Mahaa Daily Exclusive

  ప్రేమనగర్‌లో ‘సమస్యలపై సమరం’

Share

  • ప్రేమనగర్‌లో ‘సమస్యలపై సమరం’
  • మన్నె గోవర్ధన్ రెడ్డి విస్తృత పర్యటన

బంజారాహిల్స్, మహా

ఖైరతాబాద్ నియోజకవర్గంలోని బంజారాహిల్స్ డివిజన్ ప్రేమనగర్ కాలనీలో మంగళవారం ఉదయం ‘సమస్యలపై సమరం’ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ ఇంచార్జ్ మన్నె గోవర్ధన్ రెడ్డి కాలనీలో విస్తృతంగా పర్యటించి, స్థానికుల సమస్యలను క్షేత్రస్థాయిలో అడిగి తెలుసుకున్నారు. బస్తీ ప్రజలు తమ ఎదుర్కొంటున్న పలు దీర్ఘకాలిక సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
ప్రేమనగర్‌లో తీవ్రమైన తాగునీటి సమస్య వేధిస్తోందని, ముఖ్యంగా సాయిబాబా టెంపుల్ వెనుక భాగంలో కాలుష్య నీరు వస్తోందని స్థానిక మహిళలు ఎంజీఆర్ ఎదుట తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సరైన సమయానికి నీటి సరఫరా కాకపోవడం వల్ల పడుతున్న ఇబ్బందులను వివరించారు. దీనిపై తక్షణమే స్పందించిన గోవర్ధన్ రెడ్డి.. వాటర్ వర్క్స్ మేనేజర్ అభిషేక్ రెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు. గత ఏడాది కాలంగా నలుగుతున్న ఈ తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. కాలనీలో ప్రమాదకరంగా మారిన పాత ఐరన్ విద్యుత్ స్తంభాలు, వెలగని వీధి దీపాలపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై సంబంధిత ఎలక్ట్రికల్ ఏఈ తో మాట్లాడిన ఎంజీఆర్.. పాత ఐరన్ స్తంభాల స్థానంలో తక్షణమే కొత్త సిమెంట్ స్తంభాలను ఏర్పాటు చేయాలని, వీధి దీపాలు వెలిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం శ్రీలంక బస్తీలో పర్యటించిన సమయంలో.. జీహెచ్‌ఎంసీ క్యాచ్‌పిట్స్ ను సకాలంలో శుభ్రపరచకపోవడం వల్ల వర్షపు నీరు రోడ్లపైనే నిలిచిపోయి ప్రజలు నరకయాతన పడుతున్న విషయాన్ని ఎంజీఆర్ గమనించారు. తక్షణమే జీహెచ్‌ఎంసీ ఎస్ఈ విజయ్ కుమార్, ఏఈ మోహన్ రావులతో ఫోన్‌లో మాట్లాడి, సిబ్బందిని వెంటనే అక్కడికి పంపి డ్రైనేజీ క్యాచ్‌పిట్లను క్లీన్ చేయించాలని, నిలిచిన నీటిని తొలగించేలా చర్యలు చేపట్టాలని కోరారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సాగిన ఈ పర్యటనలో బీఆర్‌ఎస్ నాయకులు రావుల విజయ్ కుమార్, ప్రభాకర్ రెడ్డి, శ్రీధర్ యాదవ్, నవీన్, నాగరాజు, రోహిత్ మరియు కాలనీవాసులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.