Mahaa Daily Exclusive

  రైతన్నకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం…

Share

రైతన్నకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం.
* దశాబ్దం తిరగకముందే కుంగిన కాళేశ్వరం.
* బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రం అప్పుల పాలు.
* ఎన్నికల హామీల అమలుతో ఇందిరమ్మ రాజ్యం సాకారం.
* డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.
* 36 వేల కోట్లతో రైతులకు దన్నుగా నిలిచాం.
* మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.
* 30న జగన్నాధపురంలో సీఎం రేవంత్ రెడ్డితో భారీ సభ.. విజయవంతం చేయాలని పిలుపు.
ఖమ్మం, మహా
కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షపాతి అని, ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి నిరుపేద కుటుంబానికి సంక్షేమ ఫలాలు ఇంటింటికీ అందిస్తున్న ఘనత తమకే దక్కుతుందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఉద్ఘాటించారు. బుధవారం వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ‘రైతు ఆశీర్వాద సభ’ సన్నాహక సమావేశం అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన భట్టి విక్రమార్క.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై, ఆ పార్టీ నాయకత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆనాడు తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ హయాంలో నిర్మించిన భారీ సాగునీటి ప్రాజెక్టులు దశాబ్దాలు గడుస్తున్నా నేటికీ చెక్కుచెదరకుండా ప్రజలకు సేవలు అందిస్తుంటే.. గత బీఆర్ఎస్ పాలకులు లక్ష కోట్లు వెచ్చించి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పదేళ్లు తిరగకముందే కుంగిపోవడం వారి అవినీతికి, పాలకుల అసమర్థతకు నిదర్శనమని ఆయన దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్రాన్ని గత ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చేసిందని, కేసీఆర్ చేసిన ఆ భారీ అప్పులకు నేడు కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీలు చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. తండ్రి, కొడుకు, కూతురు, అల్లుడు మళ్లీ మాయమాటలు చెబుతూ రాష్ట్రంలో పర్యటిస్తున్నారని, వారి గారడీ మాటలను ప్రజలు ఏమాత్రం నమ్మవద్దని ఆయన స్పష్టం చేశారు.
అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల మన్ననలు పొందుతోందని ఉపముఖ్యమంత్రి వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా కోటి పది లక్షల కుటుంబాలకు ఉచితంగా నాణ్యమైన సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తున్నామని, అలాగే ప్రతి కుటుంబానికి పది లక్షల రూపాయల ఆరోగ్య బీమా కల్పిస్తూ నిరుపేదల ఆరోగ్యానికి గట్టి భరోసా ఇస్తున్నామని పేర్కొన్నారు. మహిళా సాధికారతే లక్ష్యంగా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని, నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ఏకంగా 22 వేల కోట్ల రూపాయలు కేటాయించామని ఆయన గుర్తుచేశారు. అన్నదాతలను ఆదుకునేందుకు రైతు రుణమాఫీతో పాటు రైతుభరోసా కింద వేలాది కోట్ల రూపాయలు చెల్లించామని, మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించి, ఆర్టీసీకి 13 వేల కోట్ల రూపాయలు చెల్లించినట్లు ఆయన గణాంకాలతో సహా సభకు వివరించారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రవేశపెట్టిన ఓటర్ల సవరణ ప్రక్రియ అప్రమత్తంగా వ్యవహరించకపోతే ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని భట్టి సూచించారు. బూత్ స్థాయి ఏజెంట్లు ఓటు హక్కు ప్రాముఖ్యతపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని, విలువైన ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేలా పోలింగ్ సిబ్బందికి సైతం సమగ్రమైన సమాచారాన్ని చేరవేయాలని దిశానిర్దేశం చేశారు.
ఇదే క్రమంలో వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేసిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. రైతు భరోసా పథకం కింద 36 వేల కోట్ల రూపాయలు అందించిన ఘనతను సొంతం చేసుకుందన్నారు. రైతులురురు పండించిన వరి, మొక్కజొన్న తదితర పంటలకు సకాలంలో గిట్టుబాటు ధర కల్పించి అన్నదాతలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆయన కొనియాడారు. కేంద్ర ప్రభుత్వంపై ప్రత్యేకంగా ఒత్తిడి తీసుకువచ్చి రైతులకు సకాలంలో అవసరమైన ఎరువులను పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచామన్నారు.
ఈ నెల 30వ తేదీన మధిర నియోజకవర్గం, చింతకాని మండలం జగన్నాధపురంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో జరగనున్న ‘రైతు ఆశీర్వాద సభ’ను పార్టీ శ్రేణులు, రైతాంగం పెద్ద ఎత్తున తరలివచ్చి చారిత్రాత్మక విజయం సాధించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రులు పిలుపునిచ్చారు. ఈ ప్రతిష్ఠాత్మక సన్నాహక సమావేశంలో వైరా శాసనసభ్యులు మాలోత్ రాందాసు నాయక్, రాష్ట్ర కళల సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ, గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నూత సత్యనారాయణ, సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గా ప్రసాద్ తో పాటు పెద్ద ఎత్తున స్థానిక నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.