- పవన్ కల్యాణ్ పై అనుచిత వ్యాఖ్యల కేసు
- పోలీసుల విచారణకు హాజరైన ఎమ్మెల్సీ శ్రీనివాస్
- స్టేషన్ బయట మాధురి హడావిడి
శ్రీకాకుళం, మహా : ఉత్తరాంధ్ర రాజకీయాల్లో నిరంతరం వార్తల్లో నిలిచే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఆయన సహచరిణి దివ్వెల మాధురి జోడీ తాజాగా శ్రీకాకుళం జిల్లా కొత్తూరు పోలీస్ స్టేషన్ వేదికగా మరోసారి హల్‌చల్ చేశారు. ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై గతంలో దువ్వాడ శ్రీనివాస్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కేసులో విచారణ నిమిత్తం పోలీసులు నోటీసులు జారీ చేయడంతో వీరిద్దరూ పీఎస్‌కు హాజరయ్యారు. పోలీస్ స్టేషన్ లోకి మాధురీని అనుమతించని పోలీసులు దువ్వాడ శ్రీనివాస్‌ను గదిలో కూర్చోబెట్టి లీగల్ విచారణ జరుపుతుండగా.. బయట మాత్రం మాధురి నిరసనలు చేస్తూ హడావుడి చేశారు. పోలీస్ స్టేషన్ గేటు వద్దే మాధురి సంచలన వ్యాఖ్యలు చేశారు. “ఈ జిల్లాలో పోలీసులకు మరే క్రైమ్‌లు దొరకలేదా.. మా ఆయనే దొరికాడా? దువ్వాడ శ్రీనివాస్‌కి ఏమైనా అయితే నేను చూస్తూ ఊరుకోను.. మా ఆయన్ని ఇంతలా హింసిస్తున్న వారిని అసలు వదలను” అంటూ ఆమె హెచ్చరికలు జారీ చేశారు.
ఎప్పుడో పాత ఫిర్యాదును పట్టుకుని ఇప్పుడు విచారణకు రమ్మనడం వెనుక పూర్తి రాజకీయ కక్షసాధింపు ఉందంటూ మాధురి ఆరోపించారు. “మా ఆయన చేసింది తప్పైతే, పవన్ కల్యాణ్ చేసింది తప్పు కాదా? పవన్ కల్యాణ్ మా నేత వైఎస్ జగన్‌ను ఎలా పడితే అలా తిట్టొచ్చు.. కానీ మా శ్రీను మాత్రం పవన్‌ను తిట్టకూడదా? అంటూ ప్రశ్నించారు. ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎన్ని సార్లు విచారణకు పిలిచినా తాము తగ్గేదే లేదంటూ పోలీసుల ముందే ఓపెన్ చాలెంజ్ విసిరారు. ఒకవైపు దువ్వాడ శ్రీనివాస్ లోపల పోలీసుల ప్రశ్నలకు చట్టపరంగా సమాధానాలు చెప్పుకుంటుంటే, బయట మాధురి క్రియేట్ చేసిన ఈ భారీ డైలాగుల షో మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌గా మారింది.







