Mahaa Daily Exclusive

  అంగరంగ వైభవంగా ‘మాటా’ రెండో మహాసభలు….

Share

అంగరంగ వైభవంగా ‘మాటా’ రెండో మహాసభలు.
* అమెరికాలో దేదీప్యమానంగా తెలుగు సంస్కృతి.
* ఫిలడెల్ఫియాలో 7,500 కుటుంబాలతో ప్రతిష్టాత్మక వేడుకలు.
* డీఎస్పీ, రామ్ మిర్యాల లైవ్ షోలతో ఉర్రూతలూగిన ప్రవాసులు.
* ప్రముఖ నటి జయప్రదకు ‘మాటా’ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు.
పెన్సిల్వేనియా:మహా.
ఉత్తర అమెరికాలో తెలుగు సంస్కృతి, సామాజిక ఐక్యత, సేవా కార్యక్రమాలకు ప్రతీకగా నిలుస్తున్న ‘మన అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (MATA – మాటా) రెండో మహాసభలు అత్యంత ఘనంగా ముగిశాయి. పెన్సిల్వేనియా రాష్ట్రంలోని గ్రేటర్ ఫిలడెల్ఫియా ఎక్స్‌పో సెంటర్, ఫెయిర్‌గ్రౌండ్స్ వేదికగా రెండు రోజుల పాటు అట్టహాసంగా జరిగిన ఈ వేడుకల్లో 7,500 మందికి పైగా తెలుగు కుటుంబాలు ఉత్సాహంగా పాల్గొన్నాయి. ఉత్తర అమెరికాలో జరిగిన అతిపెద్ద తెలుగు సమ్మేళనాల్లో ఒకటిగా ఈ మహాసభలు చరిత్ర సృష్టించాయి. ఈ కార్యక్రమానికి పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు.
**తారల తళుకులు.. సంగీత హోరు**
సినీ ప్రముఖుల రాకతో మాటా వేడుకలు మరింత ఆకర్షణీయంగా మారాయి. ప్రముఖ నటులు నిఖిల్ సిద్ధార్థ్, ఐశ్వర్య రాజేష్, జయప్రద, సుమన్, అలీతో పాటు హాలీవుడ్ నటుడు విషి అయ్యర్ తమదైన శైలిలో సందడి చేశారు. హాస్యనటులు శివారెడ్డి, అధిరే అభి, సునామి సుధాకర్, మిమిక్రీ రమేష్ తమ ప్రదర్శనలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ (DSP) తన లైవ్ కాన్సర్ట్‌తో ప్రవాసులను ఉర్రూతలూగించారు. ప్రపంచ స్థాయి ఆడియో-విజువల్ సాంకేతికత, అద్భుతమైన లైటింగ్‌తో జరిగిన డీఎస్పీ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే గాయకుడు రామ్ మిర్యాల లైవ్ మ్యూజికల్ షో సైతం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తొలిరోజు వేడుకలకు యాంకర్ నిఖిల్ విజయేంద్ర సింహా హోస్ట్‌గా వ్యవహరించగా.. రెండో రోజు స్టార్ యాంకర్లు సుమ కనకాల, ప్రదీప్ మాచిరాజు తమదైన పంచ్‌లతో వేడుకల్లో మరింత ఉత్తేజం నింపారు.
**ప్రముఖులకు పురస్కారాల ప్రదానం**
ఈ మహాసభల వేదికపై ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రదకు అత్యున్నత ‘మాటా లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు’ను ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు. డాక్టర్ ఎం.ఎస్. రెడ్డి, డాక్టర్ హరినాథ్ పోలిచర్లలకు ‘ప్రైడ్ ఆఫ్ ఇండియా’ అవార్డులను అందజేశారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి ‘మాటా ఎక్సలెన్స్ అవార్డులు’ వరించాయి. ఈ పురస్కారాలను టీ.