Mahaa Daily Exclusive

  ‘ఎస్ఐఆర్’ పేరిట ప్రజాస్వామ్యంపై దాడి…

Share

‘ఎస్ఐఆర్’ పేరిట ప్రజాస్వామ్యంపై దాడి.
* టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్.
* దేశంలో గతంలో ఎన్నడూ లేని విపత్కర పరిస్థితి.
• ఓట్లను దొంగిలించి అడ్డదారిన బీజేపీ గెలుపు.
• ఆస్తుల కోసం సొంత చెల్లిని గెంటేసిన కేటీఆర్ ప్రజలకు ఏం న్యాయం చేస్తారు?.
• హనుమకొండలో బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణా తరగతుల్లో ధ్వజం.
హనుమకొండ,మహా.
దేశంలో ప్రస్తుతం ‘ఎస్ఐఆర్’ పేరిట ప్రజాస్వామ్యంపై తీవ్రస్థాయిలో దాడి జరుగుతోందని, గతంలో ఎన్నడూ ఇలాంటి దుర్మార్గపు పరిస్థితులు లేవని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. హనుమకొండలో నిర్వహించిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ బూత్ లెవెల్ ఏజెంట్ల (బీఎల్ఏ) శిక్షణా కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఒకప్పుడు దేశంలో ఓటును అనుసంధానించే (జోడించే) పవిత్రమైన కార్యక్రమాలు జరిగితే.. నేడు మాత్రం అందుకు విరుద్ధంగా అర్హులైన వారి ఓట్లను దొంగతనంగా తొలగించే కుట్రలు సాగుతున్నాయని ఆరోపించారు. పశ్చిమ బెంగాల్‌లో ఓట్లను దొంగిలించి, అడ్డదారిన బీజేపీ విజయం సాధించిందని ఆయన దుయ్యబట్టారు. కేవలం ఓట్లను మాత్రమే కాకుండా, కాంగ్రెస్ సీనియర్ నేత్రి మీనాక్షి నటరాజన్‌కు దక్కాల్సిన రాజ్యసభ సీటును కూడా దొంగిలించారని తీవ్రంగా విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలో అసలు ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ఎక్కడున్నాయని మహేశ్ కుమార్ గౌడ్ నిలదీశారు.
ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇద్దరూ తమ సొంత ఎజెండాతోనే ముందుకు వెళ్తున్నారని, ఈ పాలకుల అసలు నిజాలను ప్రజలకు వివరించేందుకే తాము ఇక్కడికి వచ్చామని టీపీసీసీ చీఫ్ స్పష్టం చేశారు. ఇదే సమయంలో మాజీ మంత్రి కేటీఆర్‌పై ఆయన పదునైన విమర్శలు గుప్పించారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో జరిగిన దోపిడీ, అవినీతి, అక్రమాలను అప్పుడే మర్చిపోయారా అని ప్రశ్నించారు. అసలు కేటీఆర్ ఏ ముఖం పెట్టుకుని ప్రజల్లో తిరుగుతున్నారని నిలదీశారు. ఆస్తుల కోసం కన్న సొంత చెల్లినే ఇంట్లోంచి గెంటేసిన కేటీఆర్.. ఇక సామాన్య ప్రజలకు ఎలాంటి న్యాయం చేస్తారని ఎద్దేవా చేశారు. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ సీటు వ్యవహారంలో బీఆర్ఎస్ వ్యవహరించిన తీరు స్పష్టంగా బీజేపీకి బలం చేకూర్చేలా ఉందంటూ ఆ రెండు పార్టీల మధ్య ఉన్న అంతర్గత బంధాన్ని ఎండగట్టారు.
కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తను, నాయకుడిని తమ ప్రభుత్వం తప్పకుండా గుర్తిస్తుందని మహేశ్ కుమార్ గౌడ్ భరోసా ఇచ్చారు. నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియలో కాస్త ఆలస్యం జరిగిందన్న విషయాన్ని అంగీకరిస్తూ.. ఆ ఆలస్యంలో తమ వైపు కొంత తప్పిదం ఉందని ఆయన పేర్కొన్నారు. అయినప్పటికీ అధిష్ఠానం అందరినీ సమన్వయం చేసుకుంటూ, పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ రాబోయే రోజుల్లో కచ్చితంగా న్యాయం చేస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రాభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా సాగుతున్న తమ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో పూర్తి విశ్వాసం ఉందని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వందకు పైగా స్థానాల్లో ఘన విజయం సాధించి మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని టీపీసీసీ అధ్యక్షుడు ధీమా వ్యక్తం చేశారు.

Latest