Mahaa Daily Exclusive

  ఉద్ధవ్‌ సేనకు భారీ షాక్‌…

Share

ఉద్ధవ్‌ సేనకు భారీ షాక్‌..
* షిండే గూటికి ఆరుగురు ఎంపీలు.
*సక్సెస్ అయిన ‘ఆపరేషన్ టైగర్’..
* అనర్హత వేటు నుంచి తప్పించుకున్న వైనం.
ముంబయి, మహా.
మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆయన నేతృత్వంలోని శివసేన (యూబీటీ)కి చెందిన ఆరుగురు లోక్‌సభ సభ్యులు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వర్గంలో చేరారు. దీంతో గత కొంతకాలంగా రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ‘ఆపరేషన్ టైగర్’ విజయవంతంగా ముగిసినట్లయింది. ఒకేసారి సగానికి పైగా ఎంపీలు పార్టీని వీడటం ఉద్ధవ్ థాక్రేకు మింగుడుపడని పరిణామంగా మారింది.
సోమవారం (జూన్ 22న) ఏక్‌నాథ్ షిండే సమక్షంలో ఆరుగురు ఎంపీలు అధికారికంగా శివసేన (షిండే) తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ మారిన వారిలో సంజయ్ హరిభౌ జాదవ్, భౌసాహెబ్ రాజారామ్ వాక్‌చౌరే, ఓంప్రకాష్ భూపాల్‌సింగ్ నింబాల్కర్, సంజయ్ దీనా పాటిల్, సంజయ్ ఉత్తమ్‌రావ్ దేశ్‌ముఖ్, నగేష్ బాపురావ్ పాటిల్ అస్తికర్ ఉన్నారు. వీరికి షిండే సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమదే అసలైన శివసేన పార్టీ అని ఉద్ఘాటించారు. బాల్ థాక్రే ఆశయాలను, సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లేది తామేనని స్పష్టం చేశారు. ఉద్ధవ్ వర్గం నుంచి ఈ ఆరుగురు నేతలు తమతో కలిసి రావడం తమకు మరింత బలాన్ని, పెద్ద ఊరటను చేకూర్చిందని ఆనందం వ్యక్తం చేశారు. “ఇప్పుడు ఇక్కడ ఒక్క పులి కాదు.. ఆరుగురు పులులు ఉన్నారు” అంటూ ఆపరేషన్ టైగర్‌ను పరోక్షంగా ప్రస్తావిస్తూ షిండే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
**అనర్హత వేటుకు అవకాశం లేదు..**
తాజా రాజకీయ పరిణామాలతో ఈ ఆరుగురు ఎంపీలపై అనర్హత వేటు పడుతుందా అన్న చర్చ మొదలైంది. అయితే వారికి చట్టపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. శివసేన (యూబీటీ)కి లోక్‌సభలో మొత్తం తొమ్మిది మంది సభ్యులు ఉన్నారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం.. ఎంపీలపై అనర్హత వేటు పడకుండా ఉండాలంటే మూడింట రెండు వంతుల (2/3) మెజారిటీ సభ్యులు వేరే పార్టీలో విలీనం కావాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉద్ధవ్ సేనకు ఉన్న తొమ్మిది మందిలో సరిగ్గా మూడింట రెండు వంతుల మంది, అనగా ఆరుగురు ఎంపీలు ఒకేసారి షిండే వర్గంలో చేరారు. చట్టప్రకారం అవసరమైన మెజారిటీ ఉండటంతో ఈ ఆరుగురు ఎంపీలు అనర్హత వేటు నుంచి సులభంగా తప్పించుకున్నట్లేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.