కన్నీరు పెట్టిస్తున్న ఫాదర్స్ డే దృశ్యం.
* కూతురి ఉజ్వల భవిష్యత్తు కోసం పోలీసుల కాళ్లు పట్టుకుని ఏడ్చిన తండ్రి!
* గూగుల్ మ్యాప్స్ చేసిన మోసంతో ఒక్క నిమిషం ఆలస్యం.
* పరీక్ష రాసే అవకాశం కోల్పోయిన విద్యార్థులు.
*నిబంధనల పేరుతో లోపలికి అనుమతించని పోలీసులు.. బోరున విలపించిన కన్నవాళ్లు.
* మేడ్చల్ జిల్లా కీసరలో కంటతడి పెట్టిస్తున్న హృదయ విదారక ఘటన.
మేడ్చల్,మహా.
“నాన్న.. నా కోసం ఏమైనా చేస్తాడు” అని ఏ కూతురైనా గర్వంగా చెబుతుంది. ఆ మాటను నిజం చేస్తూ.. తన బిడ్డ భవిష్యత్తు బాగుండాలని, ఆమె కన్న కలలు చెదిరిపోకూడదని ఓ తండ్రి తన ఆత్మాభిమానాన్ని పక్కనపెట్టి పోలీసుల కాళ్లు పట్టుకుని ప్రాధేయపడిన దృశ్యం ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పిల్లలంతా తమ తండ్రులకు ‘ఫాదర్స్ డే’ శుభాకాంక్షలు చెబుతూ సంతోషంగా గడుపుతున్న వేళ.. ఓ తండ్రి మాత్రం తన కూతురి కోసం ఏడుస్తూ అడుక్కోవడం అత్యంత హృదయ విదారకంగా మారింది. టెక్నాలజీ చేసిన చిన్న తప్పు.. ఆ విద్యార్థిని పాలిట శాపంగా మారి, ఏడాదంతా రాత్రింబవళ్లు చదివిన కష్టాన్ని నిమిషంలో నీరుగార్చింది.
మేడ్చల్ జిల్లా కీసర మండల పరిధిలోని అంకిరెడ్డిపల్లిలో ఉన్న మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో ఆదివారం జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ పరీక్ష రాసేందుకు ఉదయం ఎంతో ఆశగా ఇంటి నుంచి బయలుదేరిన పలువురు విద్యార్థులకు గూగుల్ మ్యాప్స్ రూపంలో దురదృష్టం ఎదురైంది. పరీక్షా కేంద్రాన్ని చేరుకునేందుకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గూగుల్ మ్యాప్స్‌ను ఆశ్రయించగా.. అది దారి తప్పించి వారిని మరో ప్రాంతానికి తీసుకువెళ్లింది. అడ్రస్ తప్పు అని తెలుసుకుని, ఆదుర్దాగా అసలు కేంద్రానికి చేరుకునే సరికి కేవలం ఒక్క నిమిషం ఆలస్యమైంది. అప్పటికే ప్రధాన ద్వారం మూసివేసిన పోలీసులు.. నిబంధనల ప్రకారం ఒక్క నిమిషం లేటైనా ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలికి అనుమతించేది లేదని కరాఖండిగా తేల్చిచెప్పారు.
కళ్ల ముందు పరీక్షా కేంద్రం కనిపిస్తున్నా లోపలికి వెళ్లలేని నిస్సహాయత ఆ విద్యార్థులను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఒక్క నిమిషం ఆలస్యంతో తన బిడ్డ జీవితం ఎక్కడ నాశనమైపోతుందోనని అక్కడున్న ఓ తండ్రి గుండె ఆగిపోయినంత పనైంది. “అయ్యా.. కావాలని ఆలస్యంగా రాలేదు. గూగుల్ మ్యాప్స్ తప్పు చూపించడం వల్లే దారితప్పాం. ఏడాది పాటు నా బిడ్డ రాత్రింబవళ్లు కష్టపడి చదివింది. ఒక్క నిమిషమే కదా సార్.. దయచేసి లోపలికి పంపండి. నా బిడ్డ భవిష్యత్తు నాశనం చేయకండి.. మీకు పుణ్యం ఉంటుంది” అంటూ ఆ తండ్రి అక్కడున్న పోలీసుల కాళ్లు పట్టుకుని, వారి పాదాలపై పడి బోరున విలపించాడు. కన్నతండ్రి పడుతున్న ఆ వేదన చూసి ఆ కూతురు సైతం కన్నీరుమున్నీరుగా రోదించింది.
గత కొద్ది రోజులుగా నిద్రలేకుండా చదివిన చదువు, కన్నవారి ఆశలు కళ్లముందే కాలిపోతుంటే ఆ తల్లిదండ్రులు, విద్యార్థులు గుండెలు పగిలేలా ఏడ్చారు. ఎంత ప్రాధేయపడినా, సాష్టాంగ నమస్కారాలు చేసినా నిబంధనలు అడ్డురావడంతో పోలీసులు కఠినంగానే వ్యవహరించారు. ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను లోపలికి పంపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పడంతో.. ఆశలన్నీ ఆవిరైపోయి, కన్నీటితో వెనుదిరిగారు. ‘ఫాదర్స్ డే’ నాడు ఓ తండ్రి తన బిడ్డ ఉజ్వల భవిష్యత్తు కోసం తన ఆత్మాభిమానాన్ని సైతం వదులుకుని రోడ్డుపై పోలీసుల కాళ్లపై పడిన ఈ హృదయ విదారక దృశ్యం అక్కడున్న ప్రతి ఒక్కరి గుండెను బరువెక్కేలా చేసింది.








