2047 నాటికి ఏపీ $2.4 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ.
* రిపబ్లిక్ టీవీ సమ్మిట్‌లో మంత్రి నారా లోకేశ్.
ఢిల్లీ:మహా.
ఆంధ్రప్రదేశ్‌ను 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. న్యూఢిల్లీ వేదికగా జరిగిన ‘రిపబ్లిక్ టీవీ సమిట్ 2026’లో ఆయన పాల్గొని రాష్ట్ర భవిష్యత్తు ప్రణాళికలు, అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర రూపురేఖలను మార్చేందుకు అత్యంత వేగంగా అడుగులు వేస్తోందని, రాబోయే ఐదేళ్లలో ఏకంగా 20 లక్షల ఉద్యోగాల సృష్టే ధ్యేయంగా అహర్నిశలూ శ్రమిస్తోందని ఆయన వివరించారు.
**పెట్టుబడుల ఆకర్షణకు ‘3S’ ఫార్ములా.. సీఎం చంద్రబాబు ఒక ‘స్పీడ్ బాస్’**
పెట్టుబడులను ఆకర్షించడంలో దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్.. స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్ ఫార్ములాను ఆదర్శంగా నిలుపుతోందని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ పని అయినా అత్యంత వేగంగా పూర్తి కావాలని కోరుకునే ఒక ‘స్పీడ్ బాస్’ అని, ఆయన వేగానికి తగ్గట్టుగానే ప్రభుత్వ యంత్రాంగం పరుగులు పెడుతోందని ప్రశంసించారు. ప్రస్తుతం దేశంలోకి వస్తున్న మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో 25 శాతం వాటా ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే వస్తుండటం కూటమి ప్రభుత్వ సమర్థతకు నిదర్శనమని గర్వంగా ప్రకటించారు.
**రికార్డు సమయంలో ప్రాజెక్టుల పురోగతి.. 2028 నాటికి అమరావతి కోర్ క్యాపిటల్**
రాష్ట్రంలో పారిశ్రామిక అనుమతులు, భూ కేటాయింపులు శరవేగంగా జరుగుతున్నాయని లోకేశ్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక రక్షణ ప్రాజెక్ట్ కోసం కేవలం 37 రోజుల్లోనే 600 ఎకరాల భూమిని సేకరించి అప్పగించామని, గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్ట్‌ను 13 నెలల రికార్డు కాలంలోనే పట్టాలెక్కించి ప్రభుత్వ స్పీడ్‌ను నిరూపించామని ఉదాహరించారు. రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం ఒక సెల్ఫ్-ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అని, కేంద్రం ఇచ్చే నిధులు కేవలం ప్రారంభం మాత్రమేనని ఆయన తేల్చిచెప్పారు. ప్రస్తుతం రూ.60,000 కోట్ల నిధుల సమీకరణతో అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా నిర్మిస్తున్నామని వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీకి ఇచ్చిన మాట ప్రకారం 2028 నాటికల్లా అమరావతి కోర్ క్యాపిటల్ భవనాలను సిద్ధం చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ కూటమిలో ఏపీ నుంచి ఎక్కువ మంది ఎంపీలు ఉండటం వల్ల ఢిల్లీలో రాష్ట్ర గొంతు ఎంతో బలంగా వినిపిస్తోందని ఆయన గుర్తుచేశారు.
**రాష్ట్రంలో మూడు బలమైన ఆర్థిక ప్రాంతాలు.. పార్టీలో యువతకు పెద్దపీట**
రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్‌ను మూడు ప్రధాన ఆర్థిక హబ్‌లుగా తీర్చిదిద్దుతున్నట్లు మంత్రి లోకేశ్ వివరించారు. ఇందులో భాగంగా విశాఖపట్నం (వైజాగ్)ను ఐటీ హబ్‌గా, అమరావతిని నాలెడ్జ్ హబ్‌గా, రాయలసీమను మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. రాజకీయాల్లో మార్పుల గురించి ప్రస్తావిస్తూ.. తెలుగుదేశం పార్టీలో స్పష్టమైన జనరేషన్ షిఫ్ట్ (నాయకత్వ మార్పు) కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. పార్టీలో యువతకు ఎనలేని ప్రాధాన్యం ఇస్తున్నామని, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో 50 శాతం మంది తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారే ఉండటం ఇందుకు నిదర్శనమని మంత్రి నారా లోకేశ్ ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేశారు.






