Mahaa Daily Exclusive

  హోంమంత్రి అనితపై అనుచిత వ్యాఖ్యలు…

Share

హోంమంత్రి అనితపై అనుచిత వ్యాఖ్యలు.
* గుడివాడ అమర్‌నాథ్‌కు మహిళా కమిషన్ నోటీసులు!
* ఈ నెల 24న విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశం.
* సుమోటోగా కేసు నమోదు చేసి సీరియస్ యాక్షన్.
* తన వ్యాఖ్యలను టీడీపీ వక్రీకరించిందన్న మాజీ మంత్రి అమర్‌నాథ్.
అమరావతి, మహా.
రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ షాక్ ఇచ్చింది. మహిళల గౌరవానికి భంగం కలిగించేలా ఆయన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన కమిషన్.. ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేసినట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు విచారణకు హాజరుకావాలంటూ ఆయనకు నోటీసులు జారీ చేసింది.
**జూన్ 24న విచారణకు ఆదేశం**
హోంమంత్రిపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి తగిన ఆధారాలతో సహా వివరణ ఇచ్చేందుకు జూన్ 24వ తేదీ ఉదయం 11 గంటలకు కమిషన్ ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాలని గుడివాడ అమర్‌నాథ్‌ను నోటీసుల్లో ఆదేశించారు. ఒకవేళ నిర్దేశిత గడువులోగా స్పందించని పక్షంలో.. కమిషన్ వద్ద ఇప్పటికే అందుబాటులో ఉన్న ఫిర్యాదులు, వీడియో క్లిప్‌లు, ఇతర ఆధారాలను బట్టి చట్టపరమైన తదుపరి చర్యలు తీసుకుంటామని మహిళా కమిషన్ అందులో తీవ్రంగా హెచ్చరించింది.
**దుమారం రేపిన ‘మేకప్’ వ్యాఖ్యలు**
ఇటీవల రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితను ఉద్దేశిస్తూ అమర్‌నాథ్ పరుష పదజాలంతో విమర్శలు చేశారు. ఆమెను “మేకప్ మినిస్టర్” అని అభివర్ణించడమే కాకుండా, ఆమె వేసుకునే మేకప్‌తో గోడలకు పుట్టీ కూడా పెట్టుకోవచ్చంటూ తీవ్ర వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఒక మహిళా మంత్రిపై మాజీ మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యక్తిగత, కించపరిచే వ్యాఖ్యలు చేయడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. ఈ వ్యాఖ్యలు మహిళల గౌరవానికి భంగం కలిగించేవిగా పరిగణిస్తూ మహిళా కమిషన్ తాజా చర్యలు చేపట్టింది.
**వెనక్కి తగ్గేది లేదన్న అమర్‌నాథ్**
తన వ్యాఖ్యలపై వివాదం చెలరేగడంపై గుడివాడ అమర్‌నాథ్ స్పందించారు. అధికార టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసమే తన మాటలను ఉద్దేశపూర్వకంగా వక్రీకరిస్తోందని ఆయన ఆరోపించారు. తాను మహిళలను గానీ, ఏ ఒక్క వర్గాన్ని గానీ కించపరిచే ఉద్దేశంతో మాట్లాడలేదని, కేవలం ఒక వ్యక్తి చేసిన వ్యాఖ్యలకు మాత్రమే తాను కౌంటర్ ఇచ్చానని సమర్థించుకున్నారు. తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేసిన ఆయన.. భవిష్యత్తులోనూ మంత్రి అనిత తీరు మారకపోతే తన స్పందన ఇలాగే ఉంటుందని తేల్చిచెప్పారు.