Mahaa Daily Exclusive

  ఒకనాడు కేజీఎఫ్‌.. నేడు జేజీఎఫ్‌!

Share

ఒకనాడు కేజీఎఫ్‌.. నేడు జేజీఎఫ్‌!
*ఆంధ్రప్రదేశ్‌లో సువర్ణ అధ్యాయానికి శ్రీకారం.
* రాయలసీమ ఇక రతనాలసీమగా విరాజిల్లుతుంది.
* ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
* జొన్నగిరిలో గోల్డ్ మైన్స్ ప్లాంట్ ఘనంగా ప్రారంభం.
* భవిష్యత్‌లో 5 వేల మందికి ఉపాధి అవకాశాలు.
* వెయ్యి కిలోల దిశగా ఉత్పత్తి.
* కుల రాజకీయాలతో విషం చిమ్ముతున్న ‘గొడ్డలి’ పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజం.
అమరావతి , మహా.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సువర్ణ అధ్యాయం మొదలైందని, ఒకప్పటి కరవు ప్రాంతమైన రాయలసీమ ఇకపై రతనాలసీమగా మారబోతోందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. చారిత్రక ప్రాధాన్యం కలిగిన జొన్నగిరిలో బుధవారం ఆయన ‘గోల్డ్ మైన్స్ ప్లాంట్‌’ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ.. ఈ స్వర్ణ గనుల ప్రాజెక్టుతో స్థానిక ప్రజల జీవన ప్రమాణాలు సమూలంగా మారతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో ‘స్వర్ణగిరి’గా పిలిచే ఈ జొన్నగిరి ప్రాంతంలో మన కళ్ల ముందే స్వచ్ఛమైన బంగారం ఉత్పత్తి కాబోతోందని, భవిష్యత్తులో యావత్ భారతదేశం జొన్నగిరి గురించే మాట్లాడుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
**ఉత్పత్తిలో దూసుకుపోతాం.. వేలాది మందికి ఉపాధి కల్పిస్తాం**
చమురు తర్వాత మన దేశం అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్నది బంగారమేనని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తుచేశారు. “ఒకప్పుడు దేశంలో కేజీఎఫ్ (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్) గురించి గొప్పగా చెప్పుకునే వాళ్లం.. ఇప్పుడు జేజీఎఫ్ (జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్స్) ఆ స్థాయిలో అభివృద్ధి చెందనుంది” అని ఆయన విశ్లేషించారు. రాయలసీమలో సిరులు పండించేందుకు సాగునీటి ప్రాజెక్టులను సైతం శరవేగంగా పూర్తి చేస్తున్నామని తెలిపారు. ఈ ప్లాంట్ ద్వారా ఏటా ఒక టన్ను బంగారం ఉత్పత్తి కానుందని, ప్రస్తుతం 400 కిలోల సామర్థ్యంతో ప్రారంభమైన ఈ ఉత్పత్తిని త్వరలోనే వెయ్యి కిలోలకు చేర్చనున్నట్లు వెల్లడించారు. భవిష్యత్తులో రెండో యూనిట్ కూడా అందుబాటులోకి వస్తే ఏకంగా 50 టన్నుల బంగారం ఉత్పత్తి చేసే స్థాయికి ఈ ప్రాజెక్టు చేరుకుంటుందని వివరించారు. ఉపాధి కల్పనలోనూ ఈ కర్మాగారం కీలక పాత్ర పోషించనుందని, ఇప్పటికే 800 మందికి ఉద్యోగాలు లభించగా, త్వరలో మరో 1500 మందికి, భవిష్యత్తులో మొత్తం 5 వేల మందికి పైగా ఇక్కడే ఉపాధి అవకాశాలు దక్కుతాయని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.
**అబద్ధాలు చెప్పడంలో ఆ నాయకుడు దిట్ట.. రప్పా రప్పా రాజకీయాలు చెల్లవు**
అనంతరం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సాయికృష్ణ ఘటనను ప్రస్తావిస్తూ విపక్షంపై విమర్శల వర్షం కురిపించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై ఇష్టానుసారం నోరు పారేసుకున్నారని మండిపడ్డారు. సాయికృష్ణ లాంటి సున్నితమైన కేసులో సైతం లబ్ధి పొందాలని చూశారని, కుల రాజకీయాలకు తెరలేపి సమాజంలో విషం చిమ్ముతున్నారని ఆరోపించారు. నేరాలు, ఘోరాలు చేయడం.. ఆ తర్వాత వాటికి రాజకీయ రంగు పులమడం గొడ్డలి పార్టీకి అలవాటుగా మారిపోయిందని దుయ్యబట్టారు. “అబద్ధాలు చెప్పడంలో ఆ నాయకుడు దిట్ట.. రప్పా రప్పా రాజకీయాలు చేయడం తప్ప ఆ పార్టీ రాష్ట్రానికి చేసిందేమీ లేదు. మళ్లీ అధికారంలోకి వస్తామని, గొడ్డలితో రప్పా రప్పా ఆడిస్తామని అంటున్నారని.. ఇటువంటి కుట్రపూరిత శక్తులను ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దు” అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.