ఇంటింటికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు.
* డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.
* పదేళ్ల గత పాలకుల నిర్లక్ష్యానికి చెక్.
* ఇందిరమ్మ ఇళ్లతో పేదలకు అండ.
* మహిళా సాధికారతకు కాంగ్రెస్ పెద్దపీట.
* 30 నెలల్లో రూ. 67 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు పంపిణీ.
* కష్టపడిన మహిళా నాయకులకు సముచిత స్థానం.
* ఖమ్మం సభలో ఉప ముఖ్యమంత్రి భరోసా.
హైదరాబాద్, మహా.
రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న విప్లవాత్మక సంక్షేమ పథకాలు ప్రతి గడపకూ చేరుతున్నాయని, ఈ అద్భుత ప్రగతిని మహిళా కాంగ్రెస్ శ్రేణులు ఇంటింటికీ వెళ్లి విస్తృతంగా ప్రచారం చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు పిలుపునిచ్చారు. సోమవారం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా కాంగ్రెస్ సమీక్షా సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. మహిళా లోకానికి సమాన అవకాశాలు కల్పించడంతో పాటు, వారిని ఆర్థికంగా, రాజకీయంగా బలోపేతం చేయడమే ఇందిరమ్మ రాజ్య ప్రధాన ధ్యేయమని ఆయన ఉద్ఘాటించారు. సమాజంలో సగభాగమైన మహిళల అభ్యున్నతి కోసమే కాంగ్రెస్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని, పార్టీని మరింత బలోపేతం చేసేందుకు మహిళా నాయకురాళ్లు నడుం బిగించాలని కోరారు.
గత పాలకుల పదేళ్ల నిరంకుశ పాలనలో ఇళ్ల కోసం ఎదురుచూసి అలసిపోయిన పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం బాసటగా నిలుస్తోందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. అధికారంలోకి రాగానే అర్హులైన ప్రతి పేదవానికి ఇల్లు కట్టుకునేందుకు ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నామని, గత ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని గుర్తుచేశారు. ఈ ఏడాది నియోజకవర్గానికి 2,000 చొప్పున ఇళ్లు కేటాయించామని, ఇంకా అర్హులుంటే తమ దృష్టికి తీసుకువస్తే వారికి తప్పకుండా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే, పేద కుటుంబాల్లో ఎవరైనా అనారోగ్యానికి గురైతే వైద్యం కోసం ఇల్లు, భూమి, బంగారం అమ్ముకునే దుస్థితి రాకూడదనే ఉద్దేశంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని ఏకంగా రూ.10 లక్షలకు పెంచి, కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచితంగా మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు వెల్లడించారు.
పేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ఫీజు రీఇంబర్స్‌మెంట్‌ను పకడ్బందీగా అమలు చేస్తున్నామని, ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదివే విద్యార్థుల డైట్ చార్జీలను 40 శాతం, కాస్మోటిక్ చార్జీలను 200 శాతం పెంచినట్లు ఉప ముఖ్యమంత్రి తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్’ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ కింద వంద రోజుల పని కల్పిస్తున్నామన్నారు. మహిళల ఆర్థిక సాధికారత కోసం ప్రభుత్వం అహర్నిశలూ శ్రమిస్తోందని, ఐదేళ్లలో డ్వాక్రా మహిళలకు లక్ష కోట్ల రూపాయల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా.. కేవలం రెండున్నర ఏళ్లలోనే రూ.67,000 కోట్ల వడ్డీ లేని రుణాలు పంపిణీ చేశామన్నారు. వడ్డీ లేని రుణ పరిమితిని సైతం రూ. 5 లక్షల నుండి రూ. 10 లక్షలకు పెంచినట్లు గుర్తుచేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడమే కాకుండా, స్వయం సహాయక సంఘాల ద్వారా ఆర్టీసీ బస్సులను కొనుగోలు చేయించి వారినే యజమానులను చేశామన్నారు. మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు పెట్రోల్ బంకులు, మహిళా శక్తి క్యాంటీన్లు, 2,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్వహణలో వారికి ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు వివరించారు.
మిగతా పార్టీలలాగా కాంగ్రెస్ ఉపన్యాసాలకే పరిమితం కాదని, దేశానికి ఇందిరా గాంధీని ప్రధానిగా, సోనియా గాంధీని యూపీఏ చైర్‌పర్సన్‌గా, ఢిల్లీకి షీలా దీక్షిత్‌ను ముఖ్యమంత్రిగా చేసి మహిళలకు రాజకీయంగా అత్యున్నత అవకాశాలు కల్పించిన చరిత్ర తమదేనని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. గత పదేళ్లుగా పార్టీ కోసం రోడ్లపైకి వచ్చి పోరాడిన, ధర్నాలు చేసిన ప్రతి మహిళా నాయకురాలికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కష్టపడిన వారి వివరాలు జిల్లాల వారీగా తమ వద్ద ఉన్నాయని, సమయం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, తాను బాధ్యత తీసుకుని వారందరికీ సముచిత గౌరవం, పదవులు దక్కేలా చూస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో మహిళలు చురుగ్గా పాల్గొని అర్హుల ఓట్లు పోకుండా చూడాలని కోరారు. పార్టీ వ్యవస్థ మరింత బలోపేతం కావడానికి ప్రతి బూత్ లెవెల్ కమిటీలోనూ మహిళలకు కీలక ప్రాధాన్యత కల్పిస్తామని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, జిల్లా అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, శాసనసభ్యులు రామదాస్ నాయక్, డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ, కార్పొరేషన్ చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, నాయుడు సత్యం, పువాళ్ళ దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.








