- వెనిజులాలో భారీ భూకంపం
- పెను విధ్వంసం
- లక్ష మంది వరకు మృతి!
ఇంటర్నెట్, మహా : బుధవారం సాయంత్రం 45 సెకన్ల వ్యవధిలో వెనిజులాలో రెండు శక్తివంతమైన భూకంపాలు అతలాకుతలం చేశాయి. యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం, ఈ రెండు శక్తివంతమైన ప్రకంపనల తీవ్రత 7.1, 7.5గా నమోదై, భారీ నష్టాన్ని కలిగించాయి. రాజధాని కారకాస్ అత్యంత తీవ్రంగా దెబ్బతింది , అక్కడ అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. భూకంపం ధాటికి ప్రజలు భయకంపితులయ్యారు. భయాందోళనలతో పరుగులు తీశారు. రాజధాని కారకాస్‌లో ఊగిపోతున్న భవనాల నుంచి ప్రజలు బయటకు పరుగులు తీశారు. అనేక భవనాలు కూలిపోయాయి. ఒకప్పుడు సందడిగా ఉండే మార్కెట్లు ధ్వంసమయ్యాయి. చాలా ప్రాంతాలలో, భవనాలు శిథిలాల కుప్పగా మారాయి. యూఎస్ జీఎస్ ప్రకారం, వెనిజులా భూకంపంలో పలువురు మరణించినట్లు భావిస్తున్నారు. అయితే, ఇంకా అధికారిక సంఖ్యలు ఏవీ విడుదల కాలేదు. కానీ మృతుల సంఖ్య లక్ష వరకు ఉంటుందని మాత్రం అంచనా వేస్తున్నారు. అంతటి విధ్వంసం జరిగిందని చెబుతున్నారు.
ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలి : హోం మంత్రి కబెల్లో విజ్ఞప్తి
పలు రాష్ట్రాల్లో భూకంపం సంభవించిందని అంతర్గత వ్యవహారాల మంత్రి డియోస్డాడో కాబెల్లో చెప్పినట్లు కెఎస్ఎన్ పేర్కొంది. కారకాస్‌లోని అల్టమీరా ప్రాంతంలో ఇళ్లు, భవనాలు కూలిపోవడంతో పరిస్థితి విషమంగా మారిందని అన్నారు. ప్రకంపనల వల్ల కొన్ని భవనాలకు మరింత నష్టం వాటిల్లే అవకాశం ఉన్నందున, ప్రజలు సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని కోరారు. “అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడానికి మేము కృషి చేస్తున్నాము” అని ప్రకటించారు.
యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం, మొదటి భూకంపం తీవ్రత 7.1గా నమోదైంది. దాని కేంద్రం కారకాస్ నుంచి సుమారు 168 కిలోమీటర్ల దూరంలో, కరేబియన్ తీరంలోని మోరోన్ గ్రామానికి పశ్చిమంగా ఉంది. దాని లోతు 13 కిలోమీటర్లు. రెండో భూకంపం తీవ్రత 7.5గా నమోదైంది, దాని కేంద్రం మోరోన్‌కు నైరుతి దిశలో 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. రెండో భూకంపం లోతు 10 కిలోమీటర్లు. ఈ భూకంపం గత శతాబ్దంలో సంభవించిన అత్యంత శక్తివంతమైన భూకంపాలలో ఒకటిగా చెబుతున్నారు.
కారకాస్‌లోని చకావో మునిసిపాలిటీలో నాలుగు భవనాలు కూలిపోయాయని మేయర్ తెలిపారు. అదే సమయంలో, గ్వాయిరాలోని హోటల్ ఎడ్వర్డ్ పూర్తిగా కూలిపోయింది. భూకంపం వల్ల జరిగిన విధ్వంసం నేపథ్యంలో, వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ ఈ వినాశకరమైన భూకంపంపై దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
ప్రధాని మోదీ విచారం.. సాయం చేయడానికి భారత్ సిద్ధంగా ఉందని భరోసా
వెనిజులాలో భూకంపాల వల్ల జరిగిన నష్టంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు . వెనిజులాకు సాధ్యమైన అన్ని విధాలా సహాయం అందించడానికి భారత్ సిద్ధంగా ఉందని ఆయన భరోసా ఇచ్చారు. ఈ విపత్తులో ప్రియమైన వారిని కోల్పోయిన వారికి ఆయన సానుభూతి తెలియజేశారు. ప్రధాని మోదీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన ఎక్స్ లో పోస్ట్ చేస్తూ, “భారత్ తరపున, వెనిజులా ప్రభుత్వానికి, ప్రజలకు, ముఖ్యంగా ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం. ఈ క్లిష్ట సమయంలో బాధితులందరికీ సంఘీభావంగా నిలుస్తాం. సాధ్యమైనంత అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించడానికి భారత్ ఎప్పుడూ సిద్ధంగా ఉంది” అని రాసుకొచ్చారు.
అత్యవసర పరిస్థితి ప్రకటించిన వెనిజులా
రెండు శక్తివంతమైన భూకంపాలతో పరిస్థితి చాలా క్రిటికల్‌గా ఉంది. అందుకే వెనిజులా ఎన్ తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ అత్యవసర పరిస్థితిని ప్రకటించినట్లు సీఎన్ఎన్ నివేదించింది. మరణాలను అధికారులు ధృవీకరించారు. ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బుధవారం (స్థానిక కాలమానం ప్రకారం) చేసిన ప్రసంగంలో, ఈ విపత్తులో ప్రాణ, ఆస్తి నష్టాన్ని రోడ్రిగ్జ్ ధృవీకరించారు. కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అయితే, ఆమె మృతుల సంఖ్యను వెల్లడించలేదు.
వెనిజులా భూకంపానికి ముందే గూగుల్ అలర్ట్‌లు
వెనిజులాలో వరుసగా సంభవించిన భారీ భూకంపాలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. రిక్టర్ స్కేల్‌పై 7.1, 7.5 తీవ్రతతో నమోదైన ఈ ప్రకంపనల వల్ల అనేక భవనాలు దెబ్బతిన్నాయి. అయితే భూకంపం రాకముందే కొందరు తమ ఆండ్రాయిడ్ ఫోన్లలో గూగుల్ నుంచి హెచ్చరికలు అందుకున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించారు. దీంతో ‘భూకంపం రాకముందే గూగుల్‌కు ఎలా తెలుస్తుంది?’ అనే ప్రశ్న ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ప్రతి ఆధునిక స్మార్ట్‌ఫోన్‌లో ‘యాక్సిలరోమీటర్’ అనే సెన్సర్ ఉంటుంది. సాధారణంగా ఫోన్‌ను తిప్పినప్పుడు స్క్రీన్ ఆటోమేటిక్‌గా తిరగడానికి ఇదే కారణం. కానీ ఇదే సెన్సర్ భూమిలో వచ్చే చిన్న కంపనాలను కూడా గుర్తించగలదు. భూకంపానికి సంబంధించిన ప్రకంపనలను ఫోన్ గుర్తించిన వెంటనే, ఆ సమాచారం ఫోన్ ఉన్న ప్రాంత వివరాలతో కలిపి గూగుల్ ‘ఆండ్రాయిడ్ ఎర్త్‌క్వేక్ అలర్ట్స్ సిస్టమ్’కు చేరుతుంది. ఒకే ప్రాంతంలో ఉన్న అనేక ఫోన్లు ఒకే సమయంలో ఇలాంటి కంపనాలను నమోదు చేస్తే, అక్కడ భూకంపం సంభవిస్తున్నట్లు గూగుల్ సిస్టమ్ నిర్ధారిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లకు పైగా ఆండ్రాయిడ్ ఫోన్లు ఈ నెట్‌వర్క్‌లో భాగంగా ఉన్నాయి. దీంతో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ ‘భూకంప గుర్తింపు వ్యవస్థ’గా మారింది.
ముందే అలర్ట్ ఎలా?
భూకంపం ఒక్కసారిగా సంభవించదు. అది తరంగాల రూపంలో వ్యాపిస్తుంది. ‘పీ-వేవ్స్’ అనే ప్రాథమిక కంపనాలు తొలుత అత్యంత వేగంగా ప్రయాణిస్తాయి. కానీ ప్రభావం తక్కువగా ఉంటుంది. తర్వాత ఎక్కువ నష్టం కలిగించే ‘ఎస్-వేవ్స్’ అనే కంపనాలు వ్యాపిస్తాయి. అయితే పీ-వేవ్స్ కంటే నెమ్మదిగా ప్రయాణిస్తాయి.
ముందుగా వచ్చే పీ-వేవ్స్‌ను ఫోన్లు గుర్తించి గూగుల్ సర్వర్లకు సమాచారం పంపిస్తాయి. ఈ డేటాను విశ్లేషించిన గూగుల్, ఎస్-వేవ్స్ చేరుకునేలోపే వినియోగదారులకు హెచ్చరికలు పంపగలుగుతుంది. సరళంగా చెప్పాలంటే… భూకంప తరంగాల కంటే ఇంటర్నెట్ ద్వారా సమాచారం కాంతి వేగానికి సమీపంగా ప్రయాణిస్తుంది. అందుకే కొన్ని సెకన్ల ముందే అలర్ట్ అందుతుంది.
రెండు రకాల హెచ్చరికలు
ఆండ్రాయిడ్‌లో భూకంపాల కోసం రెండు రకాల అలర్ట్‌లు ఉంటాయి. ‘బీ అవేర్ అలర్ట్’- తేలికపాటి ప్రకంపనలు సంభవించే అవకాశం ఉన్నప్పుడు ఈ హెచ్చరిక వస్తుంది. ‘టేక్ యాక్షన్ అలర్ట్’-మోస్తరు లేదా తీవ్రమైన భూకంపం వచ్చే అవకాశం ఉన్నప్పుడు ఈ అలర్ట్ కనిపిస్తుంది. వెంటనే సురక్షిత ప్రాంతానికి వెళ్లేందుకు ఇది ఉపయోగపడుతుంది.
అలర్ట్‌పై క్లిక్ చేస్తే భూకంపం కేంద్రం, తీవ్రత, భద్రతా సూచనలు, మ్యాప్ వంటి వివరాలు కూడా కనిపిస్తాయి.








