Mahaa Daily Exclusive

  రైతులకు అలర్ట్….

Share

రైతులకు అలర్ట్.
* ఆ 7 రకాల సన్నాలకే ప్రభుత్వ బోనస్..
* విత్తనాలు కొనే ముందు చూసుకోండి!
* రూ.500 బోనస్ కావాలంటే ప్రభుత్వం సూచించిన రకాలే పండించాలి.
* రేపటి నుంచి రైతు వేదికల్లో విత్తన మేళాలు.
* అవగాహన కల్పించనున్న అధికారులు.
*వానాకాలంలో 38.19 లక్షల ఎకరాల్లో సన్నాల సాగుకు సర్కార్ కసరత్తు.
హైదరాబాద్, మహా.
తెలంగాణలోని అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం కీలక సూచన చేసింది. రాబోయే వానాకాలం సీజన్‌లో వరి సాగు చేసే రైతులు విత్తనాలు కొనుగోలు చేసే ముందే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని కోరింది. రాష్ట్రంలో రైతులు సాధారణంగా 33 రకాల సన్న వడ్లను సాగు చేస్తుండగా, ఈసారి వాటిల్లో కేవలం 7 రకాల విశిష్ట సన్న వరి రకాలకు మాత్రమే ప్రభుత్వ బోనస్ అందించాలని సర్కారు యోచిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించే కనీస మద్దతు ధరకు అదనంగా క్వింటాకు రూ.500 చొప్పున ఇచ్చే బోనస్ ఈ ఏడు రకాలకే వర్తించనుంది. ఈ నేపథ్యంలో రైతులు ఏ రకాలు పండించాలనే దానిపై స్పష్టతనిస్తూ, ఈనెల 23వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతు వేదికల్లో ప్రత్యేక విత్తన మేళాలు నిర్వహించి అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది.
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు, ప్రైవేటు మిల్లర్ల వద్ద రైతులు పడుతున్న ఇబ్బందులను దూరం చేయడంతో పాటు, అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్‌ను బట్టి ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం బోనస్ వర్తింపజేయాలని భావిస్తున్న ఆ 7 రకాల సన్న వడ్ల వివరాలు ఇలా ఉన్నాయి. 120 నుంచి 125 రోజుల పంట కాలంతో, అగ్గితెగులు (బ్లాస్ట్) తట్టుకునే ‘తెలంగాణ సోన (RNR-15048)’, 145-150 రోజుల పంట కాలంతో ఎగుమతులకు అనుకూలంగా ఉండే సుగంధభరిత ‘సాంబ మసూరి (BPT-5204)’, వ్యాధి నిరోధక శక్తి కలిగిన ‘KNM-1638’ రకాలు ఇందులో ఉన్నాయి. వీటితో పాటు మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్, అద్భుతమైన రుచి ఉండే ‘హెచ్‌ఎంటీ సోన’, వర్షాకాలం, యాసంగి రెండింటికీ అనుకూలంగా ఉండి అధిక దిగుబడినిచ్చే ‘జైశ్రీరాం’, అన్ని రకాల నేలల్లో స్థిరమైన దిగుబడినిచ్చే ‘VGL-44’ మరియు మార్కెట్‌లో మంచి క్రేజ్ ఉన్న ‘KNM-7715’ రకాలకు మాత్రమే ఈ బోనస్ లభించనుంది.
ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, వినియోగ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి సన్నాల సాగు విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ వానాకాలం సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1.34 కోట్ల ఎకరాల్లో సాగు సాగాల్సి ఉండగా, అందులో 69 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని అంచనా వేశారు. ఈ వరి సాగులో దాదాపు 38.19 లక్షల ఎకరాల్లో కేవలం ఈ 7 రకాల సన్నాలనే పండించేలా రైతులను ప్రోత్సహించనున్నారు. గత సీజన్‌తో పోలిస్తే ఈసారి సన్నాల సాగు విస్తీర్ణాన్ని మరో 10.31 లక్షల ఎకరాలకు పెంచడం గమనార్హం. దీనికి సంబంధించిన సబ్సిడీ, బోనస్, విత్తనాల లభ్యత తదితర మార్గదర్శకాలతో కూడిన నివేదికను వ్యవసాయ శాఖ ఇప్పటికే మంత్రిమండలి ఆమోదానికి పంపింది.
విత్తనాల సబ్సిడీ పొందేందుకు ప్రభుత్వం ఒక కొత్త నిబంధనను తీసుకువచ్చింది. రైతులు విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో ముందుగా పూర్తి ధర చెల్లించాల్సి ఉంటుంది. వారు కొన్న విత్తనాల బిల్లులను పంట కాలం ముగిసే వరకు అత్యంత భద్రంగా దాచుకోవాలి. పంట సాగులో ఉన్నప్పుడు వ్యవసాయ విస్తరణాధికారి క్షేత్రస్థాయిలో సదరు రైతు పొలాన్ని సందర్శిస్తారు. ప్రభుత్వం సూచించిన విత్తనాలనే రైతు సాగు చేశాడని ఏఈవో ధ్రువీకరించిన తర్వాతే, విత్తన సబ్సిడీ సొమ్ము నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమవుతుందని అధికారులు స్పష్టం చేశారు.