కరెంటు కట్.. నీళ్లు బంద్.. అయినా ఆగని ఆందోళన.
* కాక్రోచ్ జనతా పార్టీ అలుపెరగని దీక్ష.
* చీకట్లోనే నిరసన.. ఏమాత్రం సడలని విద్యార్థులు.
* విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ముక్తకంఠంతో డిమాండ్.
ఢిల్లీ, మహా.
దేశ రాజధాని న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ మరోసారి సుదీర్ఘ ప్రజా ఉద్యమానికి వేదికైంది. నీట్-యూజీ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం, విద్యా వ్యవస్థలోని అవకతవకలకు వ్యతిరేకంగా ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసనలు ఉధృతరూపం దాల్చాయి. ఆందోళనకారులను అడ్డుకునేందుకు ఢిల్లీ పోలీసులు కరెంటు నిలిపివేసి, కనీస అవసరమైన మరుగుదొడ్లకు నీటి సరఫరాను బంద్ చేసినా.. వారి పోరాట స్ఫూర్తి మాత్రం ఏమాత్రం సడలలేదు. చీకట్లోనూ తమ హక్కుల కోసం, విద్యా వ్యవస్థ ప్రక్షాళన కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు, యువత కదం తొక్కుతున్నారు. అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని వారు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు.
కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఆధ్వర్యంలో మొదలైన ఈ ఉద్యమానికి అనూహ్య స్పందన లభిస్తోంది. కేవలం సామాజిక మాధ్యమాల్లో పురుడుపోసుకున్న ఈ ఆన్లైన్ ఉద్యమం.. నేడు క్షేత్రస్థాయిలో జాతీయస్థాయి సంచలనంగా మారింది. శనివారం ఉదయం నుంచి జంతర్ మంతర్ వద్ద భారీ ఎత్తున నిరసనకారులు బైఠాయించారు. నిరసనకు అనుమతించిన సమయం సాయంత్రం ఐదు గంటలతో ముగిసిందని, చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ తక్షణమే అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్లాలని పోలీసులు ఆదేశించినప్పటికీ ఆందోళనకారులు వెనక్కి తగ్గలేదు. రాత్రి అవుతున్నా వారు అక్కడే ఉండి తమ బైఠాయింపును కొనసాగించారు. ఆందోళనకారులను చెదరగొట్టే వ్యూహంలో భాగంగా అధికారులు జంతర్ మంతర్ వద్ద ఉన్న విద్యుత్ దీపాలను ఆర్పివేశారు. అక్కడున్న ఏకైక పబ్లిక్ వాష్ రూమ్‌కు నీటి సరఫరాను నిలిపివేశారు. కనీసం తాగేందుకు నీళ్లు, తినేందుకు ఆహారం కూడా లోపలికి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారని విద్యార్థులు తీవ్ర స్థాయిలో ఆరోపించారు.
చీకట్లో శాంతియుత నిరసనకారులపై ఎలాంటి దాడి జరిగినా అందుకు విద్యుత్ సరఫరా నిలిపివేసిన పోలీసులదే పూర్తి బాధ్యత అని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే హెచ్చరించారు. నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికీ ఉంటుందని, నాడు స్వాతంత్ర్య పోరాటంలో నిరాహార దీక్ష చేస్తున్న భగత్ సింగ్‌కు బ్రిటిష్ వాళ్లు సైతం తాగేందుకు నీళ్లు ఇచ్చారని గుర్తుచేశారు. కానీ ఈరోజు స్వతంత్ర భారత దేశంలో న్యాయం కోసం నిరసన తెలుపుతున్న విద్యార్థులకు కనీసం నీళ్లు కూడా ఇవ్వకుండా అడ్డుకోవడం దారుణమని ఆయన మండిపడ్డారు. చేతుల్లో ఖాళీ ప్లేట్లు, గరిటెలు పట్టుకుని ‘గో ప్రధాన్ గో’ అంటూ నినాదాలు చేస్తూ నిరసనకారులు జంతర్ మంతర్ వద్ద తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దేశ విద్యావ్యవస్థలోని లోపాలను సరిదిద్ది, విద్యార్థులకు న్యాయం జరిగే వరకు తాము జంతర్ మంతర్ ను వీడేది లేదని తేల్చిచెప్పారు.
పోలీసుల తీరుపై సామాజిక మాధ్యమాల్లోనూ, క్షేత్ర స్థాయిలోనూ సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో, ఎట్టకేలకు రాత్రి పొద్దుపోయాక కరెంటు, నీటి సరఫరాను అధికారులు పునరుద్ధరించారు. కాగా, ఈ ఉద్యమానికి నలుదిశల నుంచి మద్దతు వెల్లువెత్తుతోంది. అఖిల భారత విద్యార్థి సంఘం , భారత విద్యార్థి ఫెడరేషన్ వంటి సంఘాలు ఈ నిరసనకు సంఘీభావం తెలిపాయి. విద్యా వ్యవస్థలో సమూల సంస్కరణలు తెచ్చే వరకు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ని రద్దు చేసే వరకు ఈ శాంతియుత పోరాటం ఆగదని విద్యార్థి నాయకులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు, ప్రముఖ పర్యావరణవేత్త, లడఖ్ పోరాట యోధుడు సోనమ్ వాంగ్‌చుక్ సైతం ఈ ఆందోళనకు మద్దతు పలికారు. జూన్ 27వ తేదీలోగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే, తాను స్వయంగా నిరాహార దీక్షకు దిగుతానని ఆయన ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించారు. మొత్తం మీద లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న నీట్ లీకేజీ వ్యవహారంపై కాక్రోచ్ పార్టీ రగిలించిన ఈ చిచ్చు.. దేశ రాజధానిలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది.







