Mahaa Daily Exclusive

  అసలు సూత్రధారులను వదలొద్దు!

Share

అసలు సూత్రధారులను వదలొద్దు!

* ఎర్రచందనం స్మగ్లర్ల మూలాలు ఛేదించండి.

* అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఆదేశం.

* టాస్క్‌ఫోర్స్‌ బృందానికి అభినందనలు.

అమరావతి, మహా.

రాష్ట్రంలో ఎర్రచందనం అక్రమ రవాణాకు పూర్తిగా అడ్డుకట్ట వేయాలని, పట్టుబడిన వారితోనే సరిపెట్టకుండా ఈ దందా వెనక ఉన్న అసలైన సూత్రధారులను గుర్తించి కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అధికారులను ఆదేశించారు. ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక దళం (టాస్క్‌ఫోర్స్‌) ఇటీవల చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌ విజయవంతం కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఏకంగా రూ.2 కోట్ల విలువైన 109 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్న టాస్క్‌ఫోర్స్‌ బృందం పనితీరును ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

ఈ ఆపరేషన్‌లో భాగంగా ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న నల్లాని నందకుమార్‌తో పాటు మరో ఇద్దరు నిందితులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. కేవలం పట్టుబడిన ఈ క్షేత్రస్థాయి నిందితులతోనే దర్యాప్తును ఆపేయకూడదని స్పష్టం చేశారు. ఈ అక్రమ రవాణాను వెనకుండి నడిపిస్తున్న పెద్ద తలకాయలు ఎవరెవరు ఉన్నారనే దానిపై లోతైన విచారణ జరిపి, వారిని చట్టం ముందు నిలబెట్టాలని దిశానిర్దేశం చేశారు.

రాష్ట్ర అటవీ సంపద పరిరక్షణ విషయంలో ప్రభుత్వం ఏమాత్రం రాజీపడే ప్రసక్తే లేదని పవన్‌ కల్యాణ్‌ తేల్చిచెప్పారు. స్మగ్లింగ్‌ ముఠాల కదలికలు, వారి కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంచాలని, వారి నెట్‌వర్క్‌ మూలాలను సమూలంగా నిర్మూలించేలా మరింత పకడ్బందీ చర్యలు చేపట్టాలని సూచించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎర్రచందనం అక్రమ రవాణా ఉదంతాలు దాదాపు 70 శాతం వరకు తగ్గుముఖం పట్టాయని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.