పాస్‌పోర్ట్ పౌరసత్వ ధృవీకరణ పత్రం కాదు.
* అది కేవలం అంతర్జాతీయ ప్రయాణానికే పరిమితం.
* 2025లో రికార్డు స్థాయిలో 1.39 కోట్ల పాస్‌పోర్టుల జారీ.
* పాస్‌పోర్ట్ సేవా దివస్ సందర్భంగా విదేశాంగ శాఖ వెల్లడి.
ఢిల్లీ, మహా.
పాస్‌పోర్ట్ వినియోగం, పౌరసత్వ ధృవీకరణకు సంబంధించి కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. భారతీయులకు జారీ చేసే పాస్‌పోర్ట్ దేశ పౌరసత్వాన్ని నిరూపించే అంతిమ పత్రం కాదని, అది కేవలం విదేశాలకు వెళ్లేందుకు ఉపయోగపడే అంతర్జాతీయ ప్రయాణ పత్రం మాత్రమేనని స్పష్టం చేసింది. ఒక వ్యక్తి విదేశాల్లో ఉన్నప్పుడు ఆయన జాతీయతను ధృవీకరించడానికి మాత్రమే ఇది ఉపయోగపడుతుందని తేల్చిచెప్పింది. పాస్‌పోర్ట్ సేవా దివస్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చేసిన ఈ అధికారిక ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. పౌరసత్వ గుర్తింపుపై గతంలో సుప్రీంకోర్టుతో పాటు ప్రభుత్వాలు పలుమార్లు స్పష్టత ఇచ్చినప్పటికీ.. తాజాగా మరోసారి క్లారిటీ ఇచ్చింది.
కేవలం పాస్‌పోర్ట్ మాత్రమే కాకుండా ఆధార్, ఓటర్ ఐడీ కార్డులపైనా గతంలో అత్యున్నత న్యాయస్థానం ఇటువంటి తీర్పులే ఇచ్చింది. అవి కేవలం వ్యక్తిగత గుర్తింపు, ఓటు హక్కు వినియోగానికి, నివాస ధృవీకరణకు మాత్రమే పరిమితమని స్పష్టం చేసింది. ప్రస్తుత చట్టాల ప్రకారం.. జనన ధృవీకరణ పత్రాలు లేదా నిర్దేశిత సంవత్సరాల కంటే ముందు నుంచి తల్లిదండ్రులు దేశంలోనే నివసించినట్లుగా నిరూపించే కేంద్ర ప్రభుత్వ అధికారిక పత్రాలే పౌరసత్వానికి అసలైన ఆధారాలని విదేశాంగ శాఖ ఈ సందర్భంగా పునరుద్ఘాటించింది.
ఇదే వేదికపై దేశంలో పాస్‌పోర్ట్ సేవల నెట్‌వర్క్ విస్తరణ, చిప్ ఆధారిత ఇ-పాస్‌పోర్ట్‌ల విజయాలను మంత్రిత్వ శాఖ పంచుకుంది. 2025వ సంవత్సరంలో ఏకంగా 1.5 కోట్ల పాస్‌పోర్ట్ సంబంధిత సేవలను అందించగా.. అందులో 1.39 కోట్లు కేవలం పాస్‌పోర్ట్‌లే కావడం విశేషం. సగటు ప్రాసెసింగ్ సమయం కూడా గణనీయంగా మెరుగుపడిందని, దరఖాస్తుదారులు ప్రస్తుతం పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల్లో 45 నిమిషాల కంటే తక్కువ సమయమే గడుపుతున్నారని అధికారులు వెల్లడించారు. కేవలం ఆరు పనిదినాల్లోపే పాస్‌పోర్ట్‌లను పౌరులకు అందజేస్తున్నామని తెలిపారు. అయితే, పోలీసు వెరిఫికేషన్ ప్రక్రియకు మాత్రమే కాస్త ఎక్కువ సమయం పడుతోందని, ఈ ఒక్క ప్రక్రియను భవిష్యత్తులో మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని కేంద్రం అభిప్రాయపడింది.








