Mahaa Daily Exclusive

  అన్నవరం సత్యదేవుని ఆదాయం కోట్లలో…

Share

  • అన్నవరం సత్యదేవుని ఆదాయం కోట్లలో
  • … భక్తులపై భారం ఏల?
  • రూ.157 కోట్లకు పైగా ఆదాయం అంచనా.
  • అయినా పెరుగుతున్న రుసుములు, పారదర్శకతపై ప్రశ్నలు
  • శాశ్వత ఈవో లేకపోవడం, రాజకీయ మర్యాదల ఖర్చులు, పరిపాలనపై విమర్శలు

అన్నవరం, మహా :

రాష్ట్రంలోని అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం మరోసారి చర్చనీయాంశంగా మారింది. కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన ఈ దేవస్థానం ప్రస్తుతం ఆదాయం, వ్యయాలు, పరిపాలనా వ్యవహారాలు, భక్తులపై పెరుగుతున్న ఆర్థిక భారం వంటి అంశాల కారణంగా విమర్శలు ఎదుర్కొంటోంది. దేవస్థానం ప్రకటించిన 2025–26 ఆర్థిక సంవత్సర బడ్జెట్ అంచనాల ప్రకారం మొత్తం ఆదాయం రూ.157 కోట్లకు పైగా వచ్చింది. హుండీ కానుకలు, సత్యనారాయణ స్వామి వ్రతాలు, ప్రసాదాల విక్రయాలు, దర్శన టికెట్లు, వసతి సదుపాయాల ద్వారా భారీగా ఆదాయం సమకూరుతోంది. అయితే ఇంతటి ఆదాయం లభిస్తున్నప్పటికీ భక్తులపై రుసుముల భారం ఎందుకు పెరుగుతోందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

వ్రతాలు, దర్శనాలు, వసతి… అన్నింటికీ పెరిగిన ధరలు

ఇటీవలి కాలంలో వ్రతాల రుసుములు, ప్రత్యేక దర్శన టికెట్ల ధరలు, వసతి గదుల అద్దెలు పెరిగిన విషయం తెలిసిందే. సాధారణ భక్తులు ఆలయ దర్శనానికి వచ్చే సమయంలో గతంతో పోలిస్తే అధిక వ్యయం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు కోట్ల రూపాయల ఆదాయం వస్తుండగా, మరోవైపు భక్తులపై అదనపు భారం మోపాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. దేవస్థానం ఆదాయాన్ని భక్తుల సౌకర్యాల విస్తరణకు వినియోగిస్తున్నారా? లేక పరిపాలనా వ్యయాలే అధికమవుతున్నాయా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

పెరుగుతున్న పరిపాలనా ఖర్చులు

దేవస్థానంలో ఉద్యోగుల జీతభత్యాలు, పరిపాలనా ఖర్చులు, ఇతర నిర్వహణ వ్యయాలు గణనీయంగా పెరుగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆదాయం పెరుగుతున్న కొద్దీ భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉన్నప్పటికీ, అందుకు బదులుగా రుసుములు పెరగడం పట్ల అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఆలయ అభివృద్ధి పనులకు, యాత్రికుల సౌకర్యాల పెంపుకు ఎంత నిధులు కేటాయిస్తున్నారు? పరిపాలనా ఖర్చులకు ఎంత వెచ్చిస్తున్నారు? అనే అంశాలపై పూర్తి వివరాలు ప్రజలకు అందుబాటులో ఉంచాలని భక్తులు కోరుతున్నారు.

రాజకీయ పర్యటనలకు. దేవస్థానం నిధుల వినియోగమా?

ఇటీవలి కాలంలో ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల ఆలయ పర్యటనల సందర్భంగా దేవస్థానం తరఫున ప్రత్యేక మర్యాదలు, కండువాలు, స్వామివారి చిత్రపటాలు, ప్రసాదాలు అందిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఒక నాయకుడి వెంట వందలాది మంది అనుచరులు వచ్చిన సందర్భాల్లో వారికి కూడా దేవస్థానం తరఫున ఏర్పాట్లు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ ఖర్చులకు సంబంధించిన లెక్కలు ఏమిటి? ఎవరి అనుమతితో ఈ వ్యయాలు జరుగుతున్నాయి? అనే ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు రావాల్సి ఉందని భక్తులు అభిప్రాయపడుతున్నారు.

శాశ్వత ఈవో నియామకంపై సందిగ్ధత

అన్నవరం దేవస్థానంలో పూర్తి స్థాయి శాశ్వత ఈవో లేకపోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. కీలకమైన ఈ దేవస్థానానికి ఎందుకు ఇప్పటికీ శాశ్వత కార్యనిర్వాహక అధికారి నియామకం జరగలేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. గతంలో ఇక్కడ విధులు నిర్వహించిన పలువురు అధికారులు వివాదాల్లో చిక్కుకోవడం, తరచూ బదిలీలు జరగడం వంటి పరిణామాలు కూడా అనుమానాలకు తావిస్తున్నాయని పలువురు పేర్కొంటున్నారు.

డిజిటల్ వ్యవస్థపై ప్రశంసలు… అమలుపై సందేహాలు

దేవస్థానంలో డిజిటల్ చెల్లింపుల విధానాన్ని ప్రవేశపెట్టడం ఆధునికతకు నిదర్శనంగా భావిస్తున్నారు. అయితే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వృద్ధులు, నిరక్షరాస్యులు, సాధారణ భక్తులకు ఇబ్బందులు లేకుండా తగిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఉన్నాయా? అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. డిజిటల్ లావాదేవీల నిర్వహణలో పారదర్శకత, పర్యవేక్షణ, భద్రతా ప్రమాణాలపై కూడా స్పష్టత అవసరమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

శ్వేతపత్రం విడుదల చేయాలంటున్న భక్తులు

అన్నవరం దేవస్థానం ఏ రాజకీయ పార్టీకి చెందినది కాదు. ఇది కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీక. భక్తులు సమర్పించే ప్రతి రూపాయి పవిత్రమైనదని, ఆ నిధుల వినియోగంపై పూర్తి పారదర్శకత ఉండాలని భక్తులు కోరుతున్నారు. దేవస్థానం ఆదాయం-వ్యయాలపై సమగ్ర శ్వేతపత్రం విడుదల చేయాలని, వివాదాస్పద ఖర్చులపై స్వతంత్ర విచారణ జరపాలని, శాశ్వత ఈవోను నియమించాలని, అవసరం లేని ఖర్చులను నియంత్రించాలని హిందూ సంఘాలు, భక్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. “ఆలయాలను నిలబెట్టేది అధికారులు కాదు… రాజకీయ నాయకులు కాదు… భక్తులే. అందుకే భక్తుల విశ్వాసాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత” అని పలువురు భక్తులు అభిప్రాయపడుతున్నారు.