Mahaa Daily Exclusive

  ఎల్‌పీఏఐ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన కేంద్ర మంత్రి బండి సంజయ్….

Share

ఎల్‌పీఏఐ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన కేంద్ర మంత్రి బండి సంజయ్.
* సరిహద్దు ప్రాంతాల అభివృద్ధిలో ల్యాండ్ పోర్టుల పాత్ర కీలకం: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి.

ఢిల్లీ, మహా.
దేశ సరిహద్దు ప్రాంతాల సమగ్ర అభివృద్ధి, అంతర్జాతీయ వాణిజ్య విస్తరణ, పొరుగు దేశాల ప్రజల మధ్య సంబంధాల బలోపేతంలో ల్యాండ్ పోర్టులు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాయని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ కొనియాడారు. బుధవారం సాయంత్రం ఆయన న్యూఢిల్లీలోని లోక్ నాయక్ భవన్‌లో ఉన్న ల్యాండ్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎల్‌పీఏఐ) ప్రధాన కార్యాలయాన్ని మర్యాదపూర్వకంగా సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రికి ఎల్‌పీఏఐ ఛైర్మన్ జయంత్ సింగ్, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బోర్డర్ మేనేజ్మెంట్ జాయింట్ సెక్రటరీ పసుమి బసు, ఎల్‌పీఏఐ సభ్యురాలు (ఫైనాన్స్) రేఖా రాయ్కర్ కుమారి ఘనంగా స్వాగతం పలికారు.
సందర్శనలో భాగంగా ఎల్‌పీఏఐ ఛైర్మన్ జయంత్ సింగ్ సంస్థ యొక్క విధివిధానాలు, గత కొన్నేళ్లుగా సాధించిన విశేష పురోగతిని కేంద్ర మంత్రికి వివరించారు. అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి సమగ్ర చెక్‌పోస్టుల (ఐసీపీలు) అభివృద్ధి, వాటి సమర్థ నిర్వహణలో సంస్థ తీసుకుంటున్న బాధ్యతలను ఆయన తెలియజేశారు. సరిహద్దు వాణిజ్యం, ప్రయాణికులకు కల్పిస్తున్న అత్యాధునిక వసతులు, వివిధ దేశాల మధ్య అనుసంధానాన్ని మెరుగుపరచడంలో ఎల్‌పీఏఐ పోషిస్తున్న పాత్రను ఈ సందర్భంగా వివరించారు. అనంతరం బండి సంజయ్ కుమార్ ఎల్‌పీఏఐ ప్రధాన కార్యాలయంలో ప్రదర్శనకు ఉంచిన వివిధ సమగ్ర చెక్‌పోస్టుల నమూనాలను ఆసక్తిగా పరిశీలించారు. సంస్థ సరిహద్దుల వెంబడి చేపడుతున్న మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎల్‌పీఏఐ ఛైర్మన్ కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను శాలువాతో ఘనంగా సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, ఆధునిక ల్యాండ్ పోర్టుల ఏర్పాటు వల్ల సరిహద్దు ప్రాంతాల్లో ఆర్థికాభివృద్ధి వేగవంతం కావడమే కాకుండా, అంతర్జాతీయ వాణిజ్యానికి, ప్రజల మధ్య సోదరభావాన్ని పెంపొందించడానికి ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. దేశ భద్రతను కాపాడటంతో పాటు, ప్రాంతీయ అభివృద్ధి, వాణిజ్య రంగాల పురోగతికి ఎల్‌పీఏఐ అందిస్తున్న సేవలు ఎంతో అభినందనీయమని మంత్రి కొనియాడారు.