Mahaa Daily Exclusive

  చిరు వ్యాపారులకు కేంద్రం తీపికబురు…

Share

చిరు వ్యాపారులకు కేంద్రం తీపికబురు.
* ఆహార భద్రతా నిబంధనల సరళీకరణ.
*నాన్-మాన్యుఫ్యాక్చరింగ్ సంస్థలకు రికార్డుల నిర్వహణ నుంచి మినహాయింపు.
*ఇకపై తయారీదారులకే ‘ఫస్ట్ ఇన్, ఫస్ట్ అవుట్’ కఠిన నిబంధనలు.
* ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ దిశగా ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం.
ఢిల్లీ, మహా.
దేశవ్యాప్తంగా ఉన్న చిన్న, మధ్య తరహా ఆహార వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. వ్యాపార నిర్వహణను మరింత సులభతరం చేసే (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) దిశగా కీలక అడుగులు వేసింది. ఇందులో భాగంగా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ (ఆహార భద్రత, ప్రమాణాలు) నిబంధనలు-2011కు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పలు ముఖ్యమైన సవరణలు చేస్తూ తాజా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ సవరణల ప్రకారం, కేవలం ఆహార పదార్థాల విక్రయాలు జరిపే (తయారీదారులు కాని) సంస్థలకు కఠిన నిబంధనల నుంచి మినహాయింపు లభించింది.
గత నిబంధనల ప్రకారం.. లైసెన్స్ పొందిన ప్రతి ఆహార వ్యాపార సంస్థ తప్పనిసరిగా స్టాక్ రికార్డులను పక్కాగా నిర్వహించాల్సి వచ్చేది. అలాగే సరుకు నిల్వల విషయంలో ‘ఫస్ట్ ఇన్, ఫస్ట్ అవుట్’ (ముందు వచ్చిన సరుకు ముందు విక్రయించడం), ‘ఫస్ట్ ఎక్స్‌పైరీ, ఫస్ట్ అవుట్’ (గడువు ముగిసే సరుకును ముందుగా విక్రయించడం) వంటి కఠిన పద్ధతులను విధిగా పాటించాలన్న నిబంధన ఉండేది. తాజా సవరణలతో రిటైలర్లు, ఇతర చిన్న తరహా విక్రయదారులకు ఈ రికార్డుల నిర్వహణ భారం తప్పనుంది. అయితే, ప్రజల ఆరోగ్యం, ఆహార భద్రత, నాణ్యతా ప్రమాణాల దృష్ట్యా ఈ నిబంధనలు ఇకపై కేవలం ఆహార పదార్థాలను స్వయంగా ఉత్పత్తి చేసే తయారీ రంగ సంస్థలకు (మాన్యుఫ్యాక్చరర్లకు) మాత్రమే వర్తిస్తాయని కేంద్రం స్పష్టం చేసింది.
చిన్న తరహా వ్యాపారులపై అనవసరమైన నియంత్రణ భారాన్ని తగ్గించి, వారు తమ కార్యకలాపాలను సాఫీగా నిర్వహించుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నీతి ఆయోగ్ ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ చేసిన సిఫార్సుల మేరకు, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, వ్యాపార రంగ భాగస్వాములతో విస్తృత స్థాయి చర్చలు జరిపిన అనంతరం ఈ సంస్కరణలకు తుదిరూపు ఇచ్చినట్లు స్పష్టం చేసింది.
దేశంలో ఆహార భద్రతా వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు వ్యాపారులకు స్నేహపూర్వక వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం గత కొంతకాలంగా పటిష్ట చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే శాశ్వత లైసెన్సుల జారీ విధానం, ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ల సరళీకరణ, టర్నోవర్ పరిమితుల్లో మార్పులు తీసుకువచ్చింది. వీధి వ్యాపారులపై ఉన్న ద్వంద్వ నిబంధనలను సైతం తొలగించింది. రిస్క్ ఆధారిత (ప్రమాద తీవ్రతను బట్టి) తనిఖీల విధానం ద్వారా వ్యాపారులకు ఇబ్బందులు కలగకుండా చూస్తున్నామని, తాజాగా తీసుకున్న నిర్ణయం ఎంఎస్ఎంఈ (సూక్ష్మ, చిన్న, మధ్య తరహా) రంగానికి మరింత ఉత్సాహాన్నిస్తుందని ప్రభుత్వ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.