వేస్తోందని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్‌లో ఉన్న ఆర్‌టీసీ కళాభవన్‌లో శుక్రవారం జరిగిన ‘ప్రధాన మంత్రి వికసిత భారత్ రోజ్‌గార్ యోజన’ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రోడ్లు, రైల్వేలు వంటి మౌలిక వసతులు దేశాభివృద్ధికి దోహదపడితే.. యువతలో ఉన్న నైపుణ్యం, వారి అంకితభావం దేశానికి నిజమైన పురోగతిని, స్థిరత్వాన్ని అందిస్తాయని ఈ సందర్భంగా ఆయన వివరించారు.
దేశంలో నిరుద్యోగ నిర్మూలన, భారీ స్థాయిలో ఉపాధి కల్పన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ పథకం ఉపాధి రంగంలో ఒక ‘గేమ్ ఛేంజర్’గా మారనుందని కిషన్ రెడ్డి సగర్వంగా తెలిపారు. సుమారు రూ. 99,446 కోట్ల భారీ బడ్జెట్‌తో అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా రాబోయే రెండేళ్లలో దేశవ్యాప్తంగా 3.5 కోట్లకు పైగా కొత్త ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. మొట్టమొదటిసారిగా ఫార్మల్ (వ్యవస్థీకృత) రంగంలో ఉద్యోగంలో చేరే యువతకు ఒకేసారి రూ.15,000 వరకు ఆర్థిక ప్రోత్సాహకాన్ని కేంద్రం నేరుగా అందిస్తోందని, ఇది వారి వృత్తి జీవిత ప్రారంభంలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా అదనపు ఉపాధి అవకాశాలు సృష్టించే యాజమాన్యాలకు, సంస్థలకు రెండేళ్ల పాటు కేంద్రం ప్రోత్సాహకాలు ఇస్తుందని, భారీ స్థాయిలో ఉద్యోగాలు కల్పించే తయారీ రంగ (Manufacturing) సంస్థలకు ఏకంగా నాలుగేళ్ల పాటు ఈ మద్దతు లభిస్తుందని వివరించారు. ఈ పథకానికి తెలంగాణ రాష్ట్రం నుంచి విశేష స్పందన లభిస్తోందని, ఇప్పటికే 25 వేలకు పైగా సంస్థలు నమోదు చేసుకోగా, 18 వేలకు పైగా సంస్థలు అదనపు ఉపాధిని కల్పించి లబ్ధి పొందుతున్నాయని మంత్రి వెల్లడించారు.
భారతదేశ యువత సరికొత్త రికార్డుల దిశగా అడుగులు వేస్తోందని కిషన్ రెడ్డి ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు. ఏప్రిల్ 2020 నుంచి 2025 మధ్యకాలంలో 18 నుంచి 28 ఏళ్ల వయసున్న దాదాపు 3.45 కోట్ల మంది యువత కొత్తగా ఫార్మల్ వర్క్‌ఫోర్స్‌లో భాగస్వాములయ్యారని గుర్తుచేశారు. ప్రతి ఏడాది సగటున 80 లక్షల మంది యువత శ్రామిక శక్తిగా మారుతున్నారని, ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే ప్రైవేటు రంగంలో 3.43 కోట్ల ఉద్యోగ అవకాశాలు ఉన్నట్లు నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్ అంచనా వేసిందన్నారు. రాబోయే 2026 నాటికి ప్రపంచవ్యాప్తంగా కొత్తగా వర్క్‌ఫోర్స్‌లో చేరే యువతలో ఏకంగా 66 శాతం మంది భారతీయులే ఉంటారని ఆయన అంచనా వేశారు. రోజ్‌గార్ మేళాల ద్వారా ఇప్పటికే 12 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామన్నారు. మరోవైపు కార్మికుల భద్రత, సంక్షేమం కోసం కాలం చెల్లిన 29 కార్మిక చట్టాలను కేంద్రం 4 లేబర్ కోడ్‌లుగా మార్చిందని, ప్రావిడెంట్ ఫండ్ (PF), గ్రాట్యుటీల విషయంలో యజమానుల వాటాను పెంచడం ద్వారా కార్మికులకు సామాజిక, ఆర్థిక భద్రతను కల్పిస్తున్నామని స్పష్టం చేశారు.
గత 12 ఏళ్ల ప్రధాని మోదీ పాలనలో యువత సాధికారత ఒక ‘నేషనల్ మిషన్’గా మారిందని తెలుపుతూ, కేంద్ర ప్రభుత్వ విజయాలను కిషన్ రెడ్డి నాలుగు ప్రధాన విభాగాలుగా సభికులకు వివరించారు. మొట్టమొదటిగా డిజిటల్ రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులతో భారత్‌లో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 100 కోట్లు దాటిందన్నారు. పీఎం గ్రామీణ డిజిటల్ సాక్షరత అభియాన్ ద్వారా తెలంగాణలో 12 లక్షల మందితో సహా దేశంలో 6 కోట్ల మంది డిజిటల్ అక్షరాస్యత సాధించారని, భారత్‌నెట్ ద్వారా తెలంగాణలోని 11 వేల గ్రామాలతో కలుపుకుని దేశవ్యాప్తంగా 2.14 లక్షల గ్రామ పంచాయతీలకు ఆప్టికల్ ఫైబర్ అనుసంధానం జరిగిందని తెలిపారు. ఇక నైపుణ్యాభివృద్ధి (స్కిల్ డెవలప్‌మెంట్) కింద పీఎం కౌశల్ వికాస్ యోజన ద్వారా 1.64 కోట్ల యువతకు శిక్షణ లభించిందని, తెలంగాణలోని 60 లక్షల గ్రామీణ యువతకు స్కిల్ ట్రైనింగ్ అందించామని పేర్కొన్నారు.
దేశ యువత ఇప్పుడు కేవలం ఉద్యోగాల కోసం ఎదురుచూసే స్థాయి నుంచి, ఇతరులకు ఉద్యోగాలు కల్పించే స్థాయికి (జాబ్ క్రియేటర్స్) ఎదిగారని మంత్రి కొనియాడారు. ప్రస్తుతం 2.2 లక్షల స్టార్టప్‌లు, 120కి పైగా యూనికార్న్‌లతో భారత్ ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్‌గా అవతరించిందన్నారు. తెలంగాణలో 9,922 గుర్తింపు పొందిన స్టార్టప్‌లు ఉండగా, అందులో సగానికి పైగా అంటే 5,042 మహిళల నేతృత్వంలో నడుస్తుండటం ఎంతో గర్వకారణమన్నారు. ముద్రా యోజన ద్వారా రాష్ట్రంలో 79 లక్షల ఖాతాలకు రూ. 81 వేల కోట్ల రుణాలు అందజేశామన్నారు. తయారీ రంగంలో పీఎల్‌ఐ (PLI) స్కీమ్ ద్వారా దేశంలోకి రూ. 2.40 లక్షల కోట్ల కొత్త పెట్టుబడులు వచ్చాయని, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి పదేళ్ల వ్యవధిలోనే రూ. 1.9 లక్షల కోట్ల నుంచి ఏకంగా రూ. 11 లక్షల కోట్లకు చేరడం మోదీ ప్రభుత్వ వ్యూహాత్మక విజయానికి నిదర్శనమన్నారు. చివరగా, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా, మేకిన్ ఇండియా పథకాలన్నింటినీ అనుసంధానిస్తూ తీసుకువచ్చిన వికసిత భారత్ రోజ్‌గార్ యోజన దేశాభివృద్ధికి చుక్కానిలా పనిచేస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సభాముఖంగా ఉద్ఘాటించారు.