Mahaa Daily Exclusive

  ‘వృక్షో రక్షతి’ ఏదీ..?

Share

‘వృక్షో రక్షతి’ ఏదీ..?
* ములుగు అడవుల నరికివేతపై ప్రధాని ఆదేశాలు బేఖాతరు!
* నూగూరు వెంకటాపురంలో వందలాది ఎకరాల అటవీ భూముల ఆక్రమణ.
*స్మగ్లర్లపై పీడీ యాక్ట్ ఏదీ? కన్నేసిన ఆ పెద్దలు ఎవరు?.
* సీబీఐ, ఈడీ విచారణకు డిమాండ్.. ప్రధానికి మళ్లీ విజ్ఞప్తి చేసే యోచనలో పర్యావరణవేత్తలు.
హైదరాబాద్, మహా.
‘వృక్షో రక్షతి రక్షితః’.. వృక్షాలను మనం రక్షిస్తే, అవి మనలను రక్షిస్తాయి. ఇది అందరికీ తెలిసిన సత్యమే. కానీ, రక్షించాల్సిన అడవులనే అక్రమార్కులు విచక్షణారహితంగా నరికేస్తుంటే అడ్డుకోవాల్సిన ప్రభుత్వ యంత్రాంగం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. తెలంగాణ రాష్ట్రం, ములుగు జిల్లాలోని నూగూరు వెంకటాపురం మండలంలో వందలాది ఎకరాల అడవిని నరికివేసి, భూములను అక్రమంగా ఆక్రమించుకున్న అటవీ స్మగ్లర్ల దందా ఇప్పుడు సంచలనంగా మారింది. దీనిపై సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాలు జారీ చేసినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం వాటిని పెడచెవిన పెట్టడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.
ఈ భారీ కుంభకోణంపై 2025 సంవత్సరంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఫిర్యాదులు వెళ్లాయి. అడవులను నరికి కబ్జాలకు పాల్పడుతున్న స్మగ్లర్లపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని ఫిబ్రవరి నెలలో రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ పత్రాలు అందజేశారు. దాన్ని పరిశీలించిన ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలని ఎండార్స్ కూడా చేశారు. కానీ, క్షేత్రస్థాయిలోని అప్పటి అధికారులు రాజకీయ ఒత్తిళ్లు, జోక్యంతో వాస్తవాలను వెలుగులోకి రానివ్వలేదు. స్మగ్లర్లపై ఎలాంటి చర్యలూ తీసుకోకుండా అక్రమాలకు వత్తాసు పలికారు. అసలు వందల ఎకరాల అటవీ భూమిపై కన్నేసిన ఆ బడా బాబులు ఎవరన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
స్థానిక అధికారుల తీరుతో విసిగిపోయిన పర్యావరణవేత్తలు, ప్రజలు జనవరి 19, 2026న గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి రెండోసారి వినతిపత్రం పంపారు. ఈ భారీ అటవీ కుంభకోణంపై సీబీఐ , ఈడీ ల ద్వారా సమగ్ర విచారణ చేపట్టాలని అందులో కోరారు. అయితే, ప్రధాని మోదీ రాష్ట్ర ప్రభుత్వంపై పూర్తి విశ్వాసం ఉంచి, వెంటనే విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని సూచిస్తూ దస్త్రాలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం ప్రధాని నమ్మకాన్ని వమ్ము చేసింది. రెండు సంవత్సరాలుగా ప్రధాని కార్యాలయం నుంచి వస్తున్న సూచనలను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు లెక్కచేయడం లేదన్నది అంతుచిక్కని ప్రశ్న. అటవీ సంపదను కొల్లగొడుతున్న స్మగ్లర్లపై పీడీ యాక్ట్ కింద కేసులు ఎందుకు నమోదు చేయడం లేదని ప్రజలు నిలదీస్తున్నారు. వందలాది ఎకరాల అడవి కనుమరుగవుతుంటే కాపాడలేని వారు, ఎంతో ఆర్భాటంగా ’75వ వన మహోత్సవం’ జరుపుకోవడం దురదృష్టకరమని, ఇది కేవలం కంటితుడుపు చర్యేనని మండిపడుతున్నారు.
అడవుల రక్షణ బాధ్యతను గాలికి వదిలేసిన రాష్ట్ర ప్రభుత్వ తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. అడవులను మింగేస్తున్న స్మగ్లర్ల ఆట కట్టించాలంటే సీబీఐ, ఈడీ విచారణతోనే పర్యావరణానికి న్యాయం జరుగుతుందని ప్రజలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం సడలడంతో, మానవాళి మనుగడను కాపాడే వనాలను, వృక్షాలను రక్షించుకునేందుకు వాస్తవ పరిస్థితులను మరోసారి ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లాలని స్థానికులు నిర్ణయించుకున్నారు. జరిగిన అన్యాయాన్ని, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని స్పష్టంగా వివరిస్తూ ప్రధానమంత్రికి మళ్లీ విజ్ఞప్తి చేయడమే ఇప్పుడు తమ ముందున్న ఏకైక న్యాయమైన మార్గమని వారు స్పష్టం చేస్తున్నారు.