తెరవెనక ‘రాములమ్మ’ రాజకీయం!
– తనకూ మంత్రి పదవి కావాలంటూ హస్తిన బాట
– అవకాశాలే అదునుగా అందిపుచ్చుకునే యత్నం
– సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్ లను సంప్రదించకుండానే పైరవీలు
– విజయశాంతి వ్యవహారంపై కాంగ్రెస్ వర్గాల్లో సరికొత్త చర్చ, సీనియర్ల ఆగ్రహం
– అధిష్టానం ఇచ్చిన పదవిపై మొదటి నుంచీ ఆమె అసంతృప్తి
– ఔట్ డేటెడ్ లీడరు ఆ పదవే ఎక్కువంటూ పీసీసీ ముఖ్య నేతల గుస్సా
– పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా పదవులెలా ఇస్తారంటూ అభ్యంతరాలు
(రాజేష్ జైన్ నిడార్కర్)
ఒకప్పుడు తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేసిన ప్రముఖ సినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతి కాంగ్రెస్ లో కీలక పదవిని అధిష్టించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తనకూ మంత్రి పదవి కావాలంటూ హస్తిన బాట పట్టారు. రేవంత్ కేబినెట్లో మహిళలకు ప్రాతినిధ్యం ఉన్నప్పటికీ, అవకాశాలే అదునుగా అందిపుచ్చుకునేందుకు అడ్డదారి వ్యవహారం నడిపిస్తున్నారు. ఒకవేళ ప్రక్షాళన జరిగతే, ఇద్దరు మహిళా మంత్రుల్లో ఒకరిని తప్పించే అవకాశాలున్నాయన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఆ అవకాశం తనకే దక్కాలన్న తపనతో విజయశాంతి వరుసబెట్టి అగ్రనేతలను కలుస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్కుమార్ గౌడ్లతో పాటు ఇతర పార్టీ పెద్దలను సంప్రదించకుండా అధిష్టానం పెద్దల వద్దకు వెళుతూ పైరవీలు చేయడం పట్ల పార్టీలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ కీలక పదవి ఆశిస్తుండడం ఆశ్చర్యంగా ఉందంటూ ముఖ్య నేతలు ఆక్షేపిస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఎమ్మెల్సీ విజయశాంతి వ్యవహారంపై కాంగ్రెస్ వర్గాల్లో సరికొత్త చర్చ మొదలైంది. ఉన్న రెండు మంత్రి పదవులకు పదుల సంఖ్యలో ఆశావహులు, అర్హులైన నాయకులు ఉన్నప్పటికీ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా పదవులెలా ఇస్తారంటూ సీనియర్ల నుంచి ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి.
కానీ, అధిష్టానం ఇచ్చిన పదవిపై ఆమె మొదటి నుంచీ అసంతృప్తితోనే ఉన్నారు. 2023 అసెంబ్లీ, 2024 పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరిగిన పంచాయతీరాజ్, పురపాలక ఎన్నికల్లో ఆమె పాల్గొనలేదు. అలాగే జూబ్లీ హిల్స్, కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో సీనియర్లు విజ్ఞప్తి చేసినా ప్రచారానికి రాలేదు. ఇతర రాష్ట్రాల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏఐసీసీ అధిష్టానం విజయశాంతిని స్టార్ క్యాంపెయినర్ జాబితాలో చేర్చినా, ప్రచారానికి వెళ్లాలని ఆదేశాలిచ్చినా… అవేవీ పట్టించుకోకుండా ఇంటికే పరిమితమయ్యారు. ఈ క్రమంలో ఉన్నట్లుండి ప్రస్తుతం మంత్రి పదవి కావాలంటూ ఢిల్లీలో మకాంవేసి ప్రయత్నాలు చేస్తుండడం పట్ల క్రియాశీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఔట్ డేటెడ్ లీడరు ఇప్పుడున్న ఎమ్మెల్సీ పదవే ఎక్కువంటూ పీసీసీ ముఖ్య నేతలు కొందరు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఈ క్రమంలో విజయశాంతి అల్టిమేటం.. కాంగ్రెస్కు షాక్ తప్పదంటూ ఆమెఅనుచర వర్గానికి చెందిన కొంతమంది నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఒకవేళ ఆశించిన పదవి కాకుంటే, కాంగ్రెస్ రాజకీయాల్లో ఇప్పుడు ‘రాములమ్మ’ రూట్ మార్చబోతున్నారా? పార్టీ అధిష్ఠానం ఇచ్చిన పదవిపై ఆమె అసంతృప్తిగా ఉన్నారా? అంటే అవుననే అంటున్నాయి గాంధీ భవన్ వర్గాలు, ఎన్నికల ముందు కాంగ్రెస్ గూటికి చేరిన విజయశాంతి.. ప్రస్తుతం పార్టీ వ్యవహారాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. పదవులు ఉన్నా లేకపోయినా తనదైన శైలిలో దూకుడు ప్రదర్శించే ఆమె ఇప్పుడు కాంగ్రెస్ తీరుపై కొంత అసహనంతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఊహించని పరిణామాల నేపథ్యంలో గత ఏడాది ఆమెకు కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టింది.
అసలు సీనియర్ల లిస్టులోనే లేని ఆమె పేరు తెరపైకి రావడం, నేరుగా ఢిల్లీ స్థాయిలోనే లాబీయింగ్ చేసి పదవి దక్కించుకోవడం అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది. అయితే, ఈ ఎమ్మెల్సీ పదవిపై రాములమ్మ అస్సలు హ్యాపీగా లేరన్నది ఇన్సైడ్ టాక్. తన సీనియారిటీకి, ఇమేజ్కు కేవలం శాసనమండలి సభ్యురాలిగా ఉండటం సరిపోదని, తన అసలు రేంజ్ మంత్రి పదవి అని ఆమె భావిస్తున్నట్లు సమాచారం. ఈ అసంతృప్తి కారణంగానే విజయశాంతి పార్టీ అధికారిక కార్యక్రమాలకు పెద్దగా హాజరుకావడం లేదని తెలుస్తోంది. కేవలం శాసనమండలి సమావేశాలకు మాత్రమే వస్తూ, అదీ మొక్కుబడిగా ప్రశ్నలు వేసి వెళ్ళిపోతున్నారని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. పైగా, మొన్నటి మొన్న జరిగిన మండలి సమావేశాల్లో సొంత ప్రభుత్వంపైనే ఆమె కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేయడం, పరోక్షంగా తన అక్కసును వెళ్లగక్కడం కాంగ్రెస్ శ్రేణులను విస్మయానికి గురిచేసింది. ఇప్పుడున్న పోటీ పరిస్థితుల్లో విజయశాంతికి మంత్రి పదవి దక్కే అవకాశాలే లేవు. ఈ పరిణామాలు చూస్తుంటే రాములమ్మ కాంగ్రెస్కు ఏదో ఒక గట్టి అల్టిమేటం ఇవ్వబోతున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అవకాశాలు లేకున్నా.. రాహుల్, ప్రియాంక చుట్టూ ప్రదక్షిణలు
రాష్ట్రంలో త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో, విజయశాంతి తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇక్కడి స్థానిక నేతలతో సంబంధం లేకుండా, నేరుగా హైకమాండ్ని ఢిల్లీలో కలవాలని ఆమె డిసైడ్ అయినట్లు అనుచరవర్గం చెబుతోంది. ఇప్పటికే మంత్రి పదవుల కోసం పలువురు ఎమ్మెల్యేలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే తదితర ముఖ్య నేతల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండగా, రాములమ్మ మాత్రం ఒక పక్కా ప్లాన్ తో హస్తిన బాట పట్టి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తనకు కనుక మంత్రి పదవి ఇస్తే.. పార్టీ బలోపేతానికి, ప్రభుత్వ మైలేజ్్కు ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్తానో వివరించడానికి విజయశాంతి ఒక ప్రత్యేక బ్లూ ప్రింట్ కూడా సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. కాగా, గతంలో ఎవరూ ఊహించని విధంగా ఎమ్మెల్సీ పదవిని సొంతం చేసుకున్న రాములమ్మ. అదే జోష్ ఇప్పుడు మంత్రి పదవిని కూడా సాధించుకుంటే ఆశ్చర్యపోనక్కర్లేదని సొంత పార్టీలోని ఒక వర్గం నేతలు గుసగుసలాడుకుంటున్నారు.
రాములమ్మ డిమాండ్ కు ఢిల్లీ పెద్దలు తలొగ్గుతారా?
మరి ఢిల్లీ పెద్దలు రాములమ్మ డిమాండ్ కు తలొగ్గుతారా? లేదా అనే అంశంపై ఉత్కంఠ నెలకొని ఉంది. కాంగ్రెస్లో త్వరలో మంత్రి వర్గ విస్తరణ జరగనుందన్న ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతుంది. అయితే అన్ని రకాల అర్హతలున్న తనకు మంత్రి పదవి ఎందుకు దక్కడం లేదన్నది ఆమె సన్నిహితుల వద్ద ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. నిజానికి కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో విజయశాంతి పేరు రావడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. అసలు విజయశాంతి పేరును ఎవరూ ఊహించ లేదు. ఢిల్లీలో ఉండి మల్లికార్జున ఖర్గేను కలిసినప్పటికీ ఆమె పేరు ఖరారు చేస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేతలు ఎవరూ భావించలేదు. నేరుగా హైకమాండ్ను కలసి తనకు ఎమ్మెల్సీ పదవిని తెచ్చుకున్న ఘనత విజయశాంతిది. ఇప్పటికే ఢిల్లీకి వెళ్లి అనేక మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నేరుగా రాహులు కలసి తమకు మంత్రిపదవి ఇవ్వాలని పదేపదే కోరుతున్నారు. దీంతో రాములమ్మ కూడా హస్తిన బాట పట్టి తనదైన శైలిలో పోటీ పడుతున్నారన్న ప్రచారం జోరందుకుంది.
ఎండ్..








