Mahaa Daily Exclusive

  ప్రపంచ శాంతికి యోగా మార్గం చూపుతుంది:ప్రధాని

Share

ప్రపంచ శాంతికి యోగా మార్గం చూపుతుంది.
* ప్రధాని నరేంద్ర మోదీ.
*కోల్‌కతా రెడ్‌ రోడ్‌లో 35 వేల మందితో కలిసి ఆసనాలు వేసిన ప్రధాని.
*ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి యోగాను జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపు.
కోల్‌కతా,మహా.
యోగా అనేది కేవలం కొన్ని ప్రత్యేక సందర్భాలకే పరిమితం కాకూడదని, ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో దీనిని భాగంగా మార్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని చారిత్రాత్మక రెడ్ రోడ్ వేదికగా ఆదివారం ఉదయం జరిగిన భారీ బహిరంగ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై వేలాది మంది యోగా సాధకులతో కలిసి ఆయన ఉత్సాహంగా వివిధ రకాల ఆసనాలు వేశారు. ఈ సందర్భంగా సభికులను ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ.. యోగా అనేది ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత భారీ సామూహిక ఉత్సవంగా మారిందని హర్షం వ్యక్తం చేశారు. యోగా కేవలం ఒక వ్యక్తి శారీరక, మానసిక ఆరోగ్యానికే పరిమితం కాదని, యావత్ ప్రపంచ శాంతికి కూడా అద్భుతమైన మార్గం చూపగలదని ఆయన స్పష్టం చేశారు.
ఏడాది మొత్తంలో సుదీర్ఘమైన రోజు అయినందునే జూన్‌ 21వ తేదీని ప్రపంచ అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకుంటున్నట్లు ప్రధాని గుర్తుచేశారు. ఈ ప్రత్యేకమైన రోజున విశ్వంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి ఒకదానిని మించి మరొకటి అన్నట్లుగా యోగా సాధనకు సంబంధించిన అద్భుతమైన చిత్రాలు వస్తున్నాయని కొనియాడారు. మన దేశంలోనూ హిమాలయాల ఎత్తైన శిఖరాల నుంచి హిందూ మహాసముద్ర తీరం వరకు, తూర్పున బెంగాల్ నుంచి పశ్చిమాన సౌరాష్ట్ర వరకు యావత్ భారతదేశం నేడు ఒకే త్రాటిపైకి వచ్చి యోగాశక్తితో చైతన్యవంతంగా కనిపిస్తోందని మోదీ ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం సమాజంలో మారుతున్న అలవాట్ల వల్ల వస్తున్న జీవనశైలి వ్యాధులు, విపరీతమైన మానసిక ఒట్టిడి, వివిధ రకాల దీర్ఘకాలిక అంటువ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో.. ప్రతి ఒక్కరికీ ఒక నిశ్చింతమైన, ఆరోగ్యకరమైన జీవనానికి యోగా చక్కటి మార్గదర్శకంగా నిలుస్తోందని వివరించారు.
**వయస్సు పైబడినా సామర్థ్యం తగ్గకూడదు**
“ఆరోగ్యకరమైన వృద్ధాప్యం” అనే ప్రత్యేకమైన థీమ్‌తోనే ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. ఆరోగ్యకరమైన వృద్ధాప్యం అంటే వయస్సు పైబడుతున్నా శరీరంలో ఉండే పని సామర్థ్యం ఏమాత్రం తగ్గకూడదని ఆయన ఉద్ఘాటించారు. యోగా అనేది మన నిత్య జీవితం ఎల్లప్పుడూ నిరంతర వృద్ధి చెందేలా దోహదపడుతుందన్నారు. ప్రతి ఒక్కరూ తమ 20 ఏళ్ల యువ వయసులో ఉన్నదానికంటే 40 ఏళ్లకు వచ్చేసరికి శరీరంలో మరింత సౌలభ్యాన్ని (ఫ్లెక్సిబిలిటీ) కలిగి ఉండాలని కోరారు. అలాగే 30 ఏళ్ల వయసుతో పోలిస్తే 50 ఏళ్ల వయసులో మరింత రెట్టింపు ఉత్సాహంతో పనులు చేసుకోగలగాలని, 50 ఏళ్లలో కంటే 70 ఏళ్ల పండు వయసులో మరింత రోగ నిరోధక శక్తిని కలిగి ఉండాలని ప్రధాని ఆకాంక్షించారు. అందుకు నిత్యం యోగా సాధన చేయడం ఎంతగానో సహాయపడుతుందని చెప్పారు.
నిత్యం యోగా చేయడం వల్ల శరీరం ఎల్లప్పుడూ పనులకు అనువుగా మారుతుందని, మన అంతర్గత శక్తిస్థాయులు నిరంతరం అధికంగా ఉండేందుకు ఆస్కారం ఉంటుందని ప్రధాని తెలిపారు. అన్నింటికంటే ముఖ్యంగా నేటి యాంత్రిక సమాజంలో ప్రశాంతమైన, ఒత్తిడి లేని ఆనందకరమైన జీవితం గడపడానికి యోగా అద్భుతంగా సాయపడుతుందని భరోసా ఇచ్చారు. జీవితకాలం మొత్తం ఒక నిత్య విద్యార్థిగా ఎలా ముందుకు సాగాలో యోగా మనకు బోధిస్తుందన్నారు. మన గురించి మనం ఎంత ఎక్కువగా తెలుసుకోగలిగితే, మన ప్రవర్తనను మరియు మనల్ని మనం అంత మెరుగ్గా మలుచుకోగలమని హితవు పలికారు. అందుకే ఈ ఏడాది ఎంచుకున్న “ఆరోగ్యకరమైన వృద్ధాప్యం” అనే థీమ్‌ కేవలం వయసు పైబడిన వృద్ధులకే కాకుండా.. బాలలు, యువతతో సహా అన్ని వయసుల వారికీ సమానంగా వర్తిస్తుందని మోదీ స్పష్టం చేశారు.
**ప్రపంచవ్యాప్తంగా యోగా ఉద్యమం**
ఈ అంతర్జాతీయ మహోత్సవంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్ర గవర్నర్‌ ఆర్.ఎన్. రవి, ముఖ్యమంత్రి సువేందు అధికారి, కేంద్ర ఆయుష్‌ శాఖ మంత్రి ప్రతాప్‌రావు జాదవ్‌ తదితర పౌర, అధికార ప్రముఖులు పాల్గొని ప్రధానితో కలిసి ఆసనాలు వేశారు. కాగా, కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2,500 కంటే ఎక్కువ ప్రధాన ప్రాంతాల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. విదేశాలలో ఉన్న 210కు పైగా భారత రాయబార కార్యాలయాలు, దౌత్య మిషన్లు కూడా ఈ వేడుకల్లో చురుగ్గా పాలుపంచుకుంటున్నాయి. యావత్ ప్రపంచ జనాభాలో వృద్ధుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో.. మానవాళికి ఒక ఆరోగ్యవంతమైన, చురుకైన జీవనశైలిపై అవగాహన పెంచడంలో యోగా ఒక అంతర్జాతీయ ఉద్యమంగా మారిందని కేంద్రం పేర్కొంది.
గత 2014వ సంవత్సరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో భారతదేశ సాంప్రదాయక పద్ధతి అయిన యోగాకు అంతర్జాతీయ గుర్తింపు ఇవ్వాలని, ఇందుకోసం ఒక ప్రత్యేక దినోత్సవాన్ని ప్రకటించాలని చారిత్రాత్మక ప్రతిపాదన చేశారు. ప్రధాని మోదీ చేసిన ఆ ప్రతిపాదనకు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 175 దేశాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. అనంతరం 2015 జూన్ 21వ తేదీన ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవం అధికారికంగా అత్యంత ఘనంగా నిర్వహించబడింది. అప్పటి నుంచి ప్రతి ఏటా జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, సమగ్ర జీవన విధానానికి ప్రతీకగా మారి, ఈ యోగా దినోత్సవం కోట్లాది మంది ప్రజలను ఒకే తాటిపైకి తీసుకువస్తోంది.