నీటి వాటాలో రాజీపడే ప్రసక్తే లేదు!
* తెలంగాణ హక్కుల పరిరక్షణే ప్రభుత్వ ధ్యేయం.
* సాగునీటి భద్రత కోసం ఎందాకైనా పోరాడుతాం.
* ట్రిబ్యునళ్లలో మన వాదన బలంగా వినిపించాలి.
* సాగునీటి అధికారుల ఉన్నతస్థాయి సమీక్షలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టీకరణ.
హైదరాబాద్, మహా.
రాష్ట్రానికి దక్కాల్సిన న్యాయమైన నీటి వాటా విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడే ప్రసక్తే లేదని, తెలంగాణ హక్కుల పరిరక్షణే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలో సాగునీటి పారుదల శాఖ ఉన్నతాధికారులతో ఆయన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్), తుంగభద్ర డ్యామ్ తదితర కీలక ప్రాజెక్టులపై సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా రాజోలిబండ డైవర్షన్ స్కీమ్‌లో తెలంగాణకు కేటాయించిన నీటి వాటాను దక్కించుకునే విషయంలో ఎవరితోనూ రాజీ పడబోమని ఆయన తేల్చిచెప్పారు. ఆర్డీఎస్ ఆయకట్టు రైతుల ప్రయోజనాలను పూర్తిస్థాయిలో కాపాడేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కఠిన చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు.
తుంగభద్ర జలాల వినియోగంపై తెలంగాణ వాదనను, మన హక్కులను బలంగా వినిపించాలని అధికారులను మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. ఈ సమావేశంలో తుంగభద్ర నీటి పంపిణీకి సంబంధించిన పలు కీలక అంశాలపై సమగ్రంగా సమీక్షించారు. ఎగువ రాష్ట్రాలు తీసుకునే ఏకపక్ష నిర్ణయాలు, చర్యల వల్ల తెలంగాణ రైతాంగానికి ఆవగింజంత నష్టం కూడా జరగకుండా అధికారులు నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ముఖ్యంగా కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలోని రైతుల సాగునీటి అవసరాలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. నీటి పంపకాలకు సంబంధించి ట్రిబ్యునళ్లు, నదీ యాజమాన్య బోర్డుల సమావేశాలతో పాటు అంతర్రాష్ట్ర స్థాయిలో జరిగే చర్చల్లోనూ తెలంగాణ వాదనను అత్యంత బలంగా, స్పష్టంగా వినిపించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు సంబంధించి చట్టపరమైన, సాంకేతికపరమైన, పరిపాలనాపరమైన అంశాలతో కూడిన ఒక సమగ్ర నివేదికను తక్షణమే సిద్ధం చేయాలని ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు.
తెలంగాణ వాటా కింద దక్కాల్సిన ప్రతి నీటి బొట్టును పూర్తిస్థాయిలో వినియోగించుకునే దిశగా తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఉద్ఘాటించారు. రైతుల సాగునీటి అవసరాల పరిరక్షణలో ఎలాంటి మొహమాటాలకు, రాజీలకు తావులేదన్నారు. రాష్ట్ర భౌగోళిక, వ్యవసాయ ప్రయోజనాలకు ఏమాత్రం భంగం కలిగించే నిర్ణయాలు ఎక్కడినుంచి ఎదురైనా తెలంగాణ ప్రభుత్వం వాటిని తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఆయన హెచ్చరించారు. తెలంగాణ రైతుల హక్కుల సాధన, సాగునీటి భద్రత కోసం అవసరమైతే అన్ని వేదికలపైనా రాజీలేని పోరాటం చేసేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ సన్నద్ధంగా ఉంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.








