అర్జీలను మానవీయ కోణంలో పరిష్కరించండి!
* అధికారులు, ఉద్యోగులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం.
• పనితీరు ఆధారంగానే బాధ్యతల అప్పగింత.
• తప్పుడు ప్రచారాలు, విద్వేషాలపై అప్రమత్తంగా ఉండాలి .
• సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వివిధ శాఖలపై సమీక్ష.
అమరావతి, మహా.
ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) ద్వారా వచ్చే అర్జీలను కేవలం యాంత్రికంగా కాకుండా మానవీయ కోణంలో పరిష్కరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. సోమవారం సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వివిధ ప్రభుత్వ శాఖల పనితీరుపై ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఫిర్యాదుల పరిష్కారంలో అధికారులు, ఉద్యోగులు ముందుగా అర్జీదారుల స్థానంలో ఉండి ఆలోచించాలని సూచించారు. ప్రజలతో వ్యవహరించే సమయంలో ప్రతి ఒక్కరూ విధిగా సాఫ్ట్ స్కిల్స్ అలవరచుకోవాలని, అత్యంత సౌమ్యంగా, మర్యాదపూర్వకంగా మెలగాలని స్పష్టం చేశారు. వినూత్న ఆలోచనలతో పని చేసే వారిని ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుందని, కేవలం పనితీరు ఆధారంగానే బాధ్యతల అప్పగింత ఉంటుందని తేల్చిచెప్పారు. అధికారుల తీరుతోనే పాలనపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని గుర్తుచేశారు. అందుబాటులో ఉన్న మానవ వనరులను సమర్థంగా వినియోగించుకోవాలని, ఉద్యోగులు ఎప్పటికప్పుడు తమ నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకోవాలని సూచించారు.
**కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలి**
రాష్ట్రంలో ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తూ కుట్రలు పన్నే పార్టీలు ఉన్నాయని ముఖ్యమంత్రి ధ్వజమెత్తారు. కుల, మతాల రంగు పులిమి ఉద్దేశపూర్వకంగానే వివాదాస్పద అంశాలను సృష్టిస్తున్నారని మండిపడ్డారు. పనిగట్టుకుని ఫేక్ ప్రచారాలు చేస్తూ నిజాయితీగా పనిచేసే అధికారులను, ఉద్యోగులను బద్నాం చేసేందుకు కుతంత్రాలు పన్నుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని సాగిస్తున్న ఈ తరహా దుష్ప్రచారాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలన్నారు. తప్పుడు ప్రచారాలను, సమాజంలో విద్వేషాలు పెంచే ఘటనలను అదుపు చేసేలా అధికారులు, ఉద్యోగులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు.
**తప్పు చేసిన వారు ఎప్పటికీ తప్పించుకోలేరు**
ఇటీవల కాలంలో మానసిక సమస్యల కారణంగా కూడా కొందరు నేరాలకు పాల్పడుతున్నారని ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు బానిసలై తప్పుదారి పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నేరస్థులు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. 2019లో జరిగిన పలు నేరాలను సైతం ఇప్పుడు సాంకేతికత సాయంతో ఛేదించి, నిందితులను పట్టుకుని కఠిన శిక్షలు పడేలా చేస్తున్నామని వివరించారు. ఈ తరహా కేసుల దర్యాప్తును ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. చట్టం దృష్టిలో తప్పు చేసిన వారు ఎప్పటికీ తప్పించుకోలేరన్న బలమైన సందేశాన్ని నేరస్థుల్లోకి పంపాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు.