పీ. శ్రీనివాస్ రావు (వ్యాపార రంగం), భాస్కర్ గంటి (దాతృత్వం), సాయినాథ్ కర్నాటి (యువ పారిశ్రామికవేత్త), స్వాతి అట్లూరి (కళలు, సంస్కృతి), దాము గేదల, కృష్ణ మద్దిపట్ల (కమ్యూనిటీ సర్వీస్), డాక్టర్ విజయ్ భాస్కర్ బొల్గం (మానవతా సేవ), నాగేశ్వరరావు పూజారి (చలనచిత్ర రంగం), రాజు చామర్తి (గ్లోబల్ తెలుగు హెరిటేజ్) తదితరులు అందుకున్నారు.
**మత సామరస్యం.. భక్తిపారవశ్యం**
తెలుగు, భారతీయ, అంతర్జాతీయ వంటకాలతో ఏర్పాటు చేసిన గ్రాండ్ బ్యాంక్వెట్‌తో ఈ మహాసభలు ప్రారంభమయ్యాయి. ప్రధాన సభలు మత సామరస్యానికి ప్రతీకగా హిందూ పూజారి, ఇమామ్, క్రైస్తవ పాస్టర్ల సంయుక్త ప్రార్థనలతో మొదలుకావడం అందరినీ ఆకట్టుకుంది. అనంతరం నిర్వహించిన శ్రీ సీతారామ శోభాయాత్ర, భద్రాచల సీతారామ కళ్యాణ మహోత్సవం, పట్టాభిషేక కార్యక్రమాలు హాజరైన వారిని భక్తిపారవశ్యంలో ముంచెత్తాయి. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటే లీడర్‌షిప్, బిజినెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మహిళా సాధికారత, వైద్య, న్యాయ, రాజకీయ, సాహిత్య రంగాలపై నిర్వహించిన ప్రత్యేక సదస్సులు ఆలోచింపజేశాయి. ‘మాటా సింగింగ్ స్టార్’ పోటీల్లో 300 మందికి పైగా గాయకులు పాల్గొని తమ గాత్ర ప్రతిభను చాటారు.
**సమిష్టి కృషితో మహాసభలు సక్సెస్**
సేవ, సంస్కృతి, సమానత్వం అనే నినాదంతో జరిగిన ఈ మహాసభలు ప్రపంచ తెలుగు సమాజ ఐక్యతను చాటిచెప్పాయి. మాటా అధ్యక్షుడు రమణ కిరణ్ దుద్దాగి, కన్వీనర్ శ్రీధర్ గూడల నాయకత్వంలో, వ్యవస్థాపకులు, అడ్వైజరీ కౌన్సిల్ సభ్యులు శ్రీనివాస్ గణగోని, ప్రదీప్ సామల, అడ్వైజరీ కౌన్సిల్ సభ్యులు జితేందర్ రెడ్డి మార్గదర్శకత్వంలో ఈ వేడుకలు విజయవంతమయ్యాయి. ఈ మహాసభల సక్సెస్‌లో కో-కన్వీనర్లు టోనీ జన్ను, దాము గేదల, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ప్రవీణ్ గుడూరు, జనరల్ సెక్రటరీ విజయ్ భాస్కర్ కలాల్, కన్వెన్షన్ కోఆర్డినేటర్ కళ్యాణి బెల్లంకొండ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నాగేశ్ చిలకపాటి, ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ మహేందర్ నారాల, డైరెక్టర్లు శిరీష గుండపునేని, స్వాతి అట్లూరి, అడిషనల్ సెక్రటరీ శ్రీధర్ పెంట్యాల, ఇండియా కోఆర్డినేటర్ డా. విజయ భాస్కర్ బొల్గం, మీడియా డైరెక్టర్ ప్రశాంత్ శ్రీపెరంబుదూరు, స్పోర్ట్స్ డైరెక్టర్ సురేష్ ఖాజానా తదితరుల సేవలు ఎంతో కీలకమైనవని నిర్వాహకులు కొనియాడారు.