మెట్రో లెక్కల తేల్చే బాధ్యత ‘ఎస్బీఐ క్యాప్స్’కు!
* మొదటి దశ విలువ నిర్ధారణపై మరోసారి సమగ్ర అధ్యయనం.
* ఈసారి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షణలోనే ప్రక్రియ.
* రెండో దశ విస్తరణపైనా మదింపు.. వచ్చేవారం రంగంలోకి కన్సల్టెంట్.
* రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో ఎల్అండ్టీ ప్రతినిధుల భేటీ.
హైదరాబాద్, మహా.
భాగ్యనగర ప్రజా రవాణా వ్యవస్థలో అత్యంత కీలకమైన హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి ఢిల్లీ వేదికగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మెట్రో మొదటి దశ (ఫేజ్-1) ప్రాజెక్టు విలువ నిర్ధారణను (వాల్యుయేషన్) మరోసారి చేపట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్ణయించాయి. ఇటీవల కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, మనోహర్‌లాల్ ఖట్టర్‌ల మధ్య రెండు రోజుల పాటు జరిగిన ఉన్నత స్థాయి చర్చల్లో ఈ మేరకు ఒక స్పష్టమైన అవగాహనకు వచ్చారు. ఈసారి ఈ మదింపు ప్రక్రియ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షణలోనే సాగనుంది. ఇందుకోసం ప్రముఖ ఆర్థిక సలహా సంస్థ ‘ఎస్బీఐ క్యాప్స్’ను కన్సల్టెంట్‌గా కేంద్రం రంగంలోకి దించింది. మొదటి దశ మదింపుతో పాటు ప్రతిపాదిత రెండో దశ (ఫేజ్-2) విస్తరణ, ఇతర ఆర్థికాంశాలపై ఈ సంస్థ సమగ్ర అధ్యయనం చేయనుంది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వెలువడిన వెంటనే, బహుశా వచ్చే వారం నుంచే ఎస్బీఐ క్యాప్స్ క్షేత్రస్థాయిలో పరిశీలన ప్రారంభించనుంది.
**ఐడీబీఐ నివేదిక ఆధారంగానా? సరికొత్త అధ్యయనమా?**
గతంలో మెట్రో మొదటి దశను ఎల్అండ్టీ సంస్థ నుంచి రాష్ట్ర ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకోవాలని భావించినప్పుడు ఒకసారి ప్రాజెక్టు విలువను లెక్కించారు. నాడు టెండర్ల ద్వారా ఎంపికైన ‘ఐడీబీఐ క్యాపిటల్’ ఏజెన్సీ ఆర్థిక, న్యాయపరమైన అన్ని కోణాలను క్షుణ్ణంగా పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ప్రకారం.. మెట్రో ఆధీనంలో ఉన్న మాల్స్, విలువైన భూములతో కలిపి రూ.19,136 కోట్లు ‘రెడీ టు యూజ్’ కింద, రూ.22,102 కోట్లు ‘ఫ్రీహోల్డ్’ కింద ఉన్నట్లు అంచనా వేశారు. అలాగే సాంకేతిక అంశాలపై దిల్లీ మెట్రో అనుబంధ సంస్థ ‘డీఎంఐఎల్’ ఇచ్చిన నివేదికను కూడా పరిగణనలోకి తీసుకుని, మొత్తంగా రూ.15వేల కోట్లకు మెట్రోను కొనుగోలు (టేకోవర్) చేయాలని ఏప్రిల్ 29న ఎల్అండ్టీతో రాష్ట్ర ప్రభుత్వం వాటా కొనుగోలు ఒప్పందం కూడా చేసుకుంది. అయితే, ఇప్పుడు కేంద్రం నియమించిన ఎస్బీఐ క్యాప్స్ పాత నివేదిక ఆధారంగానే లెక్కలను పునఃపరిశీలిస్తుందా? లేక పూర్తిగా మొదటి నుంచి సరికొత్తగా మదింపు చేపడుతుందా? అన్నది ఇప్పుడు అధికార వర్గాల్లో సర్వత్రా ఆసక్తి రేపుతోంది.
**విలువల లెక్కింపులో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు!**
మెట్రో ఆస్తులను మరోసారి లెక్కించినప్పటికీ తుది ప్రాజెక్టు విలువలో పెద్దగా మార్పులు వచ్చే అవకాశం ఉండదని ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం పిలిచిన టెండర్లలో ఎస్బీఐ క్యాప్స్ కూడా పాల్గొన్నప్పటికీ, అధిక ధర కోట్ చేయడంతో నాడు ఎంపిక కాలేదు. గతంలో నిజాం షుగర్స్ టేకోవర్ ప్రక్రియలో పాల్గొన్న అనుభవం ఈ సంస్థకు ఉంది. నాటి ఐడీబీఐ క్యాపిటల్ ఇచ్చిన నివేదికను అటు ఎల్అండ్టీ సంస్థ కూడా క్రాస్ చెక్ చేసుకుందని, వివిధ ప్రాంతాల్లో ఉన్న మెట్రో భూముల మార్కెట్ విలువల్లో స్వల్ప హెచ్చుతగ్గులు తప్ప.. ఓవరాల్‌గా ప్రాజెక్ట్ విలువలో పెద్ద తేడాలు ఉండవని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
**సచివాలయంలో కీలక భేటీ**
ఢిల్లీలో జరిగిన తాజా పరిణామాల నేపథ్యంలో ఎల్అండ్టీ మెట్రోరైలు ప్రతినిధులు బుధవారం సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) రామకృష్ణారావుతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మెట్రోరైలు ఎండీతో పాటు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మెట్రో టేకోవర్ అంశంపై కేంద్ర ప్రభుత్వంతో జరిగిన చర్చల వివరాలను, కేంద్రం పర్యవేక్షణలో జరగబోయే ఎస్బీఐ క్యాప్స్ మదింపు ప్రక్రియ తాలూకు ముఖ్యాంశాలను సీఎస్ ఈ సందర్భంగా ఎల్అండ్టీ ప్రతినిధులకు వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో మెట్రో విలువను పక్కాగా నిర్ధారించి, ప్రాజెక్టును మరింత ముందుకు తీసుకెళ్లేలా ఈ చర్యలు ఉంటాయని అధికార వర్గాలు తెలిపాయి.








