అమరావతి పనులపై ప్రపంచ బ్యాంకు ఆరా.
* రాజధానిలో మౌలిక వసతుల కల్పనపై క్షేత్రస్థాయి పరిశీలన.
* ఎస్ఆర్ఎమ్ వర్సిటీలో నైపుణ్య శిక్షణా కార్యక్రమాలపై ఆరా.
అమరావతి, మహా.
ప్రజా రాజధాని అమరావతిలో శరవేగంగా జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ప్రపంచ బ్యాంకు దక్షిణాసియా ఉపాధ్యక్షుడు జోహన్నెస్ జుట్, లీడ్ ట్రాన్స్పోర్ట్ స్పెషలిస్ట్, అమరావతి సమగ్ర పట్టణాభివృద్ధి ప్రాజెక్టు (ఏఐయూడీపీ) టీటీఎల్ గెరాల్డ్ పాల్ ఒలివర్, ఎడ్యుకేషన్ స్పెషలిస్ట్ సౌమ్య బజాజ్లతో కూడిన ఉన్నతస్థాయి బృందం రాజధాని ప్రాంతంలో విస్తృతంగా పర్యటించింది. మౌలిక సదుపాయాల కల్పనతో పాటు సామాజిక అభివృద్ధి కార్యక్రమాలపై ఈ బృందం ప్రధానంగా దృష్టి సారించింది.
పర్యటనలో భాగంగా ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు తొలుత ఏపీసీఆర్డీఏ ప్రాజెక్టు కార్యాలయాన్ని సందర్శించారు. ఏఐయూడీపీ కింద రాజధానిలో చేపడుతున్న వివిధ పనుల తాజా పరిస్థితిపై సంబంధిత అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ప్రతినిధుల బృందం నేరుగా క్షేత్రస్థాయికి వెళ్లి అమరావతిలో అత్యంత కీలకమైన ట్రంక్ రోడ్ల నిర్మాణాలు, గ్రావిటీ కెనాల్ అభివృద్ధితో పాటు ఇతర మౌలిక సదుపాయాల కల్పన పనులను స్వయంగా పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న పనుల పురోగతిని, నాణ్యతా ప్రమాణాలను సీఆర్డీఏ అధికారులు ప్రపంచ బ్యాంకు బృందానికి కూలంకషంగా వివరించారు.
నిర్మాణ పనుల పరిశీలన అనంతరం ప్రపంచ బ్యాంకు బృందం ఎస్ఆర్ఎం యూనివర్సిటీని సందర్శించింది. ఏపీసీఆర్డీఏ సోషల్ డెవలప్మెంట్ విభాగం ఆధ్వర్యంలో స్థానిక యువతకు ఆ విశ్వవిద్యాలయంలో ఉచితంగా అందిస్తున్న స్వయం ఉపాధి నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను వారు నిశితంగా పరిశీలించారు. ఈ సందర్భంగా శిక్షణలో పాల్గొంటున్న అభ్యర్థులతో ప్రతినిధులు ముఖాముఖిగా మాట్లాడారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో భవిష్యత్తులో లభించబోయే ఉపాధి అవకాశాలు, వారి కెరీర్ ప్రణాళికలపై విద్యార్థులతో పరస్పరం చర్చలు నిర్వహించారు. అభివృద్ధి పనులతో పాటు స్థానికులకు ఉపాధి కల్పన దిశగా జరుగుతున్న కృషిని ప్రతినిధి బృందం అడిగి తెలుసుకుంది.







