ఢిల్లీ, మహా.
ఇరాన్ అత్యున్నత నేత, దివంగత ఆయతుల్లా సయ్యద్ అలీ ఖమెనీ అధికారిక అంత్యక్రియలకు హాజరు కావాల్సిందిగా భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఇరాన్ నుంచి ఆహ్వానం అందింది. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఈ మేరకు ప్రధాని మోదీని ఆహ్వానించారు. జులై 4 నుంచి జులై 9 వరకు ఇరాన్‌లోని వివిధ నగరాల్లో వారం రోజుల పాటు ఈ అంత్యక్రియల కార్యక్రమాలు జరగనున్నాయి.
ఫిబ్రవరి 28న టెహ్రాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన దాడుల్లో ఖమెనీతో పాటు పలువురు ఇరాన్ ఉన్నతాధికారులు ప్రాణాలు కోల్పోయిన విషయం విధితమే. వాస్తవానికి మార్చిలోనే ఆయన అంత్యక్రియలు జరగాల్సి ఉన్నప్పటికీ, దాడుల అనంతరం మధ్యప్రాచ్యంలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల కారణంగా అవి వాయిదా పడ్డాయి. తాజాగా ఏర్పాట్లు పూర్తి చేసిన ఇరాన్ ప్రభుత్వం.. జులై 4, 5 తేదీల్లో టెహ్రాన్‌లోని గ్రాండ్ మొసల్లా కాంప్లెక్స్‌లో ప్రజల సందర్శనార్థం ఖమెనీ భౌతికకాయాన్ని ఉంచనుంది. అనంతరం జులై 6న టెహ్రాన్‌లో భారీ అంతిమ యాత్రను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలను ఐఆర్జీసీ కమాండర్ హసన్ హస్సన్జాదే పర్యవేక్షిస్తున్నారు. అంత్యక్రియల నేపథ్యంలో టెహ్రాన్ ప్రావిన్స్‌లో ఆ మూడు రోజుల పాటు (జులై 4, 5, 6 తేదీల్లో) ప్రభుత్వ సెలవుదినంగా ప్రకటించారు.
విదేశీ ప్రముఖులతో పాటు సుమారు రెండు కోట్ల మంది ప్రజలు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారని టెహ్రాన్ అధికారులు అంచనా వేస్తున్నారు. టెహ్రాన్‌లో కార్యక్రమాలు ముగిసిన తర్వాత, జులై 7న పవిత్ర నగరమైన కోమ్‌లో నివాళులర్పించే కార్యక్రమం జరగనుంది. ఆపై జులై 9న ఖమెనీ జన్మస్థలమైన మషీద్లోని ఇమామ్ రెజా పవిత్ర క్షేత్రం వద్ద ఆయన మృతదేహాన్ని అధికారిక లాంఛనాలతో ఖననం చేస్తారు. ఈ రెండు నగరాల్లోనూ స్థానిక సెలవు దినాలు పాటించనున్నారు.
ఖమెనీ ప్రభావం కేవలం ఇరాన్‌కే పరిమితం కాకుండా పొరుగు దేశాల్లోనూ ఉండటంతో, ఇరాక్‌లోనూ జులై 8న నజఫ్, కర్బలా వంటి పవిత్ర నగరాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. కాగా, ఖమెనీ మృతి పట్ల భారత్ ఇప్పటికే తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. న్యూఢిల్లీలోని ఇరాన్ ఎంబసీని సందర్శించిన భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, భారత ప్రభుత్వం తరఫున అక్కడి సంతాప పుస్తకంలో సంతకం చేసి నివాళులర్పించారు.








