Mahaa Daily Exclusive

  ఉద్యోగులకు మహా భరోసా.. రూ.కోటి ప్రమాద బీమా.

Share

ఉద్యోగులకు మహా భరోసా.. రూ.కోటి ప్రమాద బీమా.

* ప్రభుత్వ, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది అందరికీ వర్తింపు.

* సింగరేణి తరహాలోనే రాష్ట్రవ్యాప్తంగా అమలు.

* నేను దొరను కాను.. కేబినెట్‌కు మేస్త్రీని మాత్రమే!

* గతంలో 10వ తేదీ వచ్చినా జీతాల్లేవు.. ఇప్పుడు ఒకటో తేదీనే ఇస్తున్నాం.

* రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి వెల్లడి.

హైదరాబాద్‌, మహా.

రాష్ట్ర ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం దిశగా తెలంగాణ సర్కారు మరో బృహత్తర నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ విధానంలో పనిచేస్తున్న వారందరికీ ఏకంగా రూ.కోటి మేర ప్రమాద బీమాను కల్పిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఉద్యోగుల కుటుంబాలకు ఆపత్కాలంలో పూర్తిస్థాయి ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ భారీ ప్రమాద బీమా పథకాన్ని ముందుగా సింగరేణిలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేశామని, ఆ సంస్థలో ఇప్పటికే 45 మంది కార్మికుల కుటుంబాలకు ఈ బీమా సాయం అందించి ఆదుకున్నామని సీఎం గుర్తుచేశారు.

తాను ఓ సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తినని, అందుకే క్షేత్రస్థాయిలో ఉద్యోగులు ఎదుర్కొనే సాధకబాధకాలు తనకు సంపూర్ణంగా తెలుసని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో అగ్రస్థానంలో కొనసాగడంలో ప్రభుత్వ సిబ్బంది శ్రమ ఎంతో దాగి ఉందన్నారు. వారి ప్రాణాలకు భద్రత కల్పించడంతో పాటు వారి కుటుంబాల బాధ్యతను కూడా ప్రభుత్వం తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఎవరెన్ని విమర్శలు చేసినా, అవహేళనలకు గురిచేసినా తాను ఏమాత్రం పట్టించుకోనని.. తనకు పదవులు, హోదాల కంటే ప్రజలతో ఉన్న అనుబంధమే శాశ్వతమని ఉద్ఘాటించారు. తనను ముఖ్యమంత్రిగా పిలవడం కంటే ‘రేవంతన్న’ అని పిలిపించుకోవడమే తనకు ఎంతో ఇష్టమని మనసులోని మాటను పంచుకున్నారు.

తాను గడీల్లో ఉండే దొరను కాదని, నిత్యం ప్రజల మధ్య నుంచి ఎదిగిన వ్యక్తినని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ మంత్రివర్గానికి తాను కేవలం ఓ ‘మేస్త్రీ’ లాంటి వాడినంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇదే క్రమంలో గత ప్రభుత్వ పాలనపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గత పదేళ్ల పాలనలో ప్రతి నెలా 10వ తేదీ దాటినా ఉద్యోగులకు జీతాలు రాని దుస్థితి ఉండేదని, తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే నాటికి రాష్ట్ర ఖజానా పరిస్థితి పూర్తిగా అగమ్యగోచరంగా తయారైందని దుయ్యబట్టారు. తమ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితిని క్రమంగా గాడిలో పెట్టి, 2024 జనవరి 1 నుంచి ప్రతి నెలా ఒకటో తేదీనే ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో ఠంచనుగా వేతనాలు జమ చేస్తున్నామని ముఖ్యమంత్రి సగర్వంగా ప్రకటించారు.