Mahaa Daily Exclusive

  సాయికృష్ణది లాకప్ డెత్తే!

Share

సాయికృష్ణది లాకప్ డెత్తే!
* ఆధారాలు మాయం చేసి, మృతదేహాన్ని ధ్వంసం చేశారు.
* కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్‌లో ‘సిట్’ సంచలన నిజాలు.
*హైకోర్టును తప్పుదోవ పట్టించి.. బాధితురాలిని దూషించిన సీఐ నాగరాజు.
* డీవీఆర్ డేటా డిలీట్.. ఎస్‌ఐ వాంగ్మూలంతో బట్టబయలైన ఘోరం.
విజయవాడ, మహా.
రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో చివరకు నగ్నసత్యం బట్టబయలైంది. సాయికృష్ణది ముమ్మాటికీ పోలీసుల అమానుషత్వానికి బలైన ‘కస్టోడియల్ డెత్’ (లాకప్ డెత్) అని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారికంగా నిర్ధారించింది. నిందితుడైన కృష్ణలంక సీఐ నాగరాజుకు ప్రభుత్వాస్పత్రిలో వైద్య పరీక్షలు పూర్తి చేసిన అనంతరం పోలీసులు ఆయనను విజయవాడలోని రెండవ ఏజేఎస్ కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా సిట్ అధికారులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్‌లో గుండెలు అవిసిపోయే దిగ్భ్రాంతికర నిజాలను పొందుపరిచారు. సాయికృష్ణను పోలీస్ కస్టడీలోనే అత్యంత దారుణంగా చంపి, ఆ తర్వాత సాక్ష్యాధారాలు దొరకకుండా మృతదేహాన్ని సైతం పూర్తిగా ధ్వంసం (డెస్ట్రాయ్) చేశారని రిమాండ్ రిపోర్ట్‌లో సిట్ స్పష్టంగా పేర్కొంది. నాన్ బెయిలబుల్ వారెంట్ ఉన్నప్పటికీ నిందితుడిని కోర్టులో హాజరుపరచకుండా చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారని విచారణలో తేలింది.
**మే 5 నుంచి 8 మధ్య పీఎస్‌లోనే ఉన్నాడు: ఎస్‌ఐ వాంగ్మూలం**
గత మే 5వ తేదీ నుంచి జూన్ 19వ తేదీల మధ్య కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘోరం జరిగిందని సిట్ వెల్లడించింది. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సిట్.. మొత్తం 17 మంది సాక్షులను విచారించి వివరాలు సేకరించింది. కేసులో కీలకమైన ఆధారాల కోసం కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా, అక్కడి కంప్యూటర్ సిస్టమ్‌లో డేటా ఏదీ లేకపోవడాన్ని గుర్తించారు. దీంతో స్టేషన్ సిబ్బంది హిమజతో పాటు పలువురిని విచారించగా అసలు విషయం వెలుగుచూసింది. మే 5వ తేదీ నుంచి మే 8వ తేదీల మధ్య సాయికృష్ణ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లోనే ఉన్నాడని, అతని మృతదేహాన్ని కూడా తాను పీఎస్‌లోనే చూశానని అక్కడి ఎస్‌ఐ ఇచ్చిన వాంగ్మూలం ఈ కేసులో అత్యంత కీలకమైన మలుపుగా మారింది.
**సాక్ష్యాల ధ్వంసం.. హైకోర్టుకే అబద్ధాలు!**
పోలీసు కస్టడీలో ఉండగా తీవ్రమైన గాయాలపాలై జూన్ 2వ తేదీ కంటే ముందే సాయికృష్ణ మరణించాడని సిట్ గట్టిగా విశ్వసిస్తోంది. ఈ దారుణాన్ని కప్పిపుచ్చుకోవడానికి, సాక్ష్యాలను నాశనం చేయడానికి సీఐ నాగరాజే ప్రధాన సూత్రధారి అని రిమాండ్ రిపోర్ట్‌లో తేల్చారు. మే 1 నుంచి జూన్ 1 వరకు ఉన్న ఒక నెల రోజుల సీసీటీవీ ఫుటేజ్ డేటా డీవీఆర్‌లో లేకుండా పూర్తిగా డిలీట్ చేశారని, ప్రస్తుతం ఆ డీవీఆర్‌లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించామని సిట్ పేర్కొంది. సాయికృష్ణ పోలీస్ కస్టడీలో మరణించినట్లు తెలిసినప్పటికీ.. కృష్ణలంక పోలీసులు ఆ సమాచారాన్ని నిబంధనల ప్రకారం మేజిస్ట్రేట్‌కు చేరవేయకుండా దాచేశారు. తన కుమారుడు ఏమయ్యాడో చెప్పాలంటూ సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి స్టేషన్‌కు వస్తే సీఐ నాగరాజు ఆమెను తీవ్రంగా దూషించి పంపించేశారు. ఆ తర్వాత ఆమె హైకోర్టులో ‘హెబియస్ కార్పస్’ పిటిషన్ వేసినా కూడా.. సీఐ నాగరాజు ఉన్నత న్యాయస్థానం ముందు సైతం వాస్తవాలను దాచి, కోర్టును ఘోరంగా తప్పుదోవ పట్టించారని సిట్ ఆధారాలతో సహా నిరూపించింది. శాస్త్రీయ ఆధారాలను చేరిపివేయడం ద్వారా సాయికృష్ణను హత్య చేశారని గుర్తించామని, ఈ అదృశ్యం, హత్య వెనుక ఉన్న మరిన్ని గూడుపుఠాణీలు బయటపడాలంటే నిందితుడైన సీఐ నాగరాజును తమ కస్టడీలోకి తీసుకుని మరింత లోతుగా విచారించాల్సి ఉందని సిట్ కోర్టుకు విన్నవించింది.